అధిక ఫీజుల నియంత్రణకు  విద్యార్థి సంఘాలు  ఉమ్మడిగా పోరాటం చేయాలి

Jun 20, 2026 - 23:34
Jun 20, 2026 - 23:42
 0  0
అధిక ఫీజుల నియంత్రణకు  విద్యార్థి సంఘాలు  ఉమ్మడిగా పోరాటం చేయాలి

అధిక ఫీజుల నియంత్రణకు  విద్యార్థి సంఘాలు  ఉమ్మడిగా పోరాటం చేయాలి.  

ఉపాధ్యాయ  ప్రజా సంఘాలను కలుపుకొని విద్య  ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తావా?  

భారీగా ఫీజులు తగ్గిస్తావా? ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వాల్సిందే.....

-  వడ్డేపల్లి మల్లేశం. 

రాష్ట్రంలో విద్యారంగంలో ప్రైవేటు వ్యవస్థలో అధిక ఫీజుల నియంత్రణకు  ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని,  భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో ఫీజులను వసూలు చేస్తూ  రాష్ట్ర  ప్రైవేట్విద్యా వ్యవస్థ   రాష్ట్ర ప్రతిష్ట అపహాస్యం చేస్తున్నదని  రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు  స్వయంగా విద్యారంగ సమీక్షపై కొనసాగిన చర్చలో  ముఖ్యమంత్రి గారితో చెప్పారంటే  తెలంగాణలో ఉన్నటువంటి  ప్రైవేటు దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీజుల వ్యవస్థ, టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో   పేరెంట్స్ కమిటీ మేరకు  ఏర్పడిన తిరుపతిరావు గారి కమిషన్ చేసిన సిఫారసులు,  ఆనాటి లో పాయి కారి ఒప్పందాలు,  నాటి ప్రభుత్వం విఫలం కావడంతో పది నుండి 30% ఏటా పెంచడం వల్ల  ఇవాళ దేశంలోనే  అత్యధిక ఫీజులు వసూలు చేసే రాష్ట్రంగా తెలంగాణ మిగిలిపోవడం సిగ్గుచేటు.  ఈ దుర్భర పరిస్థితుల పైన  విద్యాభిమానులుగా  రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ మేధావి ప్రజా సంఘాలను కలుపుకొని  ప్రైవేటు విద్యావ్యవస్థలో కొనసాగుతున్న పరిణామాన్ని మొత్తం అధ్యయనం చేయడం ద్వారా  రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాల్సిన అవసరం ఉన్నదని  అనేకమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్యకు దూరమవుతూ  అప్పుల పాలవుతున్న సంగతి మరిచిపోతే ఎలా?  ఇది విద్యార్థి మేధావి ఉపాధ్యాయ ప్రజా సంఘాల యొక్క సామాజిక బాధ్యతని గుర్తించాలని నా విజ్ఞప్తి.

బుద్దిజీవులుగా ఆలోచించాలి

ప్రస్తుతం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇదే దుర్భరమైన పరిస్థితులు కొనసాగుతుంటే కొఠారి కమిషన్ 1966 లో చేసిన సూచన కామన్ స్కూల్ ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగంలోనే విద్యను కొనసాగాలని  సిఫారసును ఏనాడు అమలు చేయని భారతీయ ప్రభుత్వం  ఇప్పటికీ ప్రజల ముందు తలవంచి  తప్పును అంగీకరించాలి.  కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా  విద్య మొత్తాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. అలా దమ్ము ధైర్యం లేకుంటే  తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి ఫీజుల వ్యవస్థను ఆధారం చేసుకుని నామమాత్రపు  ఫీజుల మేరకు ప్రైవేట్ రంగంలో విద్యను అనుమతించాలి.  కానీ ప్రైవేటు ఫీజుల దోపిడీ యదేచ్ఛగా కొనసాగుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవడం నిజంగా అవమానకరం.  అది కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా సమానంగా బాధ్యత భరించాల్సిందే.  సుమారు రెండు సంవత్సరాలు విద్యా కమిషన్ చైర్మన్ గా తన బృందంతో  కొనసాగించినటువంటి పరిశీలన అంశాల పైన  ఫిబ్రవరి 27, 2026 తేదీన  ముఖ్యమంత్రి గారితో విద్యారంగం పైన జరిగిన చర్చలో  కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు తెలిపిన వివరాలు భయంకరంగా ఉన్నాయి.  కమిషన్ చైర్మన్ గా లేనప్పుడు  అసలు విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ప్రైవేట్ రంగంలో ఉండకూడదని స్పష్టంగా ప్రకటించి ఉన్నారు కానీ కమిషన్ చైర్మన్ గా సిఫారసులను అందించినప్పుడు మాత్రం  పూర్తిగా ప్రైవేటు వ్యవస్థను నిరాకరించకుండా ఫీజుల దోపిడిని మాత్రం ఎత్తి చూపడాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.

ఆకునూరి మురళి గారిచ్చిన కొన్ని వివరాలు

 విద్యార్థి సంఘాలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏమిటంటే  యువత  ఆలోచన సరళి,  అవినీతిని ప్రశ్నించే ధోరణి,  మానవతా విలువలతో ఉన్నటువంటి మీకు  ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న దోపిడీని అడ్డుకునే శక్తి ఉంది.  కానీ కేవలం స్థానికంగా ఏ సంఘానికి ఆ సంఘమే పత్రికా ప్రకటనలతో చిన్న పోరాటాలతో ఈ ఉద్యమం సాధ్యం కాదు.  రాష్ట్రస్థాయిలో అన్ని విద్యార్థి సంఘాలు  ఏకమై  డిమాండ్లను పొందుపరచుకొని  ప్రభుత్వాన్ని మెడలు వంచవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అందుకోసం నాకు దృష్టికి వచ్చిన కొన్ని విషయాలను మీ ముందు ప్రస్తావిస్తున్నాను.

పదేళ్ల కిందట తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో సరాసరి వార్షిక ఫీజు 50,000 ఇప్పుడు అది 1,90,000 కు చేరింది అంటే రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అర్థం చేసుకోవచ్చు అని  చైర్మన్ వ్యాఖ్యానించారు.  2014 తర్వాత ఏర్పాటు చేసినటువంటి తిరుపతిరావు కమిషన్  ఎటు తేల్చుకోలేక ఏటా పది శాతం ఫీజులను పెంచుకోవచ్చని అనుమతించి  ఉచిత సలహాతో ప్రైవేట్ సంస్థలకు మద్దతు పలికి ప్రజలకు ద్రోహం చేసింది.  దాని పరిణామం కారణంగా ఇవాళ ప్రైవేట్ విద్యాసంస్థలు  ఏటా 10 నుండి 30% ఫీజులను పెంచుకుంటూ పోతున్నాయి అని  స్వయంగా ఆకునూరు మురళి గారు  ముఖ్యమంత్రితో చర్చించడం  ప్రాధాన్యతను సంతరించుకున్నది.  2015- 16 సంవత్సరములో తెలంగాణలో సరాసరి పేజీ 50,000 ఉంటే ఉత్తరప్రదేశ్లో 35000 తమిళనాడులో 40000 ఆంధ్రప్రదేశ్లో 38,000 ఢిల్లీలో మాత్రం 60000 ఉండేదని  ప్రస్తుతం ఈ 2025 26 సంవత్సరానికి ఉత్తర ప్రదేశ్ లో 95,000 తమిళనాడులో 1లక్ష, ఆంధ్రప్రదేశ్లో 1లక్ష  ఢిల్లీలో 1.,60 ఉందని తెలంగాణలో మాత్రం 1,90,000గా ఉందని ఈ కమిషన్  వివరాలతో సహా తెలిపింది.  ఇదే సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే పేద వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ కళాశాల తరహాలో ప్రత్యేకంగా ఫీజు నియంత్రణకు కమిటీ ఉండాలని  ముఖ్యమంత్రికి సూచించినప్పటికీ  సూచనలు అంగీకరించినారే తప్ప తల్లిదండ్రులపై భారం పడకుండా చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ఇవ్వడంతోనే సరిపోదు.  విద్యా కమిషన్ సూచన మేరకు చట్టబద్ధమైనటువంటి ఫీజు నియంత్రణ కమిషన్ ఏర్పరిచినారా? తెలుసుకోవలసినటువంటి అవసరం విద్యార్థి సంఘాలపై స్పష్టంగా ఉంది.  ఇంకా అదే విద్యా కమిషన్ తన సిఫారసులలో  రవాణా కోసం, బోర్డింగు, భోజనము, విహారయాత్రలు, క్యాప్టేషన్ ఫీజు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, స్టేషనరీ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే   తెలంగాణలోని ఎక్కువ ఉన్నాయని అసహనం వ్యక్తం చేయడం  గమనించాల్సిన అవసరం ఉంది.

విద్యార్థి సంఘాలకు విజ్ఞప్తి

ఒక్కొక్క సంఘము స్థానికంగా జిల్లా మండల స్థాయిలో తీసుకుంటున్న పోరాట కార్యక్రమాలు సరిపోవడం లేదు.  ముఖ్యంగా ప్రైవేటు ఫీజు నియంత్రణ అనేది రాష్ట్రస్థాయి సమస్య.  ఏ ప్రభుత్వం ఉన్నా మొక్కుబడిగా కమిటీని వేయడం కాలయాపనతో దశాబ్దాలే గడిచిపోయింది. ప్రస్తుతం మనం మొత్తం విద్యావ్యవస్థ యావత్తు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని కామన్ స్కూల్ ప్రవేశపెట్టాలని బడ్జెట్లో విద్యకు 30% కేటాయించాలని డిమాండ్తో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది సాధ్యం కాదని చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం తెలిపితే అప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఫీజులను నియంత్రణ సగానికి సగం తగ్గించేలా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండే రెండు డిమాండ్లతో చేసే పోరాటం సత్ఫలితాలనుస్తుందని మీరందరూ మేధావులు బుద్ధి జీవులు ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని విస్తృత స్థాయిలో పోరాటం చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని  ఒక రిటైర్డ్ ఉపాధ్యాయునిగా కవిగా రచయితగా నా ఆవేదన.  రెండే రెండు డిమాండ్లతో ప్రభుత్వానికి అల్టిమేషన్ ఇవ్వడం ద్వారా1)  అయితే ప్రభుత్వ రంగంలో విద్యను కొనసాగిస్తావా?2) లేకుంటే ప్రైవేట్ లో ఫీజులను సగానికి సగం భారీగా తగ్గించి సామాన్య పేద వర్గాలకు సహకరిస్తావా? అని తేల్చు కోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో విద్యాహక్కు చట్టం ప్రకారంగా కార్పొరేట్ స్కూల్లో 25%   సీట్లను పేద వర్గాలకు కేటాయించడం లేదు  పేద వర్గాలకు ఉచితంగా కేటాయించే విధంగా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అటువంటి సామాజిక బాధ్యత బుద్ధి జీవులుగా మనందరి పైన ఉంది.

 ప్రైవేటు ఫీజుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ కోసం  ఆనాడు ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తెలిసినప్పటికీ ఇప్పటివరకు ప్రత్యేక వ్యవస్థ అంటూ బహుశా లేదు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ద్వారా వాస్తవాలను తెలుసుకొని  మన డిమాండ్లను ముందు పెట్టడం ద్వారా  పెట్టుబడిదారీ విద్య పక్కన పెట్టి ప్రభుత్వ రంగంలో నాణ్యమైనటువంటి విద్య కామన్ స్కూల్ ద్వారా అన్ని వర్గాలకు ఒకే విద్యను అందించడానికి  కృషి చేయగలిగితే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లే.  స మ సమాజ స్థాపనకు తెలంగాణ రాష్ట్రంలో బీజం పడినట్లే అవుతుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాలంలో 17% నిధులను బడ్జెట్కు కేటాయిస్తే  ప్రస్తుతము ఎనిమిది తొమ్మిది శాతం దగ్గర ఉన్నామంటే మనం ఏ వైపు అర్థం చేసుకోవచ్చు.  ఇదే సందర్భంలో కొఠారి కమిషన్ సూచన మేరకు కేంద్రం 10% రాష్ట్రo 30% విద్యా రంగానికి బడ్జెట్లో కేటాయించాలని ప్రధాన డిమాండ్ గా పెట్టుకొని పోరాటాన్ని ఉద్రతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు విజ్ఞప్తి చేస్తూ  ప్రజలు  ఇతర ఉచితలకు అలవాటు పడినందున విద్య వైద్యాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు.

 దానివల్ల మనం చేపడుతున్నటువంటి పోరాటాలకు మద్దతు లభించడం లేదు  అందుకే విద్యార్థులుగా మేధావులుగా ఎక్కడికక్కడ మనం ప్రజల్లో భాగమై  విద్యా వైద్యానికి మాత్రమే డిమాండ్ చేయగలిగితే ఇతర ఉచితాలను నిరాకరించగలిగితే  ప్రజల యొక్క కొనుగోలు శక్తి భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.  తద్వారా ఆరోగ్యం విద్య ద్వారా చైతన్యం  ఉపాధి అవకాశాలు మెరుగు పడటానికి  పరోక్షంగా పేదరికం నిర్మూలించడం ద్వారా ఆత్మహత్యలను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది లేకుంటే అసమానతలు అంతరాలతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థలో విద్యారంగంలో వేలాది లక్షలాది కుటుంబాలు  ప్రైవేటు ఫీజు దోపిడీకి గురవుతుంటే చూస్తే  అంతకుమించిన నేరం మరొకటి ఉండదు.    విద్యా కమిషన్ మద్దతు కూడా మనకు లభిస్తుంది అనే విషయం  విద్యార్థి సంఘాలు గుర్తిస్తే  కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది అయితే కలిసి పోతేనే కలదు సుఖము  ఉమ్మడి పోరాటంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టవచ్చు అది సాధ్యం  అందుకు మన ఐక్యత నిదర్శనం కావాలి.

( తమిళనాడు ప్రభుత్వం  ప్రకటించిన ఫీజుల వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం  ఎల్కేజీ యూకేజీ కి 16640  ఒకటి నుండి ఐదవ తరగతి వరకు 18635  ఆరు ఏడు తరగతి లకు 20635  9 10 తరగతి లకు 22,965  ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ కు 25825  వివరాలు అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించినట్లు అనేక ప్రకటనల్లో  చూడడం జరిగింది  అన్ని రాష్ట్రాలు కూడా దమ్ముంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  ఈ రేట్లు అమలు చేసి తన సత్తాను చాటుకోవాలి)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333