జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతపై తనిఖీలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Jun 15, 2026 - 20:27
Jun 15, 2026 - 20:28
 0  9
జిల్లా వ్యాప్తంగా ఆహార భద్రతపై తనిఖీలు చేపట్టాలి

సూర్యాపేట  15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. సోమవారం  కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆహార భద్రతపై జిల్లా స్థాయి సలహా కమిటీ (డీఎల్‌ఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆహార భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

15 రోజులకొకసారి కార్యాచరణ ప్రణాళిక,  ప్రత్యేక నిఘా

 ప్రతి పదిహేను 15 రోజులకు ఒకసారి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు. వినియోగదారులకు స్వచ్ఛమైన పాలు అందేలా పాలు, పాల ఉత్పత్తుల విక్రయదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిత్యవసర పాలు, నూనెలు, మాంసం, గుడ్లు, స్వీట్లు, మరియు సిద్ధం చేసిన ఆహార పదార్థాలపై నిఘా పెంచి, నమూనాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

 * *జాతీయ రహదారిపై దాడులు:* 
65వ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లు, దాబాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఆహార నాణ్యతను పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో శిక్షణ
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే వారికి, చిన్న పిల్లలకు ఆహారం అందించే అంగన్వాడీ కార్యకర్తలకు దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు సైతం ఆహార భద్రతపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పాఠశాలల్లో ఆహార వస్తువుల నిల్వ, భద్రతకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 
సమాజానికి హానికరమైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా మరియు అమ్మకాలపై ఆహార భద్రత, పోలీస్, మరియు ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తప్పనిసరి

ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం జిల్లాలోని చిన్న, పెద్ద ప్రతి ఆహార వ్యాపార నిర్వాహకుడు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.
వినియోగదారుల్లో చైతన్యం తేవడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్  వాహనం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  ఆదేశించారు. కల్తీ ఆహారంపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజారోగ్య పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కల్తీ ఆహారం లేదా నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తే గూగుల్ ప్లే స్టోర్ లోని ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ యాప్ ద్వారా గానీ, లేదా  జిల్లా ఆహార భద్రతా కార్యాలయం 9133291926, జిల్లా కలెక్టరేట్  కార్యాలయం 08684-222666, రాష్ట్ర ఆహార భద్రతా హెల్ప్‌లైన్  9100105795, 040-21111111 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ కోరారు.
 కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, డిఏఓ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎంహెచ్వో  వెంకటరమణ, డిటిడిఓ శంకర్, ఎస్సి డిడి దయానందరాణి,డిఐఓ  కోటి రత్నం డిడబ్ల్యూఓ, నరసింహారావు ఇతర జిల్లా అధికారులు  తదితరులు  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333