ఎవరు జర్నలిస్ట్?..ఎవరికి అక్రిడిటేషన్

Apr 13, 2026 - 19:23
 0  1
ఎవరు జర్నలిస్ట్?..ఎవరికి అక్రిడిటేషన్

 అడ్డగూడూరు 13 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–ఇటీవల జర్నలిస్టులంటే ఎవరు? అనే సందేహాలు నలువైపుల నుంచి వస్తున్నాయి. జర్నలిస్టులని  ఓ వైపు ప్రజలు మరో వైపు ప్రభుత్వం గుర్తించాలంటే ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణ రాయితీ కార్డు అక్రిడిటేషన్ అనేదే ప్రామాణికమని కొందరంటుంటే లేదు..లేదు అక్రిడిటేషన్‌కి జర్నలిస్టులకి సంబంధం లేదని మరికొందరంటున్నారు.ఇలా రెండు భిన్న వాదనల నడుమ పాత్రికేయులు అంటే ఎవరు? వారి విధివిధానాలంటే ఏంటనే ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతోంది.ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం... జర్నలిజాన్ని  ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పిలుస్తారు. శాసన,కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల తరువాత ఫోర్త్ ఎస్టేట్‌గా పాత్రికేయానిదే స్థానం. ప్రజాస్వామ్యానికి కావలిగా జర్నలిజం అత్యున్నత స్థానంలో కీర్తించబడుతోంది. ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లలో కదలిక తేగలుగుతుందని,పత్రిక ఒకటుంటే పదివేల సైన్యం ఉన్నట్లేనని ఇలా అనేక వర్ణనలతో ఎందరో మహానుభావులు పాత్రికేయం గొప్పతనాన్ని వర్ణించారు. అయితే ఇంతటి గొప్ప వ్యవస్థలో గడిచిన పది సంవత్సరాలుగా అనేక లోపాలు,అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో పాత్రికేయ వృత్తిపై అనేక రకాల ఆరోపణలు విన్పిస్తున్నాయి.అసల జర్నలిజం ఉణికే ప్రమాదపుటంచుల్లోకి నెట్టివేయబడిందని చెప్పవచ్చు.ఒకప్పుడు పత్రికలు వార్తల మీద అమ్ముడుపోయేవి.. నేడు వార్తల మీద కాకుండా తమ హిడెన్ అజెండా మీదనే మీడియా సంస్థలు నడుస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద అనేక సందేహాలు నెలకొన్నాయి.దీంతో ఎవరు జర్నలిస్టు?ఎవరు జర్నలిస్టు కాదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టు అని అది లేకుంటే జర్నలిస్టు కాదనే భావన ప్రభుత్వమే పరోక్షంగా పెంచి పోషించింది.దీనికి కొందరు తాబేదార్లు తోడై ఈ విషయానికి విపరీత ప్రచారం కల్పించారు.ఈ ప్రచారమే నిజమనుకుని ఉన్నతాధికారులు,నేతలు  అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టులని మిగతా వారు నఖీలీలంటూ పాత్రికేయులపై వివక్షత చూపుతున్నారు. రాజ్యంగం తెలిసిన ఐఎఎస్, ఐపిఎస్, గ్రూప్ వన్ అధికారులతోపాటు వివిధ ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నేతలు కూడా  అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టనే వివక్ష కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కల్గించే అంశమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ పాత్ర అంటే ఏంటో వారికి తెలియదా లేక ప్రభుత్వం, కొందరు దళారులు కల్పించిన ప్రచారానికి భయపడి పాత్రికేయులపై అక్రిడిటేషన్ అనే వివక్ష కొనసాగిస్తున్నారా?అనేది తేలాల్సి ఉన్నది.అక్రిడిటేషన్ అనేది సర్వ రోగ నివారిణి ఎంతమాత్రం కాదు..జర్నలిజాన్ని గుర్తించే పట్టా అంతకన్నా కానే కాదు.అది కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత ప్రయాణ రాయితీ కార్డు మాత్రమే.ఈ కార్డుని ఆధారంగా చేసుకుని జర్నలిస్టులని గుర్తిస్తామంటే అంతకన్నా తెలివి తక్కువతనం మరొకటి లేదు.అలా ఎవరైనా ప్రయత్నించారంటే వారికి జర్నలిజంపై, ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై అవగాహన లేదనే చెప్పవచ్చు.ఓ జర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్చింది అతనికి ఉన్న జ్ఞానం..సమాజం హితంపై అతనికున్న ఆలోచనే. ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తూ..నీతిని వీడకుండా...నిజాన్ని కప్పిపుచ్చకుండా...ప్రజాస్వామ్య వారధులుగా ఉండే వారందరూ జర్నలిస్టులే.ఒక జర్నలిస్టుకి గుర్తింపు ఆ మీడియా సంస్థ ఇచ్చే గుర్తింపు కార్డే అత్నున్నత ప్రామాణికం.ప్రభుత్వ రాయితీలు,అక్రిడిటేషన్ వద్దనుకుని నిజాయితీగా ప్రజల కోసం కలాన్ని పట్టిన ఎందరో నిఖార్సయిన పాత్రికేయులు నేడూ ఉన్నారు.మరి అలాంటివారందూ జర్నలిస్టులు కాదని,అలాంటివారికి ప్రెస్ క్లబ్లుల్లో సభ్యత్వం ఇవ్వం..అలాంటివారిని ప్రభుత్వ సమావేశాలకు వార్తల సేకరణ కోసం రానీయమని ఎవరైనా చెబుతున్నారంటే వారు ఖచ్చితంగా దళార్లే అయి ఉంటారు.ఇక అక్రిడిటేషన్ అనేది ఒకప్పుడు ఉచిత ప్రయాణ రాయితీ కార్డుగా ఉన్నప్పుడు  అక్రిడిటేషన్ అర్హులైన జర్నలిస్టుందరి జేబులో ఉండేవి. అయితే రాను రాను తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రిడిటేషన్ ఉంటే డబుల్ బెడ్ రూం ఇండ్లు వస్తాయని,కార్పోరేట్ వైద్యం,ప్రెస్ క్లబ్బులో సభ్వత్వాలు, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వస్తుందని అనేక ఎన్నికల హామీలు..భ్రమలు వెరసి నేడు  అక్రిడిటేషన్ అంగట్లో సరకులా మారింది.జర్నలిజానికి సంబంధంలేని వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అసాంఘీక శక్తుల జేబుల్లో అక్రిడేషన్లు చేరిపోతున్నాయి.ఒక్క  అక్రిడిటేషన్ నేడు రూ.30 వేల నుంచి రూ.60 వేల దాకా మార్కెట్లో ధర పలుకుతోందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. అంటే మనం రూ.30 నుంచి 60 వేల దాకా ఇచ్చుకోగలిగితే ఒక్క రోజులోనే జర్నలిస్టుగా మన జేబులో  అక్రిడిటేషన్ ఉంటుంది. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుగా మారిపోయి ఒక్కరోజులోనే ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలకు అర్హత సాధించొచ్చన్నమాట.జర్నలిజం కోర్సులు చేయాల్సిన పనిలేదు..ప్రజా హితం అంతకన్నా అవసరం లేనేలేదు...అక్షరం రాయరాకున్నా పర్వాలేదు..జస్ట్ రూ. 30 వేల నుంచి రూ.60 వేలు మన దగ్గర ఉంటే చాలు. సీనియర్ జర్నలిస్ట్, అక్రిడేటెట్ జర్నలిస్ట్ అనే ముద్ర తగించుకోవచ్చు.అన్నీ కుదిరితే డబుల్ బెడ్ రూం ఇండ్ల లిస్టుల జాబితాలో చోటు దక్కించుకోవచ్చు.ఇదంతా నేడు జరుగుతున్న వాస్తవ పరిస్థితి. దీనికంతటికి కారణం ప్రభుత్వ ఉదాసీనతేనని చెప్పక తప్పదు. సమాచార శాఖలో ఉన్న నిబంధనలు కాలణుగుణంగా మార్చకపోవడం ప్రధాన సమస్యగా మారింది.ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ మయం అయింది.నగదు రహిత ప్రపంచంగా గొప్పగా చెప్పుకుంటూ పత్రికా రంగంలో మాత్రం ప్రింటింగ్,కాపీలు అంటూ లెక్కలు వేసి గ్రేడింగ్‌లు, రేటింగ్‌లు,అక్రిడేషన్లు అంటూ పాత్రికేయ వృత్తిని మకిలిపట్టిస్తున్నారు.మరో విషయం ఏంటంటే నేడు మారుతున్న కాలానికనుగుణంగా సమాచార శాఖలోని జీవోలను మార్చాలనే వాదం బలంగా విన్పిస్తోంది.కార్పోరేట్ శక్తులు, వ్యాపారులు, రాజకీయ పార్టీల చేతుల్లో నడుస్తున్న మీడియాల చేతిలోనే నేడు మూడొంతులు అక్రిడేషన్లు ఉన్నాయి.మరి అలాంటి మీడియాల్లో వచ్చే వార్తల్లో నిజాలుంటున్నాయా? ఒక పత్రికది ఒకరంగు..మరో పత్రికది మరో రంగు. ఒక పత్రికలో ఒక పార్టీ వార్త..మరో మీడియాలో మరో పార్టీ భజన. మరి నిజాలు చెప్పకుండా ఓ వైపు పక్షపాతంగా ఉంటున్న ఇలాంటి మీడియాలన్నింటికి అన్ని రాయితీలు ఇస్తూ, అక్రిడేషన్లు ఇస్తూ గుర్తింపు ఇచ్చినప్పుడు..నిజాన్ని నిర్భయంగా..ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తూ అక్షరాలనే నమ్ముకున్న చిన్న మీడియాలపై వివక్ష ఎందుకు?అందులో పనిచేసే జర్నలిస్టులని జర్నలిస్టులు కాదని అనడం ఎందుకు?ఈ పరిస్థితి దారుణమైనది కాదా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాచార శాఖ లేదా ప్రభుత్వం వద్ద సమాధానాలు ఉండవు. నిబంధనల ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వడంలో తప్పులేదు.అయితే సర్వ రోగ నివారిణిలా అన్ని పనులకు అక్రిడిటేషన్ అనేదాన్ని ప్రమాణికంగా తీసుకోవడమే సరియైన విధానం కాదు.ఈ విషయాన్ని ఏ జర్నలిస్టూ ఒప్పుకోరు.ఎందుకంటే జర్నలిస్టులకి  అక్రిడిటేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు పత్రం కాదు. అది కేవలం ఉచిత బస్సు ప్రయాణ రాయితీ కార్డు మాత్రమేని మరో మారు చెప్పాల్సి వస్తోంది.ఈ విషయాన్ని అన్ని వర్గాలవారు గుర్తిస్తే ఎవరు జర్నలిస్టు?ఎవరు జర్నలిస్టు కాదు?అనే ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది.ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333