అవినీతి అనకొండలు దేశ సంపదని మెక్కుతూ ఉంటే

Jun 18, 2026 - 01:10
Jun 18, 2026 - 01:30
 0  3
అవినీతి అనకొండలు దేశ సంపదని మెక్కుతూ ఉంటే

ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలు తీసుకుంటే అధికార యంత్రాంగం, పాలకులలో మార్పు ఎలా వస్తుంది?

 ప్రజాసంపదకు కాపలాదారులమoటూనే కబలిస్తే ఎలా ?

---వడ్డేపల్లి మల్లేశం

అక్రమాస్తుల కేసులో  గతంలో ఉద్యోగులు ఉంటే ప్రస్తుతం ఉన్నతాధికారులు  విభాగాల అధిపతులు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. కంచే చేను మేస్తే కాపలా ఎవరు అన్నట్లుగా సంస్థ అధిపతి కూడా అలాంటి దుష్ట చర్యలకు పాల్పడితే ఇక  ప్రజా సంపాదన కాపాడే వాళ్ళు ఎవరు?  అందుకే ఇటీవల  అక్రమాస్తులు విషయములో  అవినీతికి పాల్పడిన వారి గుట్టు రట్టు చేసే క్రమంలో ఏసీబీ దూకుడు పెంచినట్లుగా తెలంగాణలోని కొన్ని ఉదాహరణలను బట్టి తెలుస్తున్నది.  అయితే ఈ దుశ్చర్య కేవలం తెలంగాణలో మాత్రమే  కాదు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కొద్ది గొప్పో తేడాతో నిరంతరం ప్రజా సంపదను కొల్లబడుతున్నటువంటి చిరు, మధ్యతరగతి ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు, అధికారులు  ప్రజా కంఠకులుగా మారితే వారిని ఎంతకాలం సహిస్తాం?  ప్రభుత్వ పెద్దలు కూడా అవినీతిలో భాగం  పంచుకునే వాళ్లే కనక ప్రభుత్వ అధినేతల  అవినీతిని  కట్టడి చేయకుండా ఉద్యోగస్వామ్యంలో అవినీతిని అడ్డుకోవడం  పెను సవాలు వంటిదేనని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  అంటే ఒకవైపు ప్రజాప్రతినిధులు మరొకవైపు అధికారులు  ప్రజల ధనాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా కొల్లగొట్టడం, లంచాల రూపంలో  ప్రభుత్వ  ఉద్యోగంలో భాగంగా ఆస్తులను అక్రమంగా కూడబెట్టి  పనుల విషయంలో నాణ్యత లేకుండా  తూతూ మంత్రంగా చేసి  నిధులను మళ్లించే ప్రయత్నం చేయడం  ఇలా ఎన్ని మార్గాల్లో వీలైతే అన్ని మార్గాలలో సంపదను కూడబెడుతున్నారు.

కనుకనే అధికారుల ఇళ్లల్లో  కోటానుకోట్ల ధనరాశులు బంగారము  వెండి ఆభరణాలు  ప్లాట్లు ప్లాట్ల  రిజిస్ట్రేషన్ కాగితాలు వ్యవసాయ భూములు బినామీ పేర్లతో ఆస్తులు  ఇటీవల కాలంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి  వేటలో ఇవే కనపడుతున్నాయి. అయినా ఈ విషయంలో ప్రజలు స్పందించరు మేధావులు  చీకొట్టారు  ప్రభుత్వ పెద్దలు తగిన శిక్ష విధించరు మొక్కుబడిగా చూసి చూడనట్లుగా  ఉంటారు మరి ఈ ధనమంతా ఎవరిది? ఈ సొమ్ము ఎవరి నుండి రాబట్టినది.  నేడు కూడా  హైదరాబాదులో జరిగినటువంటి ఒక దాడిలో  ల్యాండ్ రికార్డ్స్ అధికారి  ఇంట్లో ఏకంగా కోటి యాభై లక్షల పైగా నగదు దొరికిందంటే  మొత్తం ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉన్నదని అధికారులు చెబుతూ ఉంటే  ప్రభుత్వాలు  కళ్ళు మూసుకొని  ఈ అవినీతి పెద్ద చేపలను కాపాడుతున్నాయా?  ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి  లంచాల రూపంలో వసూలు చేయడానికి  నాణ్యత లోపం కలిగించి  సొమ్మును మిగిలించుకొని  లబ్ధి పొందే విషయంలో ఇంజనీర్లు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు,  రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్లు,  ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్,  మండల తాసిల్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల అధికారులు  సహా విభాగాల అధిపతుల వరకు  అక్రమాస్తులు కూడబేడితే చూస్తూ ఊరుకుంటామా? వీళ్ళ  దొంగ సొమ్ము పైన దాడులు జరగడంతో పాటు  సంపాదించిన అక్రమ యావదాస్తిని  ప్రజల ముందు నడి బజార్లో ప్రదర్శించి  వీళ్ళ నేరాన్ని ప్రజల ముందు ఒప్పించి  ప్రజా సమక్షంలోనే శిక్షించిన తప్పు కాదు కూడా.  అంతటి విద్రోహనికి పాల్పడుతూ  పనుల నాణ్యతను దెబ్బతీస్తూ  పనులు చేసినందుకని వ్యక్తులు రైతులు కార్మికులు చేతివృత్తుల వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలను లంచాల రూపంలో వసూలు చేస్తూ ఇంటి నిండా నోట్ల కట్టలు బంగారంతో నింపితే  పేదరికం నిర్మూలించడానికి మాత్రం ప్రభుత్వానికి నిధులు లేవు. 

కొన్ని గణాంకాలు పరిశీలిస్తే 

 అవినీతి  అక్రమాస్తుల  దందా   తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైతే  చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూ స్తున్నాయి.  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత   మండల స్థాయి అధికారులే కోట్లను  డిమాండ్ చేసి లంచాల రూపంలో తీసుకున్న  దాఖలాలు ఎన్నో బయటపడ్డాయి.  పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో  ఇలాంటి దుర్మార్గులకు రోజూ కనక వర్షమే. గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ  రోజుకి ఎన్నో కేసులు బయటపడుతూ ఉంటే  దూకుడు పెంచిన ఏసీబీ అంటూ ప్రకటనలు  ఇస్తున్నారు కానీ ఆ వసూలు చేసిన డబ్బు ఏమైంది? వారికి పడిన శిక్ష ఏమిటి? ఆ శిక్షను ప్రజల ముందు అంగీకరించినాడా  అని వెరిఫై చేసే బాధ్యత ప్రభుత్వాలకు లేకుండా పోయింది ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అవినీతిలో ఒక భాగమే అని  అందరూ ఆ డిపోసుకుంటున్నారు కనుక.  సుమారు 20 సంవత్సరాలకు పూర్వం  కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర  ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక కుంభకోణాలకు సంబంధించి  ఆనాడు కుంభకోణ భారతం అనే పేరుతో  ఒక సెమినార్ నిర్వహించినారు అంటే ఈ దేశంలో  కేంద్రం నుండి రాష్ట్రాలు స్థానిక  ప్రభుత్వాల వరకు అంతా అవినీతిపరులు అని,  ఇప్పటికీ ఇంకా నమ్మకుండా అనునిత్యం వెంటాడి వేటాడవలసిందేనని ప్రజలు అర్థం చేసుకుంటే మంచిది.

  20021లో 83 కేసులు 2022లో 105 కేసులు ఏసీబీ అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంటే  2023లో ఆ సంఖ్య   95 కు పెరిగింది.  ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  2024 లో 152 కేసులు  2025లో  199 కేసులు  2026 లో  జూన్ వరకు  90 కేసులు మొత్తం కలిసి  2024 నుండి ఇప్పటివరకు ఏకంగా 440 కేసులు ఏసీబీ నమోదు చేసినట్లుగా తెలుస్తూ ఉన్నది. వీటి పైన రోజు రైడింగ్ చేస్తూ  టీవీ ప్రసారాలలో స్పష్టంగా చూపిస్తూ  ప్రజలకు కనపడుతున్నారు కానీ  ఆ డబ్బు ఏమైంది?  అక్రమార్కుల నుండి  రికవరీ చేసినారా?  అర్హులు బాధ్యులైన వారికి అట్టి డబ్బులు ఇప్పించినారా? అనే విషయంలో స్పష్టత లేకపోవడం విచారకరమే. ఎమ్మార్వోలు ఎంపీడీవోలు రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు  కరెంటు డిపార్ట్మెంట్ తో సహా అన్ని విభాగాల అధిపతులు నేడు  అక్రమార్జనకు తెగబడినారన్న వార్తలే.  విద్యా విభాగంలో కిందిస్థాయిలో అంతగా లేదు కానీ పై స్థాయిలో అధికారుల స్థాయిలో కొన్ని అవినీతి కేసులు కూడా లేకపోలేదు  అయితే మిగతా విభాగాలలో చూసుకున్నప్పుడు కిందిస్థాయి గుమస్తాయి  ఉద్యోగులే ఈ అవినీతికి  ఆజ్యం పోస్తున్నట్లు  తెలుస్తున్నది.  ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలలో  ఉన్నవారు అవినీతిని అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా అధికారులను నిలదీయడం వలన  అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఏర్పడింది కూడా. అనేక చోట్ల వసూలు చేసినటువంటి అక్రమ సొమ్మును కూడా తిరిగి ఉపాధ్యాయులకు ఇప్పించిన ఘనత  ఉపాధ్యాయ సంఘాలది కానీ రైతులు కార్మికులు పేద వాళ్ళ దగ్గర లేదా కాంట్రాక్టర్లు  రైతులు ప్రజల దగ్గర ఏదో రూపంలో అక్రమంగా వసూలు చేసిన సొమ్ము మాత్రం ఈ రకంగా  కట్టలుగా పోగు పడితే  కనీసం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన  సంఘ బాధ్యులు కూడా స్పందించిన దాఖలా లేదు.  ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయులకు సందేశమిస్తూ హక్కులకై కనపడాలి బాధ్యతలకు నిలబడాలి అని నిరంతరం హెచ్చరిస్తూ ఉంటారు తప్పులు చేసినటువంటి ఉపాధ్యాయులను అవసరమైతే  హెచ్చరించిన సందర్భాలు  లేకపోలేదు. కానీ ఉద్యోగుల అవినీతికి సంబంధించి ఆ సంస్థల యొక్క విభాగాల పై అధికారులు  హెచ్చరించడం కాదు కదా పై అధికారులే అవినీతికి పాల్పడినటువంటి  సందర్భాలున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో  ప్రస్తుతం కంచే చేను మే సినట్లుగా ఉంది.   కానీ  ప్రతిరోజు టీవీలో పత్రికల్లో ఏదో మూలన తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి  వెళ్లడవుతున్నది ఆ రకంగా దేశవ్యాప్తంగా అన్ని విభాగాలలో జరుగుతున్న అవినీతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి సర్వోన్నత న్యాయస్థానం  నిరంతరం పరిశీలించి  అవినీతికి తావులేని నీతి బద్ధమైన పరిపాలన అందించే క్రమము లోపల పాలకులను హెచ్చరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.ఇక పాలకులే అవినీతికి పాల్పడి దోషులుగా తేలితే   మళ్లీ పోటీకి అవకాశం లేకుండా అనర్హు లుగా ప్రకటించాలి. కానీ ఎంతోమంది ఇప్పటికీ రాజకీయంలో ఉన్నవాళ్లు  ఆరోపణకు గురై జైలు పాలై తిరిగి మళ్ళీ పోటీ చేసి అధికారంలో కొనసాగుతున్నారంటే " ఉద్యోగులకు ఒకనీ తి ప్రజాప్రతినిధులకు మరొక నీతి "" సమంజసం కాదు.

 మంత్రులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు  ముఖ్యమంత్రితో సహా  ఎవరు అవినీతికి పాల్పడిన  ప్రజల సమక్షంలో శిక్ష అనుభవించాలి జీవితంలో తిరిగి పోటీ చేయకుండా వె లివేయబడాలి  ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి ఈ రకంగా అతి కఠినమైన చర్యలు ఉంటే తప్ప మన దేశంలోని పాలకులు అధికారుల లో మార్పు రాదు.  ముఖ్యంగా ఏసీబీ కేసులకు సంబంధించి తాసిల్దార్లు సంప్రదిస్తారు కార్యాలయాల ఉద్యోగులు పోలీసు రెవెన్యూ విభాగాల ఉద్యోగులు  మున్సిపల్ శాఖ ఉద్యోగులు  భూమి రెవెన్యూ శాఖ ఉద్యోగులు  ముఖ్యంగా ప్రజలతో సంబంధం ఉన్న వీళ్లంతా   ఏలు వంక పెడితే వెన్న వస్తుందన్న నెపంతో లంచాలకు మరిగి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ ప్రజలను బిచ్చగాళ్లుగా మార్చుతున్నారు ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు ప్రజల సొమ్మును స్వాహా చేస్తే ప్రభుత్వాలు మౌనంగా ఊరుకుంటే ఆ ప్రభుత్వాలకు  బాధ్యత లేనట్లేనా ?

పట్టుబడ్డ సొమ్మంతా ఏమైపోతున్నట్లు 

కిలోల కొద్ది బంగారము వెండి ఆభరణాలు  కోట్ల నగదు  బ్యాంకు బ్యాలెన్స్  రిజిస్ట్రేషన్ కాయిదాలు  భూములు వ్యవసాయ ప్లాట్ల  గాకరాలు బినామీ ల పేరుతో ఉన్నటువంటి ఆస్తులు  ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్న రోజున బాహాటంగా ప్రకటిస్తారు.  వాటిని ఎవరు  స్వాధీనం చేసుకున్నట్టు ఆ అక్రమార్చన సొమ్మును ఎవరికి ఇచ్చినట్లు.  ఒక తాసిల్దార్ నేరస్తులు అవినీతిపరుడైతే అతడు వసూలు చేసింది  ఆ ప్రాంత ప్రజల సొమ్మే కదా కాబట్టి ఆ ప్రజలకు పంచిన దాఖలా ఉందా?  రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అవకతవకలతోపాటు  లక్షలాది రూపాయలను ప్రతిరోజు సొమ్ము చేసుకుంటున్న అధికారులు  ఏ రకంగా లెక్కలు చూపిస్తు చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోట్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరికి  ఆ డబ్బు పైన అధికారం ఉంటుంది అనే విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టతను ప్రకటించాలి.  కూతురు దారితప్పితే మాత తప్పు అన్నట్లుగా ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు  అవినీతిపరులు లంచగొండులు అక్రమార్కులు అయితే  ప్రభుత్వం స్పష్టంగా ఆ బాధ్యత వహించాలి.  వాళ్లకు తగిన శిక్ష పడేదాకా విడిచి పెట్టవలసిన అవసరం లేదు పైగా స్వాధీనం చేసుకున్న సొమ్మును పేద వర్గాలకు పంచి పెట్టాలి  అక్రమార్కులను కళ్ళముందే కట్టుబట్టలతో బయటికి సాగనంపి   కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప ఇలాంటి వాళ్లు తమ అధికార ఉద్యోగ జీవితంలో మళ్లీ అవినీతికి పాల్పడరు. ఏసీబీ అధికారులు కూడా  కేసులు నమోదు చేసి  అరెస్టు చేసి  ఆ విషయాలను మరిచిపోతే ప్రయోజనం ఏముంటుంది? నేరస్థుడికి తగిన శిక్ష పడాలి  చిత్తశుద్ధిగా వృత్తి బాధ్యత నిర్వహించిన ఉద్యోగికి ప్రశంసలు అందాలి.

కాంట్రాక్టు పద్ధతిలో  కట్టు బానిసలుగా  నామమాత్రపు వేతనాలు కాకుండా  స్కేల్ ఉద్యోగాలను  అనుమతించడం ద్వారా ప్రభుత్వాలు  తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. ఇలాంటి అక్రమార్కుల పట్ల మాత్రము ఉ క్కు పాదం మోపాల్సిందే లేదంటే ప్రజలకు అప్పగిస్తే  ప్రజలే ఆ పని చూసుకుంటారు. గతంలో హైదరాబాదులో ఒక మండల రెవెన్యూ అధికారి కార్యాలయం పైన  బలవంతంగా లంచం వసూలు చేసిన  పాపానికి తగిన శిక్ష అనుభవించిన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది మరొక కేసులో  భార్య అవినీతిపరురాలై  చట్టం ముందు తలవంచితే తట్టుకోలేని భర్త ఉద్యోగియై ఉండి కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన  ఈ దేశంలో ఉద్యోగులు ఆడ మగ ఎవరైనా ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారు తెలియజేయడానికి ఇంతకు మించిన సాక్షాలు అవసరమా?  వివరాలు సాక్ష్యాలు అన్ని చేతిలో పెట్టుకున్న ప్రభుత్వాలు  బాధ్యత మరిచి  ప్రజల మనసులను  మళ్లించే ప్రయత్నం చేసే క్రమంలో అనేక ఆర్భాటాలు ప్రచారాలకు  పాల్పడుతున్న విషయం తెలుసు  కానీ ఏదో ఒక రోజున పాలకులైన అధికారులైన సరే  ప్రజలు తగిన శిక్ష కోసం ఒత్తిడి చేస్తారు ఆనాడైనా పాలకులు, ఉద్యోగులు శిక్ష అనుభవించక తప్పదు.   కార్మికులు చేతివృత్తుల వాళ్ళు పేదలు కష్టార్జితాన్ని  రెక్కల కష్టాన్ని పైసా పైసా పోగు చేసుకుంటే  ఆఫీసుల్లో లంచాల పేరుతో పీడించి దోపిడీకి పాల్పడుతున్నారంటే ఈ మానవత్వం లేని అధికారులు ఉద్యోగులను ఏమనాలి?   తిరిగి తిరిగి ఇబ్బందులకు గురై  పని కాకపోతే  అలిసిపోయినటువంటి ప్రజలు పేదలు, రైతులు, కార్మికులు  తమ నిర్ణయాన్ని ఘాటుగా సూటిగా  ప్రకటించిన రోజున ఇలాంటి  అవినీతిపరులకు పుట్టగతులు ఉండవు జాగ్రత్త!.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333