అయిజలో అద్దెలు చెల్లించక పాఠశాలలు ఖాళీ చేయించడంతో రోడ్డున పడ్డ విద్యార్థులు

Jun 19, 2026 - 22:18
 0  0
అయిజలో అద్దెలు చెల్లించక పాఠశాలలు ఖాళీ చేయించడంతో రోడ్డున పడ్డ విద్యార్థులు
అయిజలో అద్దెలు చెల్లించక పాఠశాలలు ఖాళీ చేయించడంతో రోడ్డున పడ్డ విద్యార్థులు

హైకోర్టు ఆదేశాలను అపహాస్యం చేస్తున్న అధికారులు.

మున్సిపాలిటీ పరిధిలో 'తూతూమంత్రంగా' నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు

 షట్టర్లు, అద్దె ఇళ్లలోనే విద్యాబోధన.. 10 నెలలుగా చెల్లించని అద్దెలు

నాడు ప్రారంభోత్సవాల కోసం ఆధిపత్య పోరు కానీ నేడు పట్టించుకోని నాయకులు

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- తెలంగాణలో గతంలో విలీనం చేసిన ప్రభుత్వ పాఠశాలలను ఒక కిలోమీటరు పరిధి నిబంధన ప్రకారం తిరిగి ప్రారంభించాలని హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక ఆదేశాలను జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు. కోర్టు ఆదేశాల నెపంతో గతేడాది ఆగస్టు 12వ తేదీన ప్రారంభించిన పాఠశాలలు నేటికి పది నెలలు కూడా పూర్తి కాకముందే మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అయిజ పురపాలక సంఘం (మున్సిపాలిటీ) పరిధిలోని పేద విద్యార్థుల చదువులు వర్షంలో తడిసి, ఎండకు ఎండుతున్నాయి. హైకోర్టుకు నివేదికలు సమర్పించాలనే ఏకైక తాపత్రయంతో అప్పట్లో అధికారులు అయిజలోని పీఎస్ టీచర్స్ కాలనీ, పీఎస్ ఎస్సీ ఐజ న్యూ బిల్డింగ్స్, పీఎస్ బుడ్గజంగాల కాలనీ మరియు పీఎస్ తెలుగుపేట ప్రాంతాలలో మొక్కుబడిగా ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. సొంత భవనాలు లేకపోవడంతో కొన్ని కాలనీల్లో చిన్నపాటి షట్టర్లను, ఇరుకు గదులను అద్దెకు తీసుకొని తాత్కాలికంగా పాఠశాలలను ఏర్పాటు చేశారు. అయితే, పాఠశాలలు ప్రారంభించి 10 నెలలు గడుస్తున్నా ఆయా భవనాల యజమానులకు విద్యాశాఖ నుండి ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించలేదు. దీంతో విసిగిపోయిన భవన యజమానులు ఇటీవల పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపించి, గదులకు తాళాలు వేశారు.

ఫలితంగా, ప్రస్తుతం ఒక ఇరుకైన రేకుల షెడ్డులో, కనీస సౌకర్యాలు లేని చోట పాఠశాల నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే తరగతి గది అంతా తడిసిపోవడంతో పిల్లలు పుస్తకాలు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ పాఠశాలల ప్రారంభోత్సవ సమయంలో అప్పట్లో తీవ్రమైన ప్రోటోకాల్ (అధికారిక గౌరవ మర్యాదలు) వివాదం చోటుచేసుకుంది. తామంటే తామే పాఠశాలలను ప్రారంభిస్తామని కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఒకరితో ఒకరు గొడవలకు దిగారు. విలేకరుల సాక్షిగా, ప్రజల సమక్షంలో పెద్ద పెద్ద హామీలు గుప్పించారు. ప్రతి పాఠశాలకూ ఒక క్రమబద్ధమైన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు, అవసరమైన అదనపు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని, మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రావలసిన అన్ని వసతులు కల్పిస్తామని నమ్మబలికారు. నాడు ప్రారంభోత్సవాల కోసం మైకుల ముందు కొట్లాడిన ఏ ఒక్క నాయకుడూ నేడు పాఠశాలలు మూతపడుతున్నా, పిల్లలు రోడ్డున పడుతున్నా కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఒక్క ఉపాధ్యాయుడితో, అదీ అద్దె కొంపల్లో, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో పాఠశాలలను గాలికొదిలేశారు.

జిల్లా కేంద్రానికో న్యాయం.. అయిజ కాలనీలకు అన్యాయమా?

జిల్లా కేంద్రమైన గద్వాలలో ఉన్న ఒక పాఠశాలకు మాత్రం సొంత భవనం లేకపోయినా.. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ, సక్రమంగా అద్దెలు చెల్లిస్తూ నడిపిస్తున్నారు. మరి అయిజ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో ఉన్న పేద, దళిత, వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునే పాఠశాలల పట్ల ఎందుకీ పక్షపాతం? అని స్థానిక తల్లిదండ్రులు, కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు, నాయకులకు తమ పిల్లల జీవితాలన్నా, చదువులన్నా అంత చులకనా అని మండిపడుతున్నారు.

తల్లిదండ్రులు, కాలనీవాసుల డిమాండ్

హైకోర్టు ఆదేశాలను తూతూమంత్రంగా అమలు చేయడం ఆపాలి. జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బకాయి ఉన్న పాఠశాలల అద్దెలను వెంటనే విడుదల చేయాలి. తాత్కాలిక షెడ్లు, గుడిసెలలో కాకుండా అయిజలోని ఈ నాలుగు కాలనీల పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి, పక్కా భవనాలను నిర్మించాలి. సరిపడా ఉపాధ్యాయులను, మధ్యాహ్న భోజన వసతిని పూర్తిస్థాయిలో కల్పించి, విద్యను పేద పిల్లలకు ఒక వరంగా మార్చాలి. లేనిపక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333