సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది.

Jul 17, 2026 - 18:04
Jul 17, 2026 - 19:04
 0  2
సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
సూర్యాపేట అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

సూర్యాపేట 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, ఇంజనీరింగ్,పరిశుద్ధ్య విభాగంలో ఖాళీ పోస్టుల భర్తీ, త్రాగునీటి సరఫరా మెరుగుదల, యూజీడీ పనుల అనంతరం రోడ్ల పునరుద్ధరణతో పాటు శ్రీ లింగమంతుల స్వామి గుట్ట చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవికి విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలనే విజ్ఞప్తితో మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించేందుకు వివిధ గ్రాంట్ల ద్వారా ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు.
మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో  ఖాళీగా టెక్నీకల్ పర్సన్ (టీఓ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), పరిశుభ్రత విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై ప్రభావం పడుతోందని వివరించారు. ఈ పోస్టులనుభర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణంలో తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు అదనపు పైప్‌లైన్ల ఏర్పాటు కోసం నిధులు అవసరమని, ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలాగే తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీశ్రీ లింగమంతుల స్వామి గుట్ట సమీపంలోని చెరువును సుందరీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని సూచించారు.

ఇదే సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల కారణంగా తవ్విన రోడ్లను ఇప్పటికీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీ.కే. శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది వ్యక్తం చేశారు. సూర్యాపేట అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తూ, పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333