సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు ఎమ్మెల్యే.
గుడ్డేందొడ్డి రిజర్వాయర్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లు.
జోగులాంబ గద్వాల 2 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4న పర్యటిస్తున్న గుడ్డేందొడ్డి రిజర్వాయర్ వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి ధరూరు మండలంలోని గుడ్డేందొడ్డి రిజర్వాయర్ పరిశీలించడానికి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి గుడ్డేందొడ్డి రిజర్వాయర్ వద్ద హెలిపాడ్ నిర్మాణం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెలిపాడ్ నుంచి పంపు హౌస్ కు వెళ్లే దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు నియమించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర వివరాలతో ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. హెలిపాడ్ పరిసర ప్రాంతాలు, ఫోటో ఎగ్జిబిషన్ స్థలంను చదును చేయించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బారికేడ్లతో పాటు ఇతర ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ పర్యటనలో అదనపు ఎస్పి శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, డిఎస్పి మొగిలయ్య, ఇరిగేషన్ ఎస్సీ రహీముద్దీన్, ఆర్ అండ్ బి ఈఈ ప్రగతి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులున్నారు.