రెండేళ్ల కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించారు
* కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి సూర్యాపేట మున్సిపాలిటీనీ ప్రజలు హస్తగతం చేశారు
* ప్రజా సమస్యలను గాలికి వదిలిన బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు.
* పేటలో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల భారీ విజయోత్సవ ర్యాలీ
* అడుగడుగున జన నీరాజనం... దామన్నకు ఈ విజయం అంకితం అంటూ నినాదాలు.
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం.
* మమ్మల్ని నమ్మి ఇంత అఖండ మెజారిటీ ని అందించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు
* చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కు 31 మంది కాంగ్రెస్ , 3 స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు
గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో తిరుగు లేని విజయాన్ని అందించారని, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి అన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీలో 31 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ తన కౌన్సిలర్లతో పాటు మరో ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లను కలుపుకొని చైర్మన్ *మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ గా మహమ్మద్ షఫీ ఉల్లా లను ఎన్నుకొని సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం పట్టణంలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా మున్సిపల్ పాలక వర్గం తో కలసి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించారని అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టి సూర్యాపేట మున్సిపాలిటీ హస్తగతం చేశారన్నారు. గత పది ఏళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రజా సమస్యలను గాలికి వదిలిందని అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. గత ప్రభుత్వాల్లో జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉంచి అభివృద్ధిలో నెంబర్ వన్ గా చేస్తామన్నారు. ప్రజాసేవ చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న నాయకులకే పార్టీ టికెట్లు కేటాయించిందని అదే తమ అభ్యర్థుల విజయానికి కారణమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లంతా నిబద్ధతతో ప్రజాసేవ కోసం ముందుకు వచ్చారని వారంతా ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటారన్నారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలందరికీ అందిస్తారని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వీధివీధిలో ప్రజలు జననిరాజనాలు పలికారు. సూర్యాపేట మున్సిపాలిటీ హస్తగతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఈ విజయం మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అంకితమంటూ నినాదాలు చేశారు.
ఈ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులకు కో ఆప్షన్, రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవులను నియమించనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ని అధిష్టానం అనుమతితో ఖరారు చేసినట్లు డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చారు.