మిత్రలాభం ఆశిస్తే  మిత్రభేదంతో అవమానిస్తు

Mar 19, 2026 - 06:48
 0  0

ప్రజా పోరాట స్ఫూర్తిని నీ రుగారుస్తున్నారా ?

ఉనికికే భంగం కలిగితే పునరాలోచన చేసుకోవాల్సిందే.

కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ చరిత్రను తాకట్టు పెట్టింది అంటే  అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

భారతదేశంలో నూరేళ్ల కమ్యూనిస్టు చరిత్రను  ఒక్కసారి మననం చేసుకుంటే జరిగిన ప్రజా ఉద్యమాలు, సాధించిన లక్ష్యాలు,  నెలకొల్పిన ప్రజా చైతన్యం,  కార్మిక కర్షకులకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు అంతులేదు అది వాస్తవం కూడా.  అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కూడా తనదైన శైలిలో   ప్రలోభాలకు వాగ్దానాలకు అధికార పార్టీ  అండ కోసం పాకులాడుతున్న సందర్భాలు దేశంలో కొంత చూడవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ స్పష్టత మనకు గోచరిస్తుంది కూడా.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అప్పుడప్పుడు తిప్పికొడుతున్నప్పటికీ  మిత్ర లాభాన్ని ఆశించి, పొత్తులు ఏర్పాటు చేసుకొని,  సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి, అధికార పార్టీకి రాజీ పడినప్పటికీ  తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ  కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకు ద్రోహం చేస్తున్నదని  ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని  మంత్రులు పార్టీ నేతలు  ఎమ్మెల్యేలు కూడా పార్టీని అవమానిస్తున్నారని  ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తెగదెంపులు చేసుకోవడానికి వెనుకాడే ప్రసక్తి లేదని ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనo నేని  సాంబశివరావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయం  కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద వైఖరికి నిదర్శనం అనుకోవాలా? లేక అధికార పార్టీతో ప్రయోజనం పొందడానికి  సిపిఐ  చేసిన ఎత్తుగడ అనుకుందామా? ఆలోచించాల్సిన అవసరం మేధావులు  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పార్టీ కార్యకర్తల పైన ఎంతగానో ఉంది.

ఎందుకంటే  ప్రజల దైనందిన స్థానిక కనీస అవసరాలు సమస్యల పైన పోరాటం చేయగలిగినటువంటి సత్తా ఉన్న కమ్యూనిస్టు పార్టీ  ఒక పెట్టుబడిదారీ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తు కలుపుకొని వ్యవహరించడం అంటే ప్రజా ప్రయోజనాలను  కొంత తాకట్టు పెట్టడమే రాజీపడడమే అవుతుంది.  బహుశా అందుకేనేమో కాంగ్రెస్ పార్టీతో గత 2 సంవత్సరాల స్నేహబంధము తర్వాత అవసరమైతే తెగదెంపులు చేసుకుంటామని పార్టీ హెచ్చరిస్తున్నది అంటే ప్రజలకు దూరం అవుతున్నామని ఆందోళన కాక మరేమిటి?  బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాములో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని  అవమానించిన సందర్భంలో కూడా కొన్ని సంఘటనలలో  ఉప ఎన్నికల సందర్భంగా  కాంగ్రెసును కాదని టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో టిఆర్ఎస్కు దూరమై  2023లో కాంగ్రెస్తో పొత్తు కూడిన విషయం మనందరికీ తెలుసు.  ఒక జాతీయ పార్టీగా కొనసాగుతున్న కమ్యూనిస్టు పార్టీ నూరేళ్ల చరిత్ర కలిగి ప్రపంచాన్ని  ప్రభావితం చేసినటువంటి సామాజిక రాజకీయ సిద్ధాంతంతో పనిచేసి కూడా  బూర్జువా పార్టీలకు మద్దతు ఇవ్వడం అంటే తమ దైనందిన నైతికత బాధ్యతలలో రాజీపడడమే అవుతుంది.  బహుశా దాని పర్యవసానంగానే ఇటీవల కాలంలో  జరిగినటువంటి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా  కాంగ్రెస్ పార్టీ సిపిఐ పక్షాన మిత్ర ధర్మాన్ని పాటించిన దాఖలాలు లేనే లేవు. కనీసం ఒక్క సీటు కోసం బ్రతిలాడినటువంటి సందర్భాన్ని గమనిస్తే సిపిఐ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలో కొనసాగడానికి సిద్ధపడతామా? లేదా ప్రజల పక్షాన పనిచేసే ప్రజా ఉద్యమ పార్టీగా నిలబడదామా? లెనిన్ స్టాలిన్ కమ్యూనిస్టు మార్క్స్ వారసత్వానికి ప్రతినిధులుగా నిలబడదామా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఇవాళ సిపిఐ నాయకత్వం పైన ఉన్నది అనడంలో సందేహం లేదు.

రాష్ట్ర కార్యదర్శి కామెంట్స్  ఆందోళన కూడా

కాంగ్రెస్ పార్టీ తన మిత్ర ధర్మాన్ని విస్మరించి సిపిఐ పట్ల  సాచి వేత వైఖరి అవలంబించినట్లయితే పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని రాష్ట్ర కార్యదర్శి కూనాంనేని  సాంబశివరావు గారు చేసిన హెచ్చరిక  ఇటు కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా ఒక రకమైనటువంటి హెచ్చరికగా పనిచేస్తుంది.  ప్రజా సిద్ధాంతం, ప్రజల దైనందిన సమస్యల పట్ల అవగాహన, శ్రామిక దృక్పథము, భూమి, భుక్తి, విముక్తి, కనీస అవసరాల పైన ఉన్నటువంటి అవగాహనను కూడా పక్కనపెట్టి  పెట్టుబడిదారీ పార్టీతో జతకట్టి  ఏదో ఉద్ధరిద్దామని ఒక రెండు సీట్ల కోసం ఆరాటపడితే కనీస మైనటువంటి గౌరవం కూడా ఇవ్వకపోవడం తమ పార్టీ శ్రేణులను అవమానించడం పట్ల  రాష్ట్ర కార్యదర్శి వ్యక్తం చేసిన అభిప్రాయం నిజంగా గొప్పది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంతో కలిసి పనిచేసిన కాలంలో ఆత్మగౌరవం దెబ్బతిన్నదని నీళ్లు, నిధులు, నియామకాలకు  రాజీపడి తలవంచి బతకాల్సి వచ్చిందని ఏ రకంగా నైతే తెలంగాణ ప్రాంతం  ప్రశ్నించిందో అదే మాదిరిగా మన ప్రాంతంలోనే ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీ కూడా తలవంపులకు గురవుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన సందర్భాలను చవిచూసినప్పుడు ఇది నిజం కదా!  ""కేంద్ర ప్రభుత్వo, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలసీల పైన తమకంటూ ఒక ప్రత్యేకమైన విధానం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ పాలసీలను విస్మరించి ప్రజా శ్రేయస్సును మరిచి కేవలం ఒకటి రెండు సీట్ల కోసం అధికారం కోసం ఆరాటపడితే ఎంత ప్రజలకు నష్టం జరుగుతుందో ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు.

 అధికారం కోసం ఆరాటపడదామా? ప్రజల కోసం పోరాటం చేద్దామా? అని నిర్ణయించుకోవాల్సినటువంటి కర్తవ్యం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ముందున్నది.  శ్రేణులకు నాయకత్వానికి కూడా ప్రజలు వేస్తున్న ప్రశ్న ఇది. దానికి జవాబు వెతుక్కోకపోతే అధికారం భ్రమలో ఆరాటపడితే తర్వాత భవిష్యత్తులో  శ్రేణులను కోల్పోవాల్సి వస్తుంది. అధికార దాహానికి ఆరాటపడి లొంగిపోయిందని అపవాదు మూ ట కట్టుకోవాల్సి వస్తుంది కూడా".  అయితే మిత్ర ధర్మాన్ని పాటించవలసినటువంటి కాంగ్రెస్ పార్టీని  డామినేట్ చేయగలిగి  భవిష్యత్తులో జరగబోయే  ఎంపిటిసి జెడ్పిటిసి లతోపాటు  కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీకి అవకాశం ఇవ్వాలి అని నిలదీయగలిగే దమ్ము సిపిఐ పార్టీకి ఉన్నప్పుడు  కచ్చితంగా పార్టీ విధానాన్ని పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆదరిస్తారు. క్రింది స్థాయి వరకు కూడా వాళ్ళ మనోధైర్యానికి  ఇబ్బంది ఉండదు. కానీ  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  అభ్యర్థులు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు పనిచేసినటువంటి సిపిఐ కార్యకర్తలు కేవలం మౌనంగా ఉండి పోవాలంటే ఎందుకు అంగీకరిస్తారు?  రెండేళ్ల లోపలనే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం తెలిసింది కనుకనే కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఈ ప్రకటన చేయడం హెచ్చరించడం మనందరికీ  అర్థమవుతుంది.ఆ స్థాయిలో కేంద్ర కమిటీ కూడా రాష్ట్ర పార్టీకి సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది  ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉండి 100 సంవత్సరాలుగా ఈ దేశంలో కష్టించి పనిచేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి స్థాయిలో పార్టీ కేవలం ఒకటి రెండు సీట్ల అధికారానికి రాజీపడి ఆశపడి లొంగిపోతే దాని పరిణామం జరిగేది ఎవరికో కాదు. ప్రజలకు   ద్రోహం జరుగుతుంది పార్టీని నమ్ముకున్నటువంటి కార్మిక కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, పేద వర్గాల వారికి జరిగే ద్రోహం అంతా ఇంతా కాదు.  అంతేకాదు ఇలాగే రాజీ పడి పోరాటపటిమను విస్మరిస్తే కమ్యూనిస్టు పార్టీ కూడా అంతం కావడానికి ఇదొక కారణం కావచ్చు.  

ప్రజల కోసం పనిచేద్దామా? అధికారం కోసం ఆరాటపడతామా? తేల్చు కోవాల్సిన  సంధి కాలంలో ఉన్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ రాజీ పడకుండా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే  మీ సహకారం లేకుంటే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు.  మీ మద్దతు, నైతికత,పోరాటపటిమ  కూడా ప్రజలకు విశ్వాసం కలిగించింది కనుకనే కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమైంది అనే వాస్తవం ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదు  కమ్యూనిస్టు పార్టీ ముందున్న కర్తవ్యం  కాంగ్రెస్ పార్టీని గుర్తింప చేస్తారా? లేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహానికి  మీ పదవులను వదిలిపెట్టి ప్రజల పక్షాన పని చేస్తారా? తేల్చుకోవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైనది. మౌనంగా ఉండి హెచ్చరించకుండా ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు కానీ మీ హెచ్చరిక మీ మనో ధైర్యానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి మచ్చుతున్న అని ప్రజలు భావిస్తున్న తరుణంలో ప్రజలకు మీరు ద్రోహం చేస్తే సహించడానికి సిద్ధంగా ఉండరు. పార్టీని మీ అంత మీరే భూస్థాపితం చేసుకున్నట్లవుతుంది.

కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాదృక్ పథం

 ఇక కేంద్ర ప్రభుత్వం విధానాల పై కూడా రాష్ట్ర  కార్యదర్శి గారు హెచ్చరిక చేయడం సంతోషం. ఇతర దేశాలతోని శత్రు వైరుధ్యాలను పెంచుకోవడం,  కొన్ని విషయాల పట్ల మౌనవహించడం, అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ఆపడంలో కృషి చేయకపోవడాన్ని  తప్పు పట్టిన తీరు  అభినందనీయం. ఇదే సందర్భంలో రాష్ట్రంలో కేవలం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం  ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. ఇవాళ కనీస మైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు గృహ నిర్మాణ సౌకర్యాలను కల్పించడం ద్వారా పేదరికం తొలగించే ప్రయత్నం రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జరగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా  మాకు ప్రపంచముతోనే పోటీ అని ఒకరంటే, 2047 మా ప్రణాళిక అని మరొకరు అంటూ 1000ఏళ్ల ప్రణాళిక మా దగ్గర ఉందని,  మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంటున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఈ విషయాల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది.

ఇది కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప నిర్మాణాత్మకంగా జరిగినటువంటి   కృషి కార్యాచరణ మనకు అంతగా కల్పించడం లేదు. ఇప్పటికి ఇల్లు లేని వాళ్లు ఒక పూట తిండి కూడా దొరక నటువంటి వాళ్ళు వైద్యo, విద్య  ప్రభుత్వ రంగంలో లేకుండా కార్పొరేటు వ్యవస్థకే కట్టబెట్టిన  ప్రభుత్వం యొక్క ప్రైవేటు విధానాన్ని తిప్పికొట్టే బాధ్యత కమ్యూనిస్టు పార్టీ పైనే ఉంది. ప్రభుత్వ  రంగంలో విద్యా వైద్యo నాణ్యమైన స్థాయిలో అందించడానికి పాలకులు ఎప్పుడు సిద్ధంగా ఉండరు అంబేద్కర్ గారు కూడా అదే విషయాన్ని హెచ్చరించడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీకి చిత్తశుద్ధి ఉంటే విద్య వైద్యాన్ని ఈ దేశంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన స్థాయిలో అందించడానికి  ప్రభుత్వాలపైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్యాచరణ ప్రకటించి యుద్ధమే చేయాలి.అది చేయకుండా కేవలం తాత్కాలిక ప్రయోజనం కోసం పొత్తులతో సంతృప్తి చెందితే ప్రజలు సంతోషపడరు.మీపార్టీ స్వార్థాన్ని,ప్రభుత్వాల ద్రోహాన్ని పసిగట్టర నుకోవడం వట్టి  భ్రమ. అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు చట్టసభలో కొనసాగుతూ ఉంటే,  నేరం ఆరోపించబడి రుజువు కాకుండా అనేక దశాబ్దాల తరబడిగా శిక్ష అనుభవిస్తూ ఉంటే, పీఠక లోని న్యాయం, సమానత్వం అందని ద్రాక్షగా మిగిలిపోతే, 40%సంపద 1%సంపన్నవర్గాల చేతిలో ఉంటే,  న్యాయ వ్యవస్థలో అవినీతిపరులు లక్షలాది రూపాయల సొమ్ము చేసుకుoటే ఈ దేశంలో నిజమైన ప్రజాపాలన ఎలా సాధ్యం?

అంబేద్కర్ గారి మాటల్లో ఈ దేశంలో ఎప్పుడైతే పాలకులు ప్రజలకు న్యాయబద్ధమైనటువంటి పరిపాలన అందించరో అన్ని వ్యవస్థలు బ్రష్టు పట్టిపోయి ప్రజల ఆకాంక్షలు నెరవేరని సందర్భంలో  పాలకులను ఆయా రంగాలను  ప్రజలు తమ ఉద్యమాలు పోరాటాల ద్వారా చిదిమి వేస్తారని  తమకు అనుకూలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని  ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి దుస్థితి ఈనాడు దేశంలో తాండవిస్తున్న వేళ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించవలసిన బాధ్యత బుద్ధి జీవులు, సిపిఐ పార్టీ, మేధావులు రాజకీయ నిపుణులు పైన ఉన్నది.  ఆ వైపు దృష్టి సారించి ప్రజా ఉద్యమాల్లో కలిసి రావాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం మనoదరి కర్తవ్యం.

----  వడ్డేపల్లి మల్లేశం

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333