బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా
బంగాళాఖాతం లో అల్పపీడనం రెడీ అవుతోంది… ఇది రుతుపవనాలను చురుగ్గా మారుస్తుందట. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
IMD Weather Update : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు కావస్తోంది... అయినా ఇప్పటికీ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూన్ మొత్తం చెదురుమదురు వర్షాలతోనే సరిపోయింది... భారీ వర్షాల జాడే లేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ మరీ దారుణం... వానలు కురవకపోగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వర్షాలపై భరోసాతో పంటలు పెట్టుకున్న రైతులు వరుణ దేవుడిని కరునించాలని వేడుకుంటున్నారు... వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. ఆ దేవుళ్లు రైతుల మొర ఆలకించారో ఏమోగానీ జూలై సెకండాఫ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల వాతావరణ విభాగాలు, నిపుణులు చల్లని కబురు అందించారు.
కొద్ది రోజులుగా మందగించిన రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఇది రాబోయే 24 నుండి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉంటుందని... ఇవాళ్టి (జూలై 15, బుధవారం) నుండే వర్షాలు మొదలవుతాయట. ఈ వర్షాలు మరింత జోరందుకుని జూలై సెకండాఫ్ (15-31 తేదీల్లో) లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇప్పటివరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూలై సెకండాఫ్ లో కురిసే వర్షాలు ఈ లోటును భర్తీచేసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నమాట.
ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో... తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఒకటిరెండు చోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు, జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకుంటాయని చెబుతున్నారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... ఇవాళ్టి (జూలై 15) నుండి మెళ్లిగా వర్షాలు షురూ కానున్నాయి. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగింది, వేసవి తరహాలో ఎండలు మండిపొతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగి మారబోతోందని వెదర్ మ్యాన్ తెలిపారు.
ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగినా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి చిరుజల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.