ఫణిగిరి సమగ్రాభివృద్ధికి రూ.5 కోట్లు
@ఫణిగిరి, గాజులబండ బౌద్ధ కట్టడాల పరిరక్షణ పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన
తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక, క్రీడా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ఫణిగిరి, గాజులబండ బౌద్దా క్షేత్రాల్లో పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే మందుల సామేల్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం శంకుస్థాపన చేశారు. తెలంగాణ జెన్‌కో (వైటీపీఎస్) సీఎస్‌ఆర్ నిధులతో ఫణిగిరి బౌద్ధ కట్టడాల పరిరక్షణకు రూ.1.60 కోట్లు, గాజులబండ కట్టడాల సంరక్షణకు రూ.23 లక్షలు నిధులు మంజూరు చేశారు. ముందుగా మంత్రి ఫణిగిరిలో పురావస్తు శాఖ వారి తవ్వకాలలో లభించిన బౌద్ధ కళాఖండాల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంని సందర్శించి ఆసక్తిగా తిలకించారు. తదుపరి ఏర్పాటు చేసిన
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఫణిగిరి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బౌద్ధ వారసత్వ కేంద్రాల్లో ఒకటని పేర్కొన్నారు. బౌద్ధల యొక్క ధర్మం, శాంతి, అహింస, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచిందని, బుద్ధుడు 29 సంవత్సరాల వయస్సులో రాజ సౌఖ్యాలు వదిలేసి దేశసంచారం చేస్తూ ప్రజలకు జ్ఞానోపదేశాలు చేశారని, మన కోరికలను అదుపులో ఉంచుకుంటే మనసు ప్రశాంతతగా ఉంటుందని, నేను, నాది అనే వాటిని వదిలివేసి మనం, మనది అనుకున్నప్పుడు బాధలు ఉండవని మన ఆలోచన విధానాలే మన కోరికలకు మూలమని బోధించిన బుద్ధుని బోధనలు మరువ వద్దని అన్నారు. ప్రజలు కూడా లేనిపోని ఆడంబరాలకు పోయి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నష్టపోవద్దని మంత్రి అన్నారు. చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక, పురావస్తు, వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. బౌద్ధ పర్యాటక పటంలో తెలంగాణకు మరింత గుర్తింపు తీసుకువస్తామని
ఫణిగిరి, గాజులబండ వంటి బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి ద్వారా తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక పటంలో మరింత ప్రముఖంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తవ్వకాలలో వెలుగులోకి వచ్చిన శిల్పాలు, శాసనాలు, నాణేలు తెలంగాణ చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నాయని అన్నారు. పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ ఇది బుద్ధుడు నడయాడిన పవిత్ర నేలని, దీనిని ఇంకా అభివృద్ధి చేసుకొనే బాధ్యత మనందరి మీద ఉన్నదని ప్రభుత్వం నుండి ఇంకా నిధులు మంజూరు చేసి మెయిన్ రోడ్డు నుండి ఫణిగిరి గుట్ట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరగా, ఎమ్మెల్యే విజ్ఞప్తి పై వెంటనే స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఫణిగిరి బౌద్ధ క్షేత్ర సమగ్ర అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో ప్రధాన రహదారి నుంచి క్షేత్రానికి చేరుకునే డబుల్ రోడ్డు నిర్మాణం, కొండపైకి వెళ్లే
మెట్లదారి నిర్మాణం, టాయిలెట్స్, పర్యాటక మౌలిక సదుపాయాల కల్పన, సందర్శకుల వసతుల మెరుగుదల చేపట్టనున్నట్లు తెలిపారు. తదుపరి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర ఎంతో గొప్పదని, అలాంటి చరిత్రను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఇలాంటి బౌద్ధ కట్టడాలు మన జిల్లాలో ఉండటం మన జిల్లాకు గర్వకారణం అని భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు ఫణిగిరి క్షేత్రం దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ్ నాయక్, ఓఎస్డీ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు నాగలక్ష్మి, మల్లు నాయక్, ఫణిగిరి, గాజులబండ గ్రామాల సర్పంచులు ఎర్ర సావిత్రి, వంగూరు దామోదర్ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
----------------------------------
జారీ చేసిన వారు.. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యపేట