పిడుగుపాటును ముందే గుర్తించి అప్రమత్తత చేసే యాప్ దామిని – లైట్నింగ్ అలర్ట్
దామిని యాప్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- పిడుగుల ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు అందించే “దామిని – లైట్నింగ్ అలర్ట్” యాప్‌ను ప్రజలందరూ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.
వర్షాకాలంలో పిడుగుల కారణంగా సంభవించే ప్రమాదాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించిన “దామిని – లైట్నింగ్ అలర్ట్” మొబైల్ యాప్‌ను ప్రజలందరూ డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని జిల్లా కలెక్టర్ కోరారు.పిడుగులు పడే అవకాశాన్ని జీపీఎస్ ఆధారంగా ముందుగానే గుర్తించి హెచ్చరికలు అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లో https://play.google.com/store/apps/details?id=com.lightening.app.damini “దామిని : లైట్నింగ్ అలెర్ట్ ”పేరుతో ఈ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని తెలిపారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్,చిరునామా తదితర వివరాలతో నమోదు చేసుకుని జీపీఎస్ లొకేషన్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం వినియోగదరుడు ఉన్న ప్రాంతం చుట్టూ సుమారు 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల పరిస్థితిని యాప్ పర్యవేక్షిస్తూ అవసరమైన హెచ్చరికలను అందిస్తుందని వివరించారు.పిడుగుల ప్రమాద స్థాయిని గుర్తించేందుకు యాప్‌లో రంగుల ఆధారిత హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. మీ ప్రాంతంలో సుమారు 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఎరుపు రంగు, 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే పసుపు రంగు, 18 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే నీలం రంగు ద్వారా యాప్ ముందస్తు హెచ్చరికలు తెలియజేస్తుందని తెలిపారు.ఈ అలర్ట్‌లను గమనించి ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పిడుగుల ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవచ్చని అన్నారు. చదువుకోలేని వారు కూడా అలర్ట్ సౌండ్ ద్వారా ప్రమాదాన్ని సులభంగా గుర్తించగలరని,పిడుగుల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా యాప్ మార్గనిర్దేశం చేస్తుందని వివరించారు.పిడుగులు సంభవించే సమయంలో చెట్ల కింద,విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా బహిరంగ మైదానాల్లో ఉండకుండా వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.ప్రజల ప్రాణ రక్షణలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ ప్రతి కుటుంబం తమ మొబైల్ ఫోన్‌లో దామిని యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, గ్రామాలు,పాఠశాలలు,కళాశాలలు,రైతు వేదికలు మరియు ప్రజా సంస్థల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.