నేరాల నియంత్రణపై పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం

Apr 28, 2026 - 20:08
 0  1
నేరాల నియంత్రణపై పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం

గద్వాల (ఏప్రిల్ 28): జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో నేరాల నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు సోమవారం జిల్లా అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.                                                                                                   
జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరాల నియంత్రణ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా చూసి నేరస్తులకు తప్పనిసరిగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయడం పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కేసుల విచారణలో జాప్యం లేదా నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరిస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసి, బ్లూ కోల్ట్స్ వాహనాల ద్వారా ఎల్లప్పుడూ విజిబుల్ పోలీసింగ్ ఉండేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.

అలాగే రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ముఖ్యంగా సైబర్ నేరాల నివారణకు గ్రామ స్థాయి వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్రమ గంజాయి రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రాల్లో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠినంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక సమస్యలను తెలుసుకోవాలని, ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను గుర్తించాలని, గ్రామ సభల తీర్మానాల అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

అదనంగా, ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు నిర్వహించబడుతున్న చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ వీక్ కార్యక్రమాలను ప్రతి మండలంలో సమర్థవంతంగా నిర్వహించాలని, డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా యువత మరియు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్, డీఎస్పీ గద్వాల వై. మొగిలయ్య , సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు మరియు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333