తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ యూనియన్ తో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి
వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి.
వడ్డేపల్లి మల్లేశం అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు
హుస్నాబాద్ , 14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త వేలేఖరి :- విద్యుత్ రంగంలో ఆర్టిసన్ ఉద్యోగులతో పాటు తాత్కాలికంగా వివిధ విభాగాలలో పని చేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అర్హత గల వారందరికీ ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని పలు డిమాండ్లతో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ కార్యాలయంలో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్డేపల్లి మల్లేశం బి ఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బూర వెంకన్న, బి ఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ లతో కలిసి సోమవారం రోజున శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి మల్లేశం మాట్లాడుతూ విద్యా వైద్యము ఇతర రంగాలలో మాదిరిగా విద్యుత్ విభాగంలో కూడా తాత్కాలిక ఉద్యోగుల పెట్టి చాకిరీ విధానాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. అర్హత కలిగిన ఆర్టిసిన్ ఉద్యోగులకు వేతన క్రమబద్ధీకరణ చేయాలని, 11వ పిఆర్సి అమలు చేయాలని, 2016 కంటే ముందు నియామకమై ఆర్టిసన్ ఉద్యోగులుగా గుర్తింపు పొందని వారిని గుర్తించాలని ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా అందులో ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగులు అల్ప వేతనంతో జీవిస్తున్నటువంటి వారి వేతనాలను క్రమబద్ధీకరించి అవసరమైన చోట కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం ద్వారా న్యాయం చేయాలని మల్లేశం పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు పోరాటలే, శరణ్యమని, పోరాటాలను మించిన సాధనం మరొకటి లేదని, పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ కార్మికులను ఉత్సాహపరిచారు. 19,000 మందికి పైగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు గత ఆరు రోజులుగా సమ్మెలో పాల్గొనడం వలన విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అత్యవసరమైనటువంటి విద్యుత్ విభాగంలో కూడా ఇలాంటి సమ్మెలను ప్రోత్సహించే విధానం సరికాదని తక్షణమే వీరి డిమాండ్ ల ను పరిష్కరించడం కోసం జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి నిజమైన పరిపాలకులని రుజువు చేసుకోవాలని ఆయన కోరారు. అనేక పథకాల పేరుతో కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పెట్టి చాకిరీపైన కటిక ఇబ్బందుల మధ్యన జీవిస్తున్న ఉద్యోగులను మాత్రం ప్రభుత్వం కరుణించకపోవడం విచారకరమని, అర్హత కలవారికి పదోన్నతి సౌకర్యాలు కల్పించాలని, కారుణ్య నియామక ఉద్యోగులకు అర్హతలకు తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వడ్డేపల్లి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా శిబిరంలో వందమంది ఉద్యోగులు కార్మికులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ హక్కులను సాధించుకునే వరకు విశ్రమించేది లేదని ప్రాణాల కైనా తెగించి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఉద్యోగ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.