ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ...!!!

Feb 16, 2026 - 23:08
Feb 16, 2026 - 23:13
 0  5
ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ...!!!

ఓట్ల కొనుగోలు కే మొగ్గు...!ప్రజాస్వామ్యానికే సిగ్గు సిగ్గు...!

సామాన్యులకు అందని ద్రాక్షలా ఎన్నికల బరి...!

వారికి ఎప్పుడు దక్కుతుందో కదా అధికార పీఠం గురి...!

పేదవారు పోటీ చేయాలంటే ఎన్నికలు బహు భారం...!

అందుకే వారు పోటీ చేయలేక చాలా ఎన్నికలకు దూరం...!

✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పోటీ చేయాలంటే సామాన్యులకు బహుభారంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి రాను రాను చాలా కాస్ట్లీ గా మారుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు బ్యాలెట్ ద్వారా అయితే చాలా వ్యయం ప్రభుత్వానికి అధికారికంగా అవుతుందని, వ్యయం తగ్గించడానికి పేపర్ లెస్ బ్యాలెట్ రూపొందించి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు ఈవీఎంల ద్వారా కొంత తగ్గినప్పటికీ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రవాహాన్ని మాత్రం ఏ ఎన్నికల్లో అయినా యదేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చేస్తున్న అధికారిక ఖర్చు కంటే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చేస్తున్న అనధికార ఖర్చు వందల, వేల కోట్ల రూపాయలను దాటిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఉంటే సరి, లేకుంటే పోటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎన్నికలలో పోటీ అంటేనే అది ధనవంతులకు మాత్రమే అనే విధంగా నేటి ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది. కోటీశ్వరులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేసి డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేసి, మద్యం ఏరులై పారించి ఓట్లను వర్గాల వారీగా, కులాల వారీగా, మతాలవారీగా గుండు గుత్తగా, గంపలో కూరగాయలను కొన్న మాదిరిగా కొని అధికారాన్ని చేజెక్కించుకుంటున్నారు. అలా అధికారంలోకి వచ్చినవారు ఐదు సంవత్సరాలు అధికార పీఠంపై దర్జాగా కూర్చుని అవినీతికి, అక్రమాలకు, అన్యాయాలకు, ఆర్థిక నేరాలకు, వైట్ కలర్ దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి మరిన్ని వందల, వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రెండు చేతుల సంపాదించి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నవారు తిరిగి ఎన్నికలు రాగానే తాము అక్రమమార్గంలో దోచుకున్న రూపాయలలో మరికొంత ఖర్చుపెట్టి ఓట్లని కొనుగోలు చేసి తిరిగి ఐదు సంవత్సరాలకు తమదే అధికారమంటూ విర్రవీగుతున్నారు. ఇలా నిరంతరంగా కొనసాగుతున్న ఎన్నికలు అక్రమార్గాలుగా, అవినీతి నిలయాలుగా మారిపోయి ప్రజాస్వామ్యం వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎన్నటికీ, ఎప్పటికీ తగ్గని ఒక పాండు రోగంలా ఎన్నికల అవినీతి రాచ పుండు నిత్యం రగులుతూనే ఉంది.అవినీతి రాజకీయ నాయకులకు అండగా మనీ, మద్యం, మజిల్ పవర్ (గుండాయిజం రౌడీయిజం) లు విడదీయరా ని బంధాలుగా పెనవేసుకుని సమాజంలో ఊహించని అనైతిక పెను మార్పులకు ఆలవాలమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రాగానే దోచుకో, దాచుకో అన్న సూత్రాన్ని పాటిస్తూ తరతరాలుగా తిన్నా, ఖర్చు చేసినా తరగని అవినీతి ఆన కొండలా మింగి ఏ తప్పు చేయని నిజాయితీపరులుగా నటిస్తూ, మేక వన్నె పులులుగా సమాజంలో సంచరిస్తూనే ఉన్నారు రాబందులు అనబడే నేటి ఆధునిక కాలపు అనైతిక రాజకీయ నాయకులు కొందరు. రాజకీయ వనంలో మంచి రాజకీయ నాయకులు ఉన్నారంటే అది ఎక్కడో ఒకచోట గంజాయి వనంలో తులసి మొక్క లాగా మనకు సంచరిస్తుంది. ఎన్నికల్లో మద్యం, మనీ ప్రవాహానికి అడ్డుకట్ట పడేటప్పుడు అవినీతి అంతం అయ్యేటప్పుడు.

సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంక నాకి పోవాల్సిందేనా...! పదో,పరకో కలిగి ఉంటే అంతా ఊడ్చుకు పోకోవాల్సిందేనా..!

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేతి పుణ్యమా అని ఈ దేశంలోని 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన మైనార్టీ వర్గాల వారికి ఎన్నికలలో పోటీ చేయడానికి రిజర్వేషన్లు కల్పించారు. ఎలాగూ జనరల్ స్థానాలలో పోటీకి రిజర్వుడు అభ్యర్థులకు అవకాశం లేదు. తమకు అవకాశం ఉన్న రిజర్వుడు స్థానాల్లో అయినా పోటీ చేద్దాం అనుకుంటే అందుకు తగ్గ ఆర్థిక వనరులు లేవు. రేక్కాడితే గాని డొక్కాడని పేద బతుకులు ఎక్కువ శాతం మందివి. అలాంటి పేదలు పోటీ చేయడమే ఒక భారము అనుకుంటే, డబ్బు లేనిదే ఎన్నికల్లో గెలవలేము అని అనుకోవడమే కాదు అది వాస్తవం కూడా. అయినప్పటికీ ఈ దేశంలో పదిహేను శాతమే ఉన్న ఉన్నత కులాల రాజకీయ నాయకులు రిజర్వుడు స్థానాలు కూడా తాము చెప్పినట్టు వినే తాబేదారులకు, బానిసలకు టికెట్లు ఇప్పించి, గెలిపించి, పరోక్షంగా తిరిగి వారి కనుసన్నల లోనే మసలు కొనే విధంగా చూడటంలో కొత్త ఏమీ లేదు, వింత అంతకన్నా కాదు, ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు, నిత్యం జరుగుతున్న తంతు ఇదే. అంటే జనరల్ స్థానాల్లో గెలిచి వారే అధికారం చేజిక్కించుకుంటారు, రిజర్వుడు స్థానాల్లో వారి అనుచరులు పెట్టి అధికారం మాత్రం వారే చెలాయిస్తారు, ఈ విధంగా ప్రజాస్వామ్యం కంటికి చెడ్డ రేవడిలా కేవలం కొంత శాతం ఉన్న కులాల చేతిలోనే అధికారం కేంద్రీకృతమై ఉండటం ప్రజాస్వామ్యానికి ఒక శాపంలా చెప్పుకోవచ్చు. కూడు, గూడు లేని పేదలు ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ అంతో ఇంతో ఉన్న కాడికి ఖర్చుచేసి ఓటమిపాలు చెందుతే ఉన్నదంతా ఊడ్చుకు పోయి మిగిలేది గోసి గుడ్డ తప్ప ఇంకేమి ఉంటుంది. గుడిసె మీద ఉన్న నాలుగు తాటాకులు, ఇంత జమ్మి గాలికి ఎగిరి ఒంటరిగా దిగాలుగా రోడ్డుపై నిల్చోవడం తప్పించి ఈ దేశంలోనే పేదలకు మాస్టర్ కి అనే రాజ్యాధికారం ఎన్నటికీ అందని ద్రాక్ష, తీరని కల, నెరవేరని లక్ష్యం అవుతుంది కదా. ఈ దేశంలో సామాన్యుడు అంటే ఉన్నత వర్గాల రాజకీయ పార్టీల జెండా మోసే ఒక రోజు కూలిగా మాత్రమే చూడటం విచారకరం. అందుకే కర్ర ఉన్నోడిదే బర్రె, తాడు ఉన్నోడిదే ఆవు, అధికారం ఉన్నోడుదే రాజ్యం. ఎన్నికలలో డబ్బు, మద్యం పంపిణీ స్థానంలో నీతి, నిజాయితీ, నైతికతకు పెద్దపీట వేసి, రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా సేవాభావంగా తలచే విజ్ఞానవంతులను, నిస్వార్థ రాజకీయ నాయకులను, రాజనీతిజ్ఞులను చట్టసభలకు పంపిస్తే ప్రజాస్వామ్యానికి ఒక విలువ, గొప్పదనం, ఆదర్శం, అర్థం,పర్థం ఉంటుంది.

రాజకీయ స్వేచ్ఛనిచ్చిన అంబేద్కరా...!

ఆర్థిక స్వేచ్ఛను ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా...!

ఆర్థిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ వట్టి బూటకం. పూజకు పనికిరాని పువ్వు. అంతరాల దొంతరలో, నిచ్చెన మెట్ల వ్యవస్థలో సామాన్యుడు, సగటు జీవి కూలిపోయింది, కాలిపోయింది భారతదేశ చరిత్రలో జరిగిన సజీవ సాక్ష్యం. ప్రతి మనిషికి ఓటు హక్కును కల్పిస్తూ ఒక గొప్ప వజ్రాయుధాన్ని సామాన్యుల చేతికి అందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యానికి ఓటును సక్రమంగా వినియోగించి మంచి పాలకులను ఎన్నుకుంటే ప్రతి వారికి భవిష్యత్తు మంచిగా ఉంటుందని, అదే ఓటును ప్రలోభాలకు లొంగి అమ్ముకుంటే జీవితాంతం సామాన్యులు బానిసలుగా బతకాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు. ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించే ఓపిక, పట్టుదల, సహనం సామాన్య ప్రజలలో ఎందుకు కొరబడిందనేది నేటికీ సమాధానం దొరకని ప్రశ్నలా మారి సగటు జీవిని ప్రశ్నిస్తూనే ఉంది. భారత రాజ్యాంగ పీఠికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాహ్తృత్వం అని చెప్పినప్పటికీ ఇంకా ఈ భారత ప్రజాస్వామ్యంలో మనిషిని మనిషిగా చూసే సమానత్వం లేకపోవడం, ఆర్థిక వనరులలో బేధాలు ఉండటం, వేళ్ళ మీద లెక్కించగల కొద్ది మంది చేతుల్లోనే ఈ దేశ సంపద 90 శాతం ఉండటం, 90% గా ఉన్న బడుగు వర్గాల వద్ద కేవలం 10 శాతం సంపద కూడా ఉండకపోవటం అంతరాల సమాజానికి కారణంగా పేర్కొనవచ్చు. ఈ దేశ సంపద అంతా వారి వారి జనాభ కనుగుణంగా ప్రతి వారికి పంపిణీ జరిగిన నాడు, ఈ దేశ భూములు అన్ని కూడా అందరికీ సమానంగా పంచిన నాడు, ఈ దేశ ఆర్థిక వనరులు అందరికీ సరి సమానంగా అందుతున్న నాడు మాత్రమే ఈ దేశంలో సమ సమాజం ఏర్పడుతుంది. అప్పటిదాకా కేవలం ఓటు హక్కు కల్పించి ఇచ్చిన రాజకీయ స్వేచ్ఛ డబ్బులను మాత్రం ఇవ్వకుండా ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడంతో అది బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది, దున్నపోతు పై పడిన వానచందంగా ఉంటుంది. ఈ సమాజం వర్గ, వర్ణ, కుల, మత రహితంగా మారిన రోజు, "స్వేచ్ఛగా జన్మించిన మానవుడు నిత్యం సంకెళ్లలో ఉన్నాడు" అన్న రాజకీయ తత్వవేత్త రూసో చెప్పిన ప్రకారం ప్రతి మనిషి స్వేచ్ఛగా ఈ నేల మీద నడ యాడితేనే భారత ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్ట గలుగుతుంది. నలుదిశలా భారత దేశ ప్రజాస్వామ్య కీర్తి పరిడ విల్లుతుంది. అందుకు అనుగుణంగా మార్పులు చేసి సామాన్యుల జీవితాలలో మార్పుకు నాంది పలకాలని మనమూ కోరుకుందాం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333