అయిజలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలల బస్సులు సీజ్
యాజమాన్యాల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం.
జోగులాంబ గద్వాల 17 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, కనీస రక్షణ ప్రమాణాలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థల ధనార్జన ధోరణిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయిజ పట్టణ కేంద్రంలో బుధవారం గద్వాల రవాణాశాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ప్రైవేట్ పాఠశాలల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. పట్టణంలోని కాకతీయ మరియు వైష్ణవి పాఠశాలలకు చెందిన విద్యార్థుల రవాణా బస్సులను అధికారులు నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సదరు బస్సులకు కనీస రహదారి అర్హత పత్రాలు (ఫిట్‌నెస్) లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. పూర్తి కాలపరిమితి ముగిసి, కనీస భద్రతా ప్రమాణాలు లేని వాహనాలలో విద్యార్థులను ప్రమాదకర రీతిలో తరలిస్తుండటంపై రవాణా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ లేని ఆ రెండు పాఠశాలల బస్సులను తక్షణమే సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు గద్వాల మోటార్ వాహనాల తనిఖీ అధికారి (ఎంవీఐ) రామ్ చరణ్ తెలిపారు. జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) రాధిక జారీ చేసిన ప్రత్యేక ఆదేశాల మేరకే నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాల వాహనాల తనిఖీలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమాలలో రవాణాశాఖ కార్యాలయ సిబ్బంది గోవర్ధన్, రిషి, గోవిందు పాల్గొన్నారు.
పిల్లల ప్రాణాలంటే అంత చులకనా? మండిపడుతున్న తల్లిదండ్రులు
"పాఠశాలలు ప్రారంభం కాకముందే రవాణా ఫీజుల పేరిట వేలాది రూపాయలు వసూలు చేసిన యాజమాన్యాలు, బస్సుల కండిషన్ ఎలా ఉందో పట్టించుకోకపోవడం దారుణం. ప్రతిరోజూ మా పిల్లలు బస్సు ఎక్కి ఇంటికి సురక్షితంగా తిరిగి వచ్చేవరకు భయంతో గుండె చేతుల్లో పట్టుకుని బతకాల్సి వస్తోంది. లాభాల కోసమే చూసే విద్యాసంస్థలు పిల్లల ప్రాణాలకు కనీస గ్యారెంటీ ఇవ్వవా?"
- ప్రసాద్ , ఐజ
"ప్రభుత్వ అధికారులు తనిఖీ చేసి పట్టుకుంటే తప్ప ఈ బస్సులకు ఫిట్‌నెస్ లేదనే నిజం మాకు తెలియడం లేదు. నమ్మకంతో మా పిల్లలను పంపిస్తుంటే, యాజమాన్యాలు ఇలాంటి కండీషన్ లేని బస్సులను నడపడం అత్యంత దుర్మార్గం. కేవలం డ్రైవర్ల మీదే భారం వేయకుండా, స్కూల్ యాజమాన్యాలపైనే అధికారులు కేసులు నమోదు చేయాలి"
- నక్క చంద్రశేఖర్, ఐజ