వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కనుమరుగు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
![వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కనుమరుగు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం](https://telanganavaartha.com/uploads/images/202501/image_870x_677a2a6ad5270.jpg)
వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని కనుమరుగు చేస్తున్న కేంద్ర సర్కార్
తెలంగాణవార్త 05.01.2024.సూర్యాపేట జిల్లా ప్రతినిధి :- ఏళ్ళ తరబడి వర్కింగ్ జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం కనుమరుగు చేయడం సహించరానిదని, వాటి పునరుద్దరణ కోసం జర్నలిస్టులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
శనివారం నాడు బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ పితామహులు మణికొండ చలపతి రావు కృషితో సాధించుకున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, జర్నలిస్టులను వేజ్ బోర్డు నుండి దూరం చేయడం విచారకరమన్నారు. సమాచార రంగంలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కేంద్ర ప్రభుత్వం నేటి వరకు గుర్తించక పోవడం సమంజసం కాదన్నారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయు) కృషితోనే దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కొంతమేరకైనా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణలో వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తెలంగాణ వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ను ఆయన అభినందించారు. రాష్ట్రంలో వీడియో జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమావేశానికి వీడియో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వనం నాగరాజు అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి నండూరి హరీష్ స్వాగతం పలికారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ,
ఉప ప్రధాన కార్యదర్శి కె.రాములు, కార్యదర్శులు వి.యాదగిరి, కె.శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి యం.వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యూ.జె.అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి హరిప్రసాద్, టీయూడబ్ల్యూజె మహిళ విభాగం బాధ్యురాలు కల్యాణం రాజేశ్వరిలతో పాటు వీడియో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.