రామాలయ భూమి అక్రమ రిజిస్ట్రేషన్
అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
కోమటికుంట/ సూర్యాపేట 26ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట గ్రామంలో 50 ఏళ్ల నాటి రామాలయం భూమిని గ్రామానికి చెందిన మామిడి సైదులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని అదే గ్రామానికి చెందిన గట్టు రమేష్, గ్రామస్తులు ఆరోపించారు. ఆదివారం రామాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోమటికుంట గ్రామంలో 50 ఏళ్ల క్రితం రామాలయానికి భూమిని కేటాయించినట్లు తెలిపారు. అందులో కొంత భూమి పక్కనే ఉన్న మామిడి సైదులు తీసుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా రామాలయం ఉన్న భూమిని కూడా తన ఇంటితోపాటు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఇంటిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడని తెలిపారు. విషయమై పెద్దమనుషుల సమక్షంలో సైదులను ప్రశ్నించగా తాను బ్యాంకు లోను క్లియర్ చేసి స్థలాన్ని రామాలయానికి అప్పగిస్తానని పెద్దమనుషుల సమక్షంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. తీర్మానం చేసి 30 నెలలు గడుస్తున్న నేటి వరకు బ్యాంకు లోను క్లియర్ చేయడం లేదని ఇదేమని ప్రశ్నిస్తే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఉన్నత అధికారులు స్పందించి రామాలయం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మా రామాలయం భూమి రామాలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పెద్ద మేతరి మామిడి జానయ్య, చెరుకుపల్లి అశోకు, మహేష్, చెరుకుపల్లి చంద్రయ్య, గట్టు అచ్చయ్య, మామిడి ఈదమ్మ లు ఉన్నారు.