ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

Apr 15, 2026 - 19:35
 0  1
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

వైద్యులు, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి.

ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి. 

గద్వాల జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే. 


 జోగులాంబ గద్వాల 15 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కమిటీ సభ్యులు, వైద్యాధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న  వైద్యులు, ఇతర సిబ్బందిని నిబంధనల ప్రకారం నియమించేందుకు ముందుకెళ్లాలన్నారు. ఆసుపత్రిలో ఆయా విభాగాల వారీగా అవసరమైన పరికరాలు, ఇతర వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆసుపత్రి నిధులను ప్రాధాన్య క్రమంలో వినియోగించాలని సూచించారు. ఆసుపత్రి వద్ద పార్కింగ్ సమస్య లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మెప్మా కు సంబంధించిన అర్బన్ సెల్టర్ హోమ్  నిర్మాణానికి గతంలోనే రూ. కోటికి పైగా నిధులు మంజూరు కావడంతో తగిన స్థలంలో నిర్మించాలన్నారు. సదరన్ సర్టిఫికెట్స్ క్యాంపుకు వచ్చే దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గాంధీ చౌక్ లోని పాత జిల్లా వైద్యాధికారి  కార్యాలయంలో  పలు గదులు ఖాళీగా ఉండడంతో అక్కడికి ఆయుష్ ఆసుపత్రిని తరలించేందుకు ఆలోచించాలన్నారు. 

గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గద్వాల నుంచి ఇప్పటికి చాలా మంది రోగులు మెరుగైన వైద్య సేవల కోసం కర్నూల్ వెళ్లాల్సి వస్తోందని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలందించాలన్నారు. గద్వాల జనరల్ ఆస్పత్రిలో అన్ని శస్త్ర చికిత్సలు చేసేందుకు అవసరమైన వైద్యులు, యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచాల్సి ఉందన్నారు. గర్భిణీలు ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారని, రూ. 30 వేలకు పైగా బిల్లులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు అధికంగా చేయాలన్నారు. గద్వాల జనరల్ ఆస్పత్రిలో జనరేటర్ల నిర్వహణకు అవసరమైన నిధులను కేటాయించాల్సి ఉందన్నారు.  ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల స్థానాలతో పాటు, ఇతర వైద్య సిబ్బందినీ పూర్తి స్థాయిలో నియమించేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు.  వైద్య ఆరోగ్యశాఖ తరపున రోగులకు మంచి వైద్య సదుపాయాలు కల్పించినప్పుడే ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలుగుతుందని, ఆ దిశగా సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ సంధ్య కిరణ్మయి, ఆసుపత్రి పర్యవేక్షకులు ఇందిర, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, టీజిఎంఎస్ఐడిసి డిఈ శ్రీనివాసులు, ఏఈ రహీం, కమిటీ సభ్యులు శ్రీధర్ గౌడ్, ఇతర వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333