సూర్యాపేట నుంచి చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉద్యమానికి శ్రీకారం
వీరనారి ఆశయ సాధనకు రజక సమాజం ఐక్యంగా ముందుకు రావాలి – ముప్పు బిక్షపతి
సూర్యాపేట 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉద్యమానికి సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టినట్లు బీసీ రత్న అవార్డు గ్రహీత, ముప్పు బిక్షపతి తెలిపారు.
మంగళవారం నిర్వహించిన రజక సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దొరల పెత్తందార్ల అన్యాయాలకు ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని గ్రామ గ్రామానా చాటిచెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ ఉద్యమానికి సూర్యాపేట కేంద్రంగా శ్రీకారం చుట్టడం గర్వకారణమని పేర్కొంటూ, రజక సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిన మహానీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. రజకులు ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితుల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన ముప్పు బిక్షపతి, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో రజకులకు తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రజక మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, యువత ఉపాధి, ఆర్థిక సాధికారత కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో రజక సంక్షేమ సంఘం నాయకులు, మహిళా ప్రతినిధులు, యువజన కార్యకర్తలు, పలువురు సామాజికవేత్తలు పాల్గొన్నారు.