సాహిత్య యుగకర్త శ్రీశ్రీ గూర్చి ఎంతో నేర్చుకుందాం
తెలుసని విర్రవీగడం మరిచి రచయితలుగా, పాఠకులుగా సమాజానికి మన కృషిని కొంతైనా అందిద్దాం.శ్రీశ్రీ కదే సంస్మరణ.
--వడ్డేపల్లి మల్లేశం
ఎ oతకాలం జీవించినం అన్నది ముఖ్యం కాదు. ఎంత అర్థవంతంగా, ఆమోదయోగ్యంగా సామాజిక ప్రయోజనకరంగా బ్రతికినామన్నదే కొలమానం. అశేష జీవరాశులలో మానవునికి ఉన్నటువంటి ఉత్కృష్టత ఆలోచన వివేచన అన్వేషణ తో పాటు పరోపకార జీవితం సమాజ హితాన్ని ఆశించడం వల్లనే. ఆ కోణంలో జీవించిన వాళ్ళు వ్యవస్థ ఉన్నంతవరకు ఏదో ఒక రూపంలో జ్ఞాపకం ఉంటారు జీవిస్తారు అందుకే వాళ్లను మృత్యుంజయులు అంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాల్లు రాజకీయ, సామాజిక, సాహిత్య, శాస్త్రీయ, వైద్య, విద్య తదితర రంగాలలో నైపుణ్యం సాధించిన వాళ్లతో పాటు నిరక్షరాశులై వ్యవస్థ కోసం తపన పడ్డ వాళ్ళు కూడా కోకొల్లలు.తనకాంటూ మనిషి చరిత్ర సృష్టించుకోవాలి అన్న మాజీ ప్రధాని నెహ్రూ కోవలో సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేర్చి సమాజ హితం కోసంసాహిత్యం అని రుజువు చేసినటువంటిశ్రీశ్రీ ఆధునిక యుగ కర్తగా నిలిచినాడనేది జగమెరిగిన సత్యం. ఒక్క సాహిత్య రంగంలోని వారికి మాత్రమే కాదు మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఉండవలసిన కనీస లక్షణం సామాజిక స్పందన అని ఆయన జీవితం మనలను హెచ్చరిస్తూనే ఉంటుంది.
ప్రముఖ తెలుగు కవిగా, హేతువాదిగా, నాస్తికుడిగా, అభ్యుదయ రచయితల సంఘంతో పాటు విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షునిగా పనిచేసే సాహిత్య సేవ ద్వారా ప్రజల్లో త లలోని నాలుకల జీవించవచ్చు నని రుజువు చేసిన ఆయన జీవితం అపరిమితంగా అధ్యయనం చేద్దాం. పరిమితంగానైనా ఆచరించి సామాజిక సాహిత్య సాంస్కృతిక సేవలో పునరాంకితమవుదాం. పాఠకులుగా రచయితలుగా సామాజిక రుగ్మతలు మరీ విచ్చలవిడిగా జడలు విప్పుతున్న ప్రస్తుత తరుణంలో మనం కూడా అదే స్థాయిలో సామాజిక మార్పు కోసం పునరo కితం కావడానికి ఆయన కృషి, సేవ, ధైర్యం, సామాజిక అవగాహన, సంస్కరణ, తోడ్పడుతుందని ఆశిద్దాం.
శ్రీశ్రీ రచన ధోరణి సామాజిక అవగాహన
1950లో మొదటిసారిగా ప్రచురించిన మహాప్రస్థానం కావ్యం శ్రీశ్రీ ని ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యున్నత స్థానంలోనిలిపింది. సామాజి క అంశాలే కవితా వస్తువుగాఆ కాలంలో తను రాసిన ప్రతి కావ్యం కూడా ప్రజా దృక్పథంతో మార్క్సిజం దృక్కోణంలో రాసినవే అని ఆయనకు ఆ తర్వాత చాలా కాలానికి కానీ తెలియలేదన్నాడు. స్వయంగా శ్రీశ్రీ మాటల్లో ...
"ఈ వాస్తవాలు అన్నింటికీ నేను స్పందించిన ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్సనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు ఒక్కసారి తిరిగి చూసుకుంటే మహాప్రాస్థానం గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తి, సామాజిక స్పృహ యాదృచ్ఛికాలు కావని వాస్తవాలనుండి ఉబికి వచ్చినాయి అని తెలుస్తుంది" అంటే సాహిత్య రంగంలో ఎంత ముందు చూపు ఉందొ అర్థమౌతుంది. మహాప్రస్థానం ప్రచురించిన 20 సంవత్సరాల తర్వాత వెలుగు చూసిన ఈ అభిప్రాయాన్ని బట్టి సహజంగా సామాజిక చింతన సామాజిక సమస్యలే వస్తువుగా ప్రజా జీవితము చుట్టూ అల్లిన రచనల్లో మార్క్సీజం అంతర్భాగమని చెప్పకనే చెప్పినట్లయినది. అంటే ప్రజా దృక్పథం, సామాజిక చింతన,అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో రకంగా సమాజం కోసం తపనపడ్డవాళ్ళు మార్కసిజాన్ని అంతర్గతంగా జీర్ణించుకున్న వాళ్లే అని చెప్పవచ్చు.. సాధారణంగా రచయితలు తాము నమ్ముకున్న సిద్ధాంతానికి అనుగుణంగా సాహిత్య సృజన చేస్తుంటారు కానీ దానికి కొంత భిన్నంగా శ్రీ శ్రీ తనదైన శైలిలో "ప్రగతి" అనే వార పత్రికలో ప్రశ్నలు జవాబుల శీర్షికన పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని మరింత విస్తృతం చేసినట్టు తెలుస్తున్నది. వ్యక్తికి బహువచనం శక్తి అని అల్పాక్షరాలలో అధిక ప్రాధాన్యత ఉన్న వాక్యాలుగా సృజించిన శ్రీశ్రీ అల్పాక్షరాల ద్వారానే తన సాహిత్యానికి పెద్ద పీట వేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా రంగంలో మాటలు పాటల రచయితగా స్థిరపడి ఉద్రేకాన్ని ఉత్తేజాన్ని చైతన్యాన్ని కర్తవ్యాన్ని తెలియజేసే సినిమా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల అలరించిన సందర్భాలు అనేకం .తన రచన వ్యాసంగాన్ని ఏడవఏటా ప్రారంభిస్తే మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ ఏట ప్రచురించబడింది అంటే ఎంత శ్రద్ధ పట్టుదల ఉందొ అర్థం చేసుకోవచ్చు. 18వ ఏట 1928లో "ప్రభావ" కావ్యసంపుటిని సాంప్రదాయ పద్ధతిలో రాసినప్పటికీ గ్రాంథిక శైలి చందస్సును పక్కనపెట్టి వ్యవహారిక భాషలోకి రావడంతో తన సాహిత్య జీవితమే మారిపోయి ఆధునిక విప్లవ కవిత్వానికి యువకర్తగా నిలిచిపోయాడు కూడా. సినిమా రంగంలో చేరినప్పుడు 300 రూపాయలకే నెలసరి ఉద్యోగిగా మద్రాస్ లో అస్థాన రచయితగా పనిచేసి అనుభవాన్ని చతురతను సంపాదించుకొని ఆ పునాది మీద సమాజ మొత్తాన్ని నడిపించిన తీరు ఎందరికో ఆదర్శం. బాధ్యతలను గుర్తింప చేయడం మాత్రమే కాదు నికృష్టమైన జీవితా అనుభవాల నుండి మాత్రమే నిండైనా మూర్తి మొత్తం సాధ్యమవుతుందని చెప్పడానికి కూడా ఆయన ఒక ప్రతీక.
సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కొన్ని వివాదాలు
సహజంగా శ్రీ శ్రీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినాడని ప్రజల కనీస హక్కుల రక్షణకు అవకాశం ఇవ్వలేదని ఒక విమర్శ ఉంది. అదే సందర్భంలో ఈ ధోరణి సమర్థించే వాళ్ళు ప్రాంతాల కతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంతిమంగా సామాజిక పునరుద్ధరణ మహోన్నతమైనదని సమర్థి o చుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతి ముందు నిలబెట్టడం అలాగే ఎన్టీ రామారావు విగ్రహాన్ని హైదరాబాదులో ఇటీవలనే నెలకొల్పడం తెలంగాణ వాదం పై జరుగుతున్న దాడి అని కొందరు అంటూ తెలుగు వారిలో తెలంగాణకు చెందిన మహానుభావులు ఎందరో ఉన్నారు కదా! వారి విగ్రహాలు ఆంధ్రాలో ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు. అందుకే తెలుగు భాషకు సంబంధించి రాజకీయ నాయకులు సాహితీ సామాజిక రంగాల నిపుణుల విగ్రహాలు రెండు రాష్ట్రాలలో ఉంటే తప్పేమీ లేదు కానీ తెలంగాణ వారిని ఆంధ్రప్రదేశ్లో చూడమని అనుకుంటే మన విశాల అవగాహనకు అర్థం లేనట్లే. అహంకారానికి నిదర్శనమే అవుతుంది.
శ్రీ శ్రీ గూర్చి ప్రముఖుల ప్రశంసలు
మహా ప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం -పురిపండ అప్పలస్వామి
-- కృష్ణశాస్త్రి బాధా ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ --- చలం
--తెలుగు కవిత చరిత్రలో తిరుగులేని మలుపు మహాప్రస్థానం - డాక్టర్ పాపినేని శివశంకర్
--కనీసం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి ఇంత కవితాత్మకంగా వర్ణించి ఇంత అద్భుత సృష్టి చేసిన మరోకవి లేనే లేడు ఇదే అతన్ని సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. -- బూదరాజు రాధాకృష్ణ
--శ్రీ శ్రీ పుట్టుకతో మనిషి వృద్ధాప్యంలో మహర్షి మధ్యలో మాత్రమే కవి ఎప్పటికీ ప్రవక్త-- వేటూరి
శ్రీ శ్రీ వ్యక్తిత్వం సాహిత్యం మానవత్వం సామాజిక అవగాహన మార్క్సిస్టు దృక్పథం గురించి మనం తెలుసుకున్నది రేఖా మాత్రమే. కానీ మనలో భావావేశం ఆలోచన ఉద్రేకం సామాజిక పరివర్తనకై తపన సామాజిక బాధ్యత నిర్వహించాలని ఆరాటం కొట్ట వచ్చినట్లు కనపడుతుంది కదా! ఇదే లక్షణాలు గొప్ప వాళ్లకు0టాయి. నిరంతరం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు కనుక మనం కూడా ఆ వరుసలో నిలబడదాం. ఎప్పుడో ఒకసారి గమ్యాన్ని చేరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)