వడ్డేపల్లి మండలంలో విద్యాశాఖ అధికారుల దాడులు ప్రజలకు పలు సూచనలు
రవీంద్ర ఎయిడెడ్ పాఠశాల గుర్తింపు రద్దు.
ప్రభుత్వ పాఠశాలలో చేరాలని సూచన.
శ్రీ విజ్ఞాన్ కాన్సెప్ట్ పాఠశాల భూవివాదంపై కలకలం : ఫీజులు చెల్లించవద్దని హెచ్చరిక.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ముమ్మర చర్యలు చేపట్టారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కలిపి మొత్తం 13,580 పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయని మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాలను ఒక కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), 22 ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు ఇప్పటికే పూర్తిగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు 23 పాఠశాలలకు నోటు పుస్తకాలు చేరాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 20 పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందాయని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను, ఈ నెల జూన్ 12వ తేదీన 23 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు మరియు 66 మంది మధ్యాహ్న భోజన వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఇదే క్రమంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన పాఠశాలలపై విద్యాశాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-2026) గాను వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని రవీంద్ర ఎయిడెడ్ పాఠశాలకు గల ప్రభుత్వ గుర్తింపు పూర్తిగా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 23వ తేదీన సదరు పాఠశాలకు సంబంధించిన అన్ని రకాల రికార్డులు, రిజిస్టర్లను శాంతినగర్‌లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్‌ఎస్) కు అప్పగించడం జరిగింది. కావున, గత విద్యా సంవత్సరంలో రవీంద్ర పాఠశాలలో చదివిన విద్యార్థులు తమ బదిలీ ధృవీకరణ పత్రాలు (టీసీ) మరియు బోనఫైడ్ సర్టిఫికేట్ల కొరకు శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు. అలాగే కొత్త విద్యా సంవత్సరం (2026-2027) కు గాను రవీంద్ర పాఠశాలలో ఎలాంటి అడ్మిషన్లు (ప్రవేశాలు) పొందవద్దని, విద్యార్థులు తమ భవిష్యత్తును నష్టపోకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే చేరాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలోని శ్రీ విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాల స్థల వివాదం మరియు తప్పుడు సమాచారంతో గుర్తింపు పొందిన ఉదంతం మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పాఠశాల యాజమాన్యం, ఒక సర్వే నంబర్ పరిధిలో పాఠశాల నడుపుతూ, ప్రభుత్వ అనుమతుల పునరుద్ధరణ (రెన్యూవల్) కోసం ఆన్‌లైన్‌లో తప్పుడు సర్వే నంబర్ పత్రాలను సమర్పించినట్లు తనిఖీల్లో తేలింది. అద్దె ఒప్పంద పత్రాల బదిలీ (లీజ్ డీడ్) లోనూ, రేకుల షెడ్డు నిర్మాణంలోనూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సదరు పాఠశాల కరెస్పాండెంట్‌కు నోటీసులు జారీ చేస్తూ నాలుగు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ విజ్ఞాన్ పాఠశాల స్థల వివాదం మరియు గుర్తింపు వ్యవహారం పూర్తిగా జిల్లా విద్యాశాఖాధికారి పరిశీలనలో ఉందని మండల విద్యాశాఖాధికారి తెలిపారు. అందువల్ల ఈ పాఠశాలలో చదువుతున్న పాత విద్యార్థుల తల్లిదండ్రులు గానీ, కొత్తగా ప్రవేశాలు పొందాలనుకునే వారు గానీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారుల నుండి తుది ఆదేశాలు వచ్చే వరకు సదరు ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి ఫీజులు చెల్లించకుండా వేచి ఉండాలని, తప్పుడు వివరాలతో నడిచే పాఠశాలలను నమ్మి మోసపోవద్దని వడ్డేపల్లి మండల విద్యాశాఖాధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.