మోడల్ స్కూల్ విద్యార్థులకు జిల్లా ద్వితీయ స్థానం
తిరుమలగిరి 2 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
యౌవనదశ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మరియు జీవన నైపుణ్యాలు అనే ముఖ్యమైన అంశంపై నిర్వహించిన జిల్లా స్థాయి పోస్టర్ మేళా పోటీలలో టీజీ మోడల్ స్కూల్, అనంతారం విద్యార్థి జె. భర్గవ్ (9వ తరగతి) ప్రతిభ కనబరచి ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు కీర్తి తెచ్చిపెట్టాడు. సమాజంలో అవగాహన పెంపొందించడానికి అవసరమైన సందేశాలను సృజనాత్మకంగా, ఆకర్షణీయంగా తన పోస్టర్ ద్వారా వ్యక్తపరిచిన భర్గవ్‌ను న్యాయనిర్ణేతలు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా. సంజీవ్ కుమార్ విద్యార్థి ప్రతిభను ప్రశంసిస్తూ, "యువతలో ఆరోగ్య అవగాహన మరియు జీవన నైపుణ్యాలపై స్పష్టమైన అవగాహన ఉండటం అత్యంత అవసరం. భర్గవ్ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు. బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయులు జమీలా బేగం , బి.మోహన్ మరియు N.రాజు విద్యార్థిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు భర్గవ్ సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అందరూ అభిప్రాయపడ్డారు.