మాస్ క్లాస్ కలగలిపి డోస్ పెంచిన జిల్లా బాస్
ప్రజా పాలన విజయవంతంతో జిల్లా ప్రజల్లో జోష్...!!!
పోతే తిరిగి రానిది...!
ఎవరూ తీసుకురాలేనిది..!
వెలకట్టలేని విలువైనది.!
అదే ప్రతి జీవిని బ్రతికించే ప్రాణం...!
అందుకే భద్రత, రక్షణతో సురక్షిత గమ్యం...!
ప్రయాణం కారాదు ప్రమాదం...!!!
సురక్షిత గమ్యంతో
ప్రతి కుటుంబంలో ప్రమోదం...!
పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
✍️ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి అన్ని రకాలుగా పటిష్ట చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా ప్రజలకు సురక్షితంగా గమ్యం చేరుకునే విధానాలను, భద్రత రక్షణ తో ప్రమాద రహితంగా ప్రయాణం చేసే విధానాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఎంతటి ధనవంతుడైనా వెలకట్టలేని, విలువైన ప్రాణాలను డబ్బుతో కొనలేరని, విలువైన ప్రాణాలను అజాగ్రత్తతో ప్రయాణించి, నిబంధనలను పాటించకుండా ప్రమాదాలకు గురై తమ తమ కుటుంబాలను అనాధలుగా మిగల్చ వద్దని ప్రతివారికి కూలంకషంగా తెలియజేసే విధంగా కార్యక్రమాలు విస్తృతంగా చేసి, విరివిగా ప్రచారంతో ప్రజల్లోకి చేరవేయడంలో జిల్లా కలెక్టర్ తేజస్ తీసుకున్న చొరవ, చేసిన కృషి అభినందించదగ్గది. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో సంయుక్తంగా చేపట్టిన పలు కార్యక్రమాలు సూర్యాపేట జిల్లాలో విజయవంతంగా ముగిశాయి.
ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు
మొదటిరోజు ఏప్రిల్ 13న సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ మండలాల్లో హెల్మెట్లు, సీటు బెల్టులు, వాహన పత్రాలపై అవగాహన కార్యక్రమాలు, 14,15వ తేదీలలో చివ్వెంల, తుంగతుర్తి, నూతనకల్, హుజూర్నగర్ మండలాల్లో పీఎం రహత్, రహవీర్ పథకాల గురించి, పిల్లలను తీసుకుని పోయే ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 16వ తేదీన కోదాడ, సూర్యాపేట, పెన్ పహాడ్, తిరుమలగిరి, నేరేడుచర్ల లలో ప్రయాణికుల ఓవర్ లోడ్, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 17వ తేదీన సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో ఆర్ అండ్ బి, నేషనల్ హైవే విభాగాల సమన్వయంతో (బ్లాక్ స్పాట్స్ )ప్రమాద ప్రాంతాలను తనిఖీ చేశారు. 18వ తేదీన పోలీస్, ఆరోగ్య శాఖ సమన్వయంతో హైవేపై ఉన్న దాబాల వద్ద, మఠంపల్లిలోని పరిశ్రమల వద్ద భారీ వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు.
వాహనాలపై అవగాహన కార్యక్రమం
డ్రైవింగ్ లైసెన్స్ సేవల విభాగంలో ప్రతివారు కూడా తప్పకుండా సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ సేవలు పొందడం, లెర్నర్ లైసెన్స్, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, గడువు ముగిసిన లైసెన్సుల రెన్యువల్, డూప్లికేట్ చిరునామా మార్పు కొత్త డ్రైవింగ్ స్కూల్ లకు అనుమతులు లైసెన్స్ నిర్మాణం విషయంలో అవగాహన కల్పించారు. వాహన రిజిస్ట్రేషన్ సేవల విభాగంలో అంతేకాకుండా కొత్త రిజిస్ట్రేషన్ కోసం కొత్త గా కొన్నబివాహనాల నమోదు, వాహనాన్ని కొన్నా, అమ్మినా యజమాని మార్పు, వాహనంపై ఉన్న బ్యాంకు లోన్ వివరాల నమోదు, తొలగింపు హైపోతికేషన్, ఆటోలు, గూడ్స్, ప్యాసింజర్ వాహనాలకు స్టేట్, నేషనల్ పర్మిట్లు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. వాహన ధ్రువీకరణ భద్రత విభాగంలో రవాణా వాహనాల కండిషన్ను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయుట, పొల్యూషన్స్ టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతుల ద్వారా కాలుష్య నియంత్రణ, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ బిగింపు విషయాలపై అవగాహన కల్పించారు. పన్నులు ఇతర సేవలు విభాగంలో రోడ్ టాక్స్ విషయంలో త్రైమాసిక పన్ను, లైఫ్ టాక్స్, ఆన్లైన్ పోర్టల్ ద్వారా అన్ని సేవలను పారదర్శకంగా సారధి వాహన్ పోర్టల్ ద్వారా ఎలా పొందవచ్చు అనే విషయంలో అవగాహన కల్పించారు.
హెల్మెట్లు, సీటు బెల్టులు, వాహన పత్రాలపై అవగాహన
హెల్మెట్లు, సీటు బెల్టులు, వాహన పత్రాలపై అవగాహన కార్యక్రమంలో హెల్మెట్ లేకపోవడం సెక్షన్ 129,1940 కింద మొదటిసారి జరిమానాగా 1000 రూపాయలు, తదుపరి జరిమానాగా మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఉంటుందని అవగాహన కల్పించారు. సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల సెక్షన్ 1948 ప్రకారం మొదటిసారి వేయి రూపాయల జరిమానా విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 181 ప్రకారం మొదటిసారి ఐదువేల రూపాయలు జరిమానా, రెండోసారి కూడా 5000 రూపాయలు జరిమాన ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి) లేకపోవడం వల్ల సెక్షన్ 192 ప్రకారం మొదటిసారి 2000 నుంచి 5000 రూపాయల వరకు జరిమానా, రెండోసారి అయితే పదివేల రూపాయల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని అవగాహన కల్పించారు. వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోవడం సెక్షన్ 196 ప్రకారం మొదటిసారి 2000 రూపాయల జరిమానా, రెండోసారి 4000 రూపాయల జరిమానా ఉంటుందని అవగాహన కల్పించారు. కాలుష్య నియంత్రణ పత్రం లేకపోవడం సెక్షన్ 190 (2) ప్రకారం మొదటిసారి వేయి రూపాయలు, రెండోసారి వేయి రూపాయలు జరిమానా ఉంటుందని వివరించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం సెక్షన్ 192 ప్రకారం మొదటిసారి రెండు నుంచి ఐదువేల రూపాయల జరిమానా, రెండోసారి పదివేల రూపాయల జరిమానా ఉంటుందని అవగాహన కల్పించారు.
పీఎం రహత్ (RAHAT)
పీఎం రహత్ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను (గోల్డెన్ అవర్) ప్రమాదం జరిగిన మొదటి గంట లోపు ఆసుపత్రి చేర్చి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తక్షణమే నగదురహిత (క్యాష్ లెస్) చికిత్స అందించడం ద్వారా ప్రాణా నష్టాన్ని తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. నగదు రహిత చికిత్స కింద ప్రతి బాధితునికి 1,50,000 వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించబడుతుంది. ప్రమాదం జరిగిన రోజు నుండి ఏడు రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స కాలపరిమితి కలిగి ఉంటుంది. జాతీయ, రాష్ట్ర, స్థానిక, రహదారులు వేటిపైనైనా ప్రమాదం జరిగినా బాధితులందరూ ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. స్థిరీకరణ చికిత్స విభాగంలో ప్రాణాపాయం లేని సందర్భాల్లో 24 గంటల వరకు చికిత్స అందిస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు 48 గంటల వరకు చికిత్స అందించనున్నారు. ఎక్కడైనా గాని ప్రమాదం జరిగిన వెంటనే 112 హెల్ప్ లైన్ నెంబర్ కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలు, అంబులెన్స్ సహాయం పొందవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు
రాహ్ వీర్ పథకం
రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులకు భయపడకుండా ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కాపాడేలా సామాన్యులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకు సంబంధించి కాపాడిన ప్రతి వ్యక్తికి ప్రతి సంఘటనకు 25 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఉత్తమంగా నిలిచిన పదిమంది రాహ్ వీర్ లకు లక్ష రూపాయల నగదు, ట్రోపి, ప్రశంస పత్రం అందజేస్తారు. ఇలా ప్రమాదం బారిన పడిన వారిని గరిష్టంగా ఒక వ్యక్తి ఏడాదికి ఐదుసార్లు ఈ బహుమతిని పొందవచ్చు. ఇందుకు గాను తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైన బాధితున్ని ఆసుపత్రికి ట్రామా సెంటర్ కు తరలించే ఎవరైనా ఈ పథకానికి అర్హులు. మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 134 A ప్రకారం సహాయం చేసిన వారికి పూర్తి రక్షణ ఉంటుంది. బాధితులను కాపాడిన వారి పేరు వెల్లడించకుండా ఉండే సదుపాయమే కాకుండా సాక్షిగా ఉండాలని పోలీసుల నుండి ఎటువంటి ఒత్తిడి ఉండదు. పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం నుంచి బాధితులను కాపాడిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవని, జిల్లా కమిటీ ఆమోదం తెలిపిన ఒక నెలలోపు PFMS ద్వారా నేరుగా లబ్ధిదారును బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయబడుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.
పాఠశాల వాహనాల తనిఖీలు
రవాణా శాఖ ఆధ్వర్యంలో పాఠశాల బస్సులు, విద్యార్థులను తీసుకెళ్లి వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి పాఠశాల విద్యార్థుల భద్రతను నిర్ధారించడమే కాకుండా నిబంధన పాటించని విద్యాసంస్థల వాహనాలపై చర్యలు తీసుకోవడం, స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు, పాఠశాల పిల్లలను తీసుకెళ్లే ఆటోలు, వ్యాన్లను తనిఖీ చేయడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉందా, లేదా, పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తున్నారా, డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్సు చెల్లుబాటు అయ్యే విధంగా ఉందా, లేదా, బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు లాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా, వాహనానికి స్పీడ్ గవర్నర్ అమర్చబడి వేగ నియంత్రణ చేయబడిందా లేదా అన్న విషయాలను పరిశీలించి పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అలాగే రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిర్ణీత సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్లడం శిక్షార్హం అంటూ ఓవర్ లోడ్ వలన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ప్రజలకు, డ్రైవర్లకు. అవగాహన కల్పించారు. సరుకు రవాణా వాహనాలు అదనపు బరువు వేయడం చట్ట విరుద్ధం అని తెలియ చెపుతూ, అదనపు బరువు వలన రోడ్లు దెబ్బతినమే కాకుండా వాహన టైర్లు పేలిపోవడం, బ్రేకులు ఫెయిల్ అయ్యే అవకాశం తో ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. అలాగే సరుకు రవాణా వాహనాలు లారీలు, ట్రక్కులలో ప్రయాణికులను తరలించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్టు ప్రజలకు అవగాహన కల్పించారు. అంతే కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే అదనపు బరువుకు అదనంగా ఉన్న ప్రతి టన్నుకు భారీగా జరిమానా విధించడం, ప్రయాణికుల ఓవర్ లోడ్ కు ప్రతి అదనపు ప్రయాణికుడి పై జరిమానా విధించి డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడం ఉంటుందని అవగాహన కల్పించారు.
రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్ విభాగం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్ అండ్ బి ల ఆధ్వర్యంలో సంయుక్త చర్యలు
జాతీయ రహదారులు NH-65,NH-3658 లలో ఉన్న ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ను తెలంగాణ రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్ విభాగం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్ అండ్ బి అన్ని శాఖలు కలిపి సంయుక్తంగా తనిఖీ చేయడం కాకుండా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టడం, తనిఖీల్లో గుర్తించిన లోపాలు ఆధారంగా సంబంధిత విభాగాలు తమ తమ పరిధిలోని మరమ్మతులు, భద్రత ఏర్పాట్లు వేగవంతం చేయడం, ఇలాంటి విషయాలలో ప్రజలకు, ఆయా శాఖల అధికారులకు అవగాహన కల్పించారు.
భద్రత రక్షణ చర్యలు పాటించండి...సురక్షితంగా ఇంటికి చేరండి
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మార్గదర్శకత్వంలో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, రవాణా శాఖ అధికారి జయప్రకాష్ రెడ్డి, ఆదిత్య తదితరుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు, ప్రయాణికుల సురక్షిత గమ్యం చేరే విషయాలు అన్నీ కూడా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించడంతో జిల్లా ప్రజలు సంబంధిత జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ, రవాణా శాఖ అధికారులే కాకుండా ఆర్ అండ్ బి అధికారులు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులకు, ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలలో రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల చైతన్యవంతులను చేసిన అందరి అధికారులు, సిబ్బంది కి సూర్యాపేట జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.