మానవ శ్రమను లాభాల కింద కొలుస్తున్నంత కాలం మే డే కొనసాగుతుంది .సీఐటీయు
జోగులాంబ గద్వాల 1 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. మానవ శ్రమను చులకనగా చూస్తున్నంత కాలం మానవ శ్రమను లాభాల కింద కొలుస్తున్నంత కాలం మే డే ఎప్పటికి ముగిసిన రోజు కాదని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహా అన్నారు . శుక్రవారం 140వ మేడే దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సీఐటీయు అనుబంధ సంఘాల (బజారు హమాలీ, మున్సిపల్, భవనం,దాన ఫ్యాక్టరీ, ప్రయివేట్ విద్యుత్) కార్మికులు ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ శ్రమను చులకనగా చేసి, లాభాల కింద కొలుస్తున్నంత కాలం మే డే ఎప్పటికీ ముగియదని అన్నారు.భారత కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం, సమ్మె హక్కు, కార్మికుల అవసరాలకు అనుగుణంగా జీతభత్యాలు,సంక్షేమ పథకాలు లాంటివి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సంపదను సృష్టిస్తున్న కార్మిక వర్గాన్ని అవహేళన చేస్తూ దేశంలోని బడా పెట్టుబడిదారులు అవలంబిస్తున్న విధానాల వల్ల ఒకవైపు సంపద కేంద్రీకరించబడి శతకోటీశ్వరులు బలిసిపోతుంటే,ప్రజలు పేదరికం నుండి కడు పేదరికంలోకి నెట్టి వేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద కార్మిక శ్రమను దోచుకోవడానికి ఏ ఆటంకాలు లేకుండా ఉండడానికి లేకుండా నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ILO తీర్మానాన్ని తుంగలో తొక్కి ఫ్యాక్టరీల చట్టం 1948 తీసేసి వృత్తిపర భద్రత ఆరోగ్యం వర్కింగ్ కండిషన్ కోడ్ 2025 ద్వారా, కార్మికులను 12 గంటల వరకు పని చేయించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్,నోయిడా ప్రాంతాలలోని కార్మికులు ఎనిమిది గంటలకు పని దినం,పిఎఫ్,ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అమలు కోసం పోరాటాలు చేస్తుంటే కార్మిక వర్గాన్ని నిరంకుశత్వంతో అణిచి వేస్తున్నారని విమర్శించారు. 140 వ మే డేను నాలుగు లేబర్ కోడ్ లు రద్దయ్యేంతవరకు పోరాట దీక్ష దినంగా కార్మిక వర్గం పాటించి కార్మిక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.నిర్బంధ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా హక్కుల సాధన కోసం కార్మికులు ప్రతిఘటన ఉద్యమాలను 140 వ మే డే స్ఫూర్తితో కొనసాగించాలని కోరారు.మున్సిపల్ కార్యాలయం ముందు పట్టణ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి , హమాలీల దగ్గర పద్మ,సువార్త,దాన ఫ్యాక్టరీ వద్ద ఉప్పేర్ నరసింహ సీఐటీయు జెండాను ఎగురావేశారు.అనంతరం పట్టణంలో సీఐటీయు ఆధ్వర్యంలో డ్రమ్స్ తో, బాణా సంచాలు పేలుస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బజారు హమాలి సంఘం తిరుపతన్న లక్ష్మన్న, రఘు, బాలకృష్ణ,ఆశా కార్యకర్తలు, జిల్లా అధ్యక్షు కార్యదర్శులు పద్మ,సునీత voa సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాం అంజి, మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఘట్టన్న, ఉపాధ్యక్షులు మహేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు పరమేష్, దాన ఫ్యాక్టరీ అధ్యక్షులు కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.