మహిళల రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఓటేసిన పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి
చీకూరి లీలావతి
హైదరాబాద్, 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– రాష్ట్రంలో మహిళా హక్కులపై పోరాటం చేస్తున్న స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి (chikuri Leelavathi) మహిళల రిజర్వేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన పార్టీలకు మహిళలు తమ ఓటు హక్కుతోనే తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఆమె విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill) పార్లమెంటులో వీగిపోయిన సందర్భంలో విపక్ష పార్టీల నాయకులు చప్పట్లు కొడుతూ ఆనందం వ్యక్తం చేయడం వారి అసలు వైఖరిని బయటపెట్టిందని విమర్శించారు. మహిళలకు దేశంలో సగభాగం స్థానం ఉందని చెప్పే నాయకులు కనీసం 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికే తీవ్రంగా వ్యతిరేకించడం విచారకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలందరూ ఒక్కటిగా నిలబడి, తమ ఓటు ద్వారానే తగిన సమాధానం ఇవ్వాలని ఆమె సూచించారు. మహిళా హక్కులను నిర్లక్ష్యం చేసిన పార్టీలపై నిరసనగా ఈరోజును “బ్లాక్ డే”గా పాటించాలని కూడా పిలుపునిచ్చారు.