న్యూ ఇయర్  సందర్భంగా అత్యుత్సాహ  ప్రకటనలు. తెల్లవారితే  మద్యం అమ్మకాల్లో  మరో రికార్డ్ అంటూ  ప్రత్యేక కథనాలు రావచ్చు. 

Jan 3, 2025 - 14:45
Jan 3, 2025 - 16:00
 0  2

న్యూ ఇయర్  సందర్భంగా అత్యుత్సాహ  ప్రకటనలు. తెల్లవారితే  మద్యం అమ్మకాల్లో  మరో రికార్డ్ అంటూ  ప్రత్యేక కథనాలు రావచ్చు.  ఇప్పటికే  మద్యం షాపులకు  కమిషన్  10 నుండి 14% పెంచిన  ఏపీ సీఎం. వందలు వేల టికెట్ తో  పబ్బులు ఈవెంట్ల  నిర్వహణ.రాత్రి 1 గంటదాకా అనుమతి  సబబేనా?

వడ్డేపల్లి మల్లేశం 
31..12..2024
  మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశం  క్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు  పరుగులెడుతుంటే  15% కూడా ప్రభుత్వ రంగం లేని  దుస్థితికి  చేరుకుంటున్న తరుణంలో  అన్ని రంగాలు కూడా  లాభాపేక్షతో  వ్యాపార ధోరణితో  వ్యవహరిస్తుంటే  ప్రభుత్వం సంపదను ఏ రకంగా  సృష్టిస్తుంది ప్రజలకు పంచుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకం? .ప్రతి సంవత్సరం నూతన సంవత్సర సందర్భంగా  ప్రభుత్వాలు పోలీసు విభాగాలు చేసే ప్రకటనలు చూస్తే అబ్బుర పడక తప్పదు.  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, రెస్టారెంట్లను  రాత్రి ఒంటిగంట వరకు  ప్రభుత్వాలు పోలీసులు  చివరికి న్యాయవ్యవస్థ కూడా అనుమతిస్తున్న తరుణంలో  ఆ ముసుగులో జరుగుతున్న నేరాలు ఘోరాలు దారుణాలకు అంతే లేదు.  బహుశా అందరి ఉద్దేశం కూడా ఒకటే  ప్రైవేటు వ్యవస్థను పెంచి పోషించడం, మద్యం దుకాణాలకు గిరాకిని పెంచడం,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లను   ప్రజల దాహార్తిని తీర్చే రకంగా తీర్చిదిద్ది ప్రజల మూలుగలను  పీల్చడమే.. నూతన సంవత్సర సందర్భంగా   సమూహాల మధ్యన కొనసాగాల్సిన చర్చలు సంభాషణలు  పూర్తిగా వాణిజ్య ధోరణికి పరిణామం చెందిన నేపథ్యంలో  ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్న  కారణంగా  పేదవాళ్లు కూడా కనీసం వెయ్యి రూపాయలు పెట్టి ఈవెంట్లను  చూడవలసిన రావడం అత్యంత విచారకరం.  సాధారణ ప్రజల యొక్క  హావ భావాలకు స్వేచ్ఛ స్వాతంత్రాలకు అభిప్రాయాలకు ఎలాంటి ప్రమేయం లేని  అటువంటి చోట్ల  నిర్వహించే కార్యక్రమాలు ఏమైనా ప్రజలకు  జన జీవితానికి  సంబంధించినవా అంటే అది కూడా లేదు.  మద్యాన్ని ప్రోత్సహించడం,  వెకిలి  చేష్టలు,  ఆకృత్యాలు, కార్యక్రమాల మాటున  కొన్ని అరాచకాలు అత్యాచారాలకు కూడా  దారితీస్తున్న నేపథ్యంలో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?. "ప్రభుత్వానికి కావలసింది పన్నులు, కమిషన్లు, లాభాలు,  చివరికి  పరిపాలనను నడపడానికి కావలసిన నిధులు.  ఇలాంటి పరిస్థితుల్లో  ప్రజా సంక్షేమం అభివృద్ధి సామాజిక బాధ్యత పాలకులు గాలికి వదిలినట్టే కదా!"
 పాలకులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం  మంచిది కాదు :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీని నిర్ణయించడానికి అక్కడి కమిటీ సభ్యులను దేశవ్యాప్తంగా పర్యటింపజేసి కొన్ని ఆలోచనలు చేసినట్లు తెలుస్తూ ఉంటే  ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం వైపు ఎలాంటి ఆలోచన లేకుండా పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో లాభాపేక్షతో ప్రభుత్వాలు నడపడానికి  ఆదాయం ఎలా అనే మార్గంలోనే  ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచించడం విడ్డూరం. జనవరి ఒకటవ తేదీని పురస్కరించుకొని కొత్త సంవత్సర సందర్భంగా  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు  మద్యం షాపు యజమానులకు ఇవ్వనున్నటువంటి కమిషన్ను 10 నుండి  14 శాతానికి పెంచడమoటే   మద్యాన్ని మరింత ఏరులై పారేలా చేయాలని ప్రోత్సహించడం కాక మరేమిటి?   షాపుల సంఖ్యను బెల్టు షాపులను  మరింత ఎక్కువగా అనుమతించడంపాటు  కమిషన్లను ఎక్కువ ఇస్తే అమ్మకాలు బాగా జరుగుతాయి తద్వారా ప్రభుత్వానికి లాభాలు వస్తాయి ఆ లాభాలతోనే ప్రభుత్వాన్ని నడపాలనే  వింత కోరిక  బాధ్యతలేని ఆలోచన  ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఇక మద్యం ఇతర క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు  నూతన సంవత్సర సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా అనునిత్యం సంవత్సరాంతం కూడా ఏదో ఒక మూలన అకృత్యాలు అనర్థాలు, అరాచకాలు నిరంతరం కొనసాగుతూ ఉంటే  వాటి ప్రభావం వలన చిన్న పిల్లలు బాలికలు కూడా  లైంగిక దాడులకు బలైన సందర్భాలను మనము గమనించి ఉన్నాం.  పాఠశాలల్లో  బాలికలు అఘాయిత్యాలకు బలి కావడం  పాఠశాలలో సిబ్బంది డ్రైవర్లు అటెండర్లు కూడా  ఇలాంటి దురాగతాలకు పాల్పడిన సందర్భాలు అనేకం. ఇన్ని రకాల అపశృతులు దొరలడానికి కారణాలు  ఈవెంట్లు క్లబ్బులు పబ్బులు, రెస్టారెంట్లు  మద్యం మత్తు పదార్థాలు  అంతేకాదు అశ్లీల ప్రదర్శనలు ప్రధాన కారణమని పోలీసులకు,  న్యాయవాదులకు, మానసికవేత్తలకు, న్యాయాన్నిపుణులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి,  సామాజికవేత్తలకు తెలుసు. కానీ అందరూ కూడా మౌనంగా ఉన్నారంటే కారణం ఏమిటి? ఒక గంటలో కార్యక్రమం పూర్తయ్యేలా ప్రారంభించి 12 గంటలకు ముగించవలసినది పోయి ఒంటిగంట వరకు నడుపుకోవడానికి పోలీసులు అనుమతించడం దానికి న్యాయం శాఖ  సై అనడం  వింటూనే ఉన్నాము. మరొకవైపు  రాత్రి 8 నుండి ఉదయం 9 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు  పత్రికల్లో టీవీలో ప్రకటనలు వస్తూనే ఉంటాయి  ఈ ప్రకటనల అర్థం ఏమిటో మనకు అర్థం కానే కాదు. ఇక జనవరి ఒకటి 2026 అంటే కొత్త సంవత్సరము తొలి రోజున  టీవీ వార్తల్లో   వార్త పత్రికల్లో  కొత్త సంవత్సర సందర్భంగా రాత్రిపూట జరిగినటువంటి మద్యం తాగుడు, అమ్మకాలు  గత సంవత్సరాల కంటే రికార్డు బద్దలు కొట్టినట్లు  మునుపెన్నడూ ఇంత అమ్మకాలు జరగనట్లు  ఇది ప్రభుత్వ విజయమన్నట్లు  సంకలు చ రిస్తే  ప్రజలు ఏ రకంగా లాభపడ్డారో  ప్రభుత్వం చెప్పగలదా? గతప్రభుత్వం కల్తీమధ్యం అమ్మితే తాము నాన్యమైన మద్యం సరఫరా చేస్తామని Ap ప్రభుత్వమంటే తెలంగాలో బెల్ట్షాప్లను రద్దు చేస్తామానిచెప్పినా అమలులో లేదు. పైగాధానివల్ల జరిగే ఆరాచకాలు పాలకుల కళ్ళకు కనిపించడంలేదా అనేది పెద్దప్రశ్న.    ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఇస్తున్న ఉచితాలు తాయిలాలు  ప్రలోభాలు  రైతు బంధు రైతు భరోసా ఉచిత  పథకాలు  రుణమాఫీ కి సంబంధించి  విడుదల చేస్తున్న నిధులు   ఉచితంగానే వస్తున్నాయి కదా అనే భ్రమలో ప్రజలు  డబ్బును  మద్యం షాపుల్లో రెస్టారెంట్లలో బార్లలో కుమ్మరిస్తూ  ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారు. సామాన్య ప్రజానీకానికి చెందినటువంటి ప్రజా సంపద ఈ రకంగా కొద్దిమందికి  దారా దత్తం చేయడం సబబు కాదు. అంతే కాదు నిర్వహిస్తున్నటువంటి కొన్ని ఈవెంట్లు సభలు సమావేశాలు  వెలుగుల  దివ్వెల  మధ్యన  మహిళా నటులు గాయకులు  కళాకారులు  ప్రజలను ఆలోచింపజేసే విధంగా నూతన సంవత్సరం యొక్క ప్రాధాన్యతను గుర్తింప చేయడం, భవిష్యత్తు సవాలను అధిగమించడానికి సంసిద్ధులను తయారు చేసే విధంగా పాటలు పాడాలి కానీ తమ అంగంగా ప్రదర్శనతో  అశ్లీల మైనటువంటి వ్యాఖ్యానము పాటలతో  దురాలోచన కలిగించే విధంగా ప్రోత్సహించడం వాటిని ప్రభుత్వాలు చూస్తూ గుడ్డిగా సమర్థించడం  మౌనంగా తలవంచుకొని ఆదాయం కోసం ఆశించడం  ఇవన్నీ కూడా ప్రభుత్వపరంగా జరుగుతున్న మూర్ఖపు ఆలోచనలు.ఆలోచింప చేయాలి, ఆచరణకు పురికొలపాలి, పౌర హక్కులను గుర్తింప చేయాలి,  బాధ్యతలను మరచిపోకుండా నిర్వహించేలా ప్రోత్సహించాలి,  వృత్తి ధర్మం పట్ల చిత్తశుద్ధి,  ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే విధంగా సూచనలు,  మాటలు పాటలు ఆ టలతో మనిషిలో ఉత్సాహాన్ని ఆనందాన్ని పెంపొందించడం, అశ్లీలతకు తావు లేనటువంటి ప్రదర్శనలను కొనసాగించడం,  చైతన్యాన్ని  నాగరికతను కాపాడుతూనే  అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ కోసం సమ సమాజ స్థాపన కోసం  సూచనలు కొనసాగే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలి. కానీ  పేద ధనిక కొట్టవచ్చినట్లు కనపడే విధంగా వందలు వేల రూపాయల టికెట్తో కొందరు కొని ఆస్వాదిస్తుంటే మరికొందరు పది రూపాయల టిక్కెట్టు కూడా కొనలేక  కనీసమైన తినుబండారం  కూడా తినలేని పరిస్థితిలో  బిక్కుబిక్కుమనుకుంటూ గడపడం ఇదేనా ప్రజాస్వామిక  న్యాయ సూత్రం?  అందుకే గ్రామాల వారీగా, పట్టణ  వార్డుల వారీగా,  వీధివారీగా,  కామన్ సమావేశాలను  కొత్త సంవత్సర సందర్భంగా  ఏర్పాటు చేయడానికి సంబంధించి  స్థానిక సంస్థలు పూనుకోవడం ద్వారా    అందరినీ సమానంగా గౌరవించి  నిబంధనలను అతిక్రమించకుండా ఆకృత్యాలకు ఆస్కారం లేకుండా ఉల్లాసవంతమైనటువంటి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది.కానీ అమ్మకాలు కొనుగోళ్ల   మధ్యలో మత్తు పానీయాలు,  స్త్రీ పురుషుల మధ్యన అశ్లీల బాగోతాలు  తదనంతరం  వికృత పరిణామాలకు  దారితీయకుండాఉండగలిగే ఫెయిర్ వాతావరణానికి  నూతన సంవత్సర వేడుకలు కొలమానాలుగా జరగాల్సిన అవసరం ఉంది.  ప్రతి విషయంలోనూ ప్రభుత్వం యొక్క చొరవ, పట్టుదల,ఆదేశాలు, బాధ్యత  ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ఎవరెక్కడ పోతే నాకేమిటి కావలసింది ఆదాయం. ఆదాయం వస్తేనే పెన్షన్లు ఇస్తాం, జీతాలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం అని  ఎదురు చూసే ధోరణిలో సాగిలబడి ప్రభుత్వాలు ఉన్నంతకాలం  సమాజంలో అనేక రుగ్మతలు కొనసాగుతూనే ఉంటాయి ఆకృత్యాలకు హద్దు అదుపు ఉండదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అవసరం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333