న్యాయ వ్యవస్థను బలోపేతం చేసుకుంటే  పేద సాధలకు గొడుగులా పని చేస్తుంది. లేకుంటే అక్రమార్కులకే  ప్రయోజనం.

 ప్రజా ఉద్యమాలు,పోరాటాల ద్వారా ఈ లక్ష్యం సాధ్యం కాదంటారా?  నిబద్ధత కలిగినో ళ్లు కూడా న్యాయ వ్యవస్థలో కోకొల్లలు. మేధావులు ఆలోచించాలి.

Mar 19, 2026 - 06:38
 0  0

ప్రజలు కేంద్రంగా అనేక ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నప్పటికీ  ముఖ్యంగా న్యాయ వ్యవస్థ  బలోపేతం విషయంలో  సక్సెస్ కాకపోవడాన్ని మనం గమనించవచ్చు. భారతదేశంలో ఈ లోటు స్పష్టంగా కనబడుతుంది.  విశాలాదృష్టితో  మూడు సంవత్సరాలు  ప్రపంచ దేశాలను పర్యటించి రాజ్యాంగాన్ని  విపులంగా రాసుకున్నప్పటికీ   న్యాయము,  చట్టము, సమన్యాయ పాలన, సార్వభౌమాధికారము,  సమానత్వం,  సామ్యవాదము,  లౌకిక తత్వం వంటి అనేకఅంశాలను  ప్రజల పక్షాన  హక్కులుగా రాసుకున్నప్పటికీ   నామ మాత్రం కూడా అమలు కావడం లేదు.  అంతేకాదు భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది అంటే  స్వయం ప్రతిపత్తి గల సంస్థగా న్యాయ వ్యవస్థ  ప్రకటించబడిన విషయం కూడా మనకు తెలుసు. అయినప్పటికీ  ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలు, రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి తగవుల తో పాటు  ప్రజల హక్కులు విధులకు పోరాటాలు ఉద్యమాలకు సంబంధించిన అనేక మౌలిక అంశాలలో  దశాబ్దాల తరబడిగా కేసులు కోర్టులలో నానుతూ ఉంటే  న్యాయం అందని ద్రాక్ష గానే మిగిలిపోతున్నదని సామాన్యులు ఆవేదన చెందుతున్న సందర్భాలు కోకోల్లలు.  అంతేకాదు  నిర్దోషిగా ప్రకటించడానికి దశాబ్దాల కాలం పడుతుంటే  ఈ దశాబ్దాలు కూడా శిక్షలు అనుభవించి  విడుదలైన తర్వాత మృత్యువాత పడినటువంటి  నేరారోపణ  గా వించబడిన వాళ్ల జీవితాలను అర్థం చేసుకుంటే న్యాయం ఎక్కడుంది?  

ఎందుకు విఫలం అవుతున్నది?  ఇవి చిక్కు ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.  నేరస్తులు పొరపాటున తప్పించుకున్న పరవాలేదు కానీ  నిర్దోషులకు  శిక్ష పడకూడదు అని చెప్పబడుతున్నటువంటి భారతీయ న్యాయ సూత్రం  అమలు కావడం లేదు.  అంతేకాదు భారత న్యాయ వ్యవస్థ పైన  ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నదని ఆ కారణంగానే కేసుల విచారణలో కానీ   న్యాయం జరగడంలో కానీ కొంత  కాలయాపన జరుగుతున్నట్టుగా సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . చట్టసభలలో  నేరస్తులు  సభ్యులుగా కొనసాగడం  యదేచ్చగా కొనసాగుతూ ఉంటే,  న్యాయాన్ని అందించవలసినటువంటి  ఆ విభాగంలో పనిచేస్తున్న వాళ్లు  అవినీతిపరులుగా ముద్ర పడుతున్నవారిపై  ఇటీవల వివాదాస్పద మైనటువంటి  వ్యాఖ్యలను మనం విని ఉన్నాం. మరికొన్ని అంశాలలో  దశాబ్దాల తరబడిగా  కళ్ళ ముందు జరిగినటువంటి ఒక అంశం లేదా హత్య  లేదా అత్యాచారం వంటి విషయాలలోపల కూడా  న్యాయస్థానాలు స్పష్టంగా నిర్ధారించలేకపోవడం వెనుక  ఏ శక్తులు దాగి ఉన్నవో కానీ  నిజం బయటపడలేకపోవడం ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం గా పరిణమిస్తున్నది.

 అతి కాలయాపనతో కేసులు తారుమారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు  వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఏడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ  ఆ వైపుగా వారి కూతురు పోరాడుతూ  అనేక వేదికల్లో  ప్రశ్నిస్తున్నప్పటికీ  న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేసి వేసి అలసిపోయి  ఆవేదన పడుతున్నప్పటికీ  ఇప్పటికీ కనీస మైనటువంటి నిర్ణయానికి  రాలేకపోవడం విచారకరం.  సిబిఐ  సిఐడి వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు న్యాయవ్యవస్థ  ఎందుకు తేల్చలేకపోతున్నది ఇందులో జోక్యం చేసుకుంటున్నటువంటి,  కేసును ప్రభావితం చేస్తున్న వారు ఎవరైనా వెనుక ఉన్నారా?  అలాంటి విషయాలను ఎందుకు  కనిపెట్టలేకపోతున్నది ఈ వ్యవస్థ?  ఒక  అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు  సంబంధించి  నేరారూపణను, నేరస్థులను నిర్ధారించలేని పరిస్థితిలో ఇక సామాన్యుల సంగతి ఏమిటి ? ఇలాంటి ఎన్నో కేసులు ఆధారాలున్నాయని భావించినా రుజువు కాకపోవడం విచారకరం. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా ఒక్క సంవత్సరం నుండి 30 సంవత్సరాల పైబడినటువంటి కేసులను పరిశీలించినప్పుడు 5 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని గణాంకాలు తెలియ చేస్తున్నాయి.  ఇందులో ప్రధానంగా  పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజానీకానికి సంబంధించినవి ఉంటే  మరికొన్నింటిలో బడా నేరస్తులవి కూడా  ఉన్న విషయం తెలుసు.  వాస్తవాలను దాచి పెట్టే పరిస్థితి ఒకవైపు కొనసాగుతూ ఉంటే,  అకారణంగా శిక్ష అనుభవించవలసినటువంటి దుస్థితిలో కొన్ని కేసులు కొనసాగడం  మన భారత న్యాయవ్యవస్థకు సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. ఈ పరిస్థితిని  భారత సర్వోన్నత న్యాయస్థానం  పరిశీలించవలసిన అవసరం ఉంది అని సామాన్య ప్రజానీకం కోరుతున్నారు.

 ఆ కేసులు  రాజకీయ అధికార యంత్రాంగానికి సంబంధించినవి కావచ్చు అయినా  నేరం చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అనే మౌలికమైన సామాజిక న్యాయాన్ని ప్రాతిపదికన  న్యాయ వ్యవస్థ పని చేయడంతో పాటు  వేగాన్ని కూడా పెంచడం వలన తొందరగా న్యాయం జరిగే అవకాశం కొంతవరకైనా ఉంటుంది.  ఈ సందర్భంలో ప్రభుత్వపరంగా ఉన్నటువంటి కొన్ని లోపాలను గమనిస్తే  మౌలిక సౌకర్యాలను కల్పించకపోవడం,  న్యాయమూర్తుల సకాలంలో నియమించకపోవడం,  తరచుగా వాయిదాలు వేయడంతో పాటు నిధులు సమకూర్చడం పై   ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే  కేసుల పరిష్కారం మనం ఊహించిన దాని కంటే  వేగంగా జరుగుతాయి.  పరిపాలనలో  పారదర్శకతను సాధించాలన్న,  సంక్షేమ అభివృద్ధి పలాలు సకాలంలో ప్రజలకు అందాలన్నా, ఈ దేశంలో నేరాలు అక్రమాలు దోపిడీలు, దౌర్జన్యాలు అత్యాచారాలు, హత్యల విషయంలో  నేరస్తులపై ఉక్కు పాదం మోపి శాంతిభద్రతలు కాపాడాలి అన్నా  సత్వ ర విచారణను మించిన సాధనం మరొకటి ఉండదు. విచారణ దశాబ్దాల పాటుగా కొనసాగినట్లయితే నేరస్తులు, ఆరోపించబడినవారు  కూడా  వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతారు. అదే పరిస్థితిలో అన్యాయంగా కేసులు మోపబడినటువంటి పేదలు, అమాయకులు కూడా నష్టపోతారు కదా(.చేయని నేరానికి శిక్ష పడి)

నిబద్ధత  జాతీయ ప్రయోజనాలతో  న్యాయ వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావడానికి   పనిచేస్తున్నటువంటి సిబ్బంది, న్యాయమూర్తులు  ఉన్నప్పటికీ  తగిన వాతావరణం పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత  ప్రభుత్వం  అధికార యంత్రాంగం పైన ఉంటుంది.  పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇవ్వడంతో పాటు " నేరపూరిత రాజకీయాలు లేదా పరిస్థితులను ఈ దేశము నుండి పారదోలాలి" అనే మౌలికమైనటువంటి పిలుపును రాజకీయ యంత్రాంగం గనుక ఇవ్వగలిగితే  ఆ స్థాయిలో న్యాయవ్యవస్థ పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ  తమ ఉనికికే భంగం కలిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు  లేదా ప్రమాదగంటికలు మోగినప్పుడు  మాకెందుకులే అనే భావన గనక న్యాయవ్యవస్థలో వచ్చిందంటే  దేశంలో న్యాయం నత్తనడక నడవక మానదు.దానికి పూర్తి బాధ్యత పాలకులు వహించవలసి ఉంటుంది అని న్యాయ విశ్లేషకులు సామాజిక రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.  న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ల లో కొన్ని లోపాలు ఉంటే కాదనలేం కానీ  చట్టం తన పని చేసుకుపోయినప్పుడు  అన్ని నేరాలు  లోపాల పైన విచారణ జరుగుతుంది.  

ఈ విచారణను వేగవంతం చేయాలన్న,  న్యాయ వ్యవస్థలో కదలిక రావాలన్నా  ప్రభుత్వం సకాలంలో సత్వ ర చర్యలు చేపట్టాలి. తమ బాధ్యత నిర్వర్తించాలన్న పట్టుదల గల ప్రజలతోపాటు మేధావులు బుద్ధి జీవులు కూడా పాలకుల పైన ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. "కంచె చేను మేస్తే ఇక కాపలా ఎవరు" అనే సందేహం  అన్ని విభాగాలకు కూడా వర్తిస్తుంది. ఆ రకంగా కాకుండా బాధ్యతలు ఉన్నవారు  ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి  తమ రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాలను నిర్వహించడానికి పూనుకుంటే  ఎవరిని ఎవరు ఆరోపించడానికి  నిందించడానికి అవకాశం ఉండదు.  "అయితే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే జాగరూకులైన ప్రజావళి చాలా అవసరం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించినట్లు  ప్రజలు కూడా దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతం కావడానికి  అవసరమైతే పోరాటం కూడా చేయవలసి ఉంటుంది.  ప్రజాస్వామ్య పద్ధతులలో చేసే ఒత్తిడి,  హక్కుల కోసం జరిగే పోరాటాలు  ఒకవైపు ప్రభుత్వాలను  మరొకవైపు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి.

ప్రజల పోరాటాలు ఆరాటాలు న్యాయవస్థకు  రక్షణగా వెన్నుదన్నుగా ఉన్నప్పుడు  మరింత సమగ్రంగా స్వతంత్రంగా  తీర్పులు ఇవ్వడానికి  ప్రజల పక్షాన పని చేయడానికి  న్యాయాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి న్యాయ వ్యవస్థ  పూనుకుంటుంది కూడా". ప్రజలు మౌనంగా ఉంటే పాలకులు  పట్టించుకోకుంటే  ప్రస్తుతం ఉన్నటువంటి ఐదు కోట్ల పెండింగ్ కేసులు  10 కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కరలేదు.  సత్వ ర విచారణతో  నిర్దోషులకు  శిక్షలు తప్పే అవకాశం,  దోషులకు శిక్షలు పడి  మానసిక పరివర్తనకు అవకాశం ఉంటుంది అదే కదా నిజమైనటువంటి న్యాయం!  ప్రజలు తమ వరకే కాకుండా  సు పరిపాలన, మౌలికంగా న్యాయం వ్యవస్థ కోసం  ఆలోచన చేస్తే  ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం దొరుకుతుంది.  ఎవరో ఒకరు అంగీకరించి ఆమోదించే వాళ్ళు  దొరకకపోరు. మేధావులు ఆలోచించాలి, మౌనాన్ని వీడాలి,  ప్రతిపక్షాలు చట్టసభల్లో ప్రశ్నల వర్షం కురిపించాలి.


--- వడ్డేపల్లి మల్లేశం
(  ఈ వ్యాస కట్టా సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333