తండ్రి హత్యకు ప్రతీకారం
ఐదుగురు నిందితుల అరెస్ట్
* శెట్టి ఆత్మకూర్ హత్య కేసును వేగంగా ఛేదించిన గద్వాల పోలీసులు
* విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వై. మొగులయ్య
*
గద్వాల ప్రతినిధి, జూలై 15: పాత కక్షలను మనసులో పెట్టుకొని ఈనెల 10వ తేదీన గద్వాల మండలం శెట్టి ఆత్మకూర్ గ్రామ శివారులోని పొలాల్లో గుంటిపల్లి రాజు @ డోజర్ రాజు (42) అనే వ్యక్తిని కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన కేసులో ఐదుగురిని గద్వాల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం గద్వాల సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వై. మొగులయ్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ టంగుటూరి శ్రీను, రూరల్ ఎస్సై సిహెచ్. శ్రీకాంత్ పాల్గొన్నారు.
కేసు వివరాలు..
శెట్టి ఆత్మకూర్ గ్రామానికి చెందిన గుంటిపల్లి రాజు ఈనెల 10న సాయంత్రం గ్రామానికి చెందిన కృష్ణయ్య గౌడ్ పొలం వద్ద బోరు వేస్తుండగా చూడటానికి వెళ్ళాడు. ఆ సమయంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న ప్రత్యర్థులు కర్రలతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలైన రాజును గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు గుంటిపల్లి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గద్వాల్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తండ్రి హత్యకు ప్రతీకారంగానే..
పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. మృతుడు గుంటిపల్లి రాజుకు, అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు భార్య సైదమ్మతో గతంలో అక్రమ సంబంధం ఉండేది. ఈ విషయమై 2017లో జరిగిన గొడవలో రాజు చేతిలో ఆంజనేయులు హత్యకు గురయ్యాడు. ఆ కేసులో రాజుకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, అతడు హైకోర్టు నుండి బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నాడు. తమ తండ్రిని చంపిన రాజుపై కక్ష పెంచుకున్న ఆంజనేయులు కుమారులు దొబ్బిలి విజయ్ కుమార్, బాల నేరస్థుడు మరియు బంధువులు దొబ్బలి లోకేష్, గోవర్ధన్, దొబ్బిలి శ్రీరాములు కలిసి ఈనెల 10న ఒంటరిగా దొరికిన రాజును కర్రలతో కొట్టి హతమార్చారు...
రికవరీ మరియు అభినందనలు..
సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను బుధవారం గద్వాల పట్టణంలోని కోట ప్రాంగణంలో అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు (హోండా యూనికార్న్, స్ప్లెండర్ ప్లస్), ఒక వీవో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన సీఐ టంగుటూరి శ్రీను, రూరల్ ఎస్సై సిహెచ్. శ్రీకాంత్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.