కనీస అవసరాలకు నొచని  ఆసుపత్రులు

Aug 23, 2025 - 12:29
 0  4

  వైద్య సిబ్బంది సిద్ధంగా వున్నా   వారిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ పాలసీ.*   కలెక్టర్లు నిల్ బ్యాలెన్స్ తో ఉంటే  ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోతే  భవనాలతోనే సంబరపడాలా ?
************
--వడ్డేపల్లి మల్లేశం 9014206412 
---20...01...2025********
కొన్నిచోట్ల భవనాలు నిర్మించిన ప్రారంభం కానీ ఆసుపత్రులు, ఆసుపత్రులను ప్రారంభించినా  సిబ్బంది   లేమి,  సిబ్బంది ఉన్నచోట యంత్ర పరికరాల లోటు,  అనేక చోట్ల వైద్యాధికారులు  వైద్యులు సిబ్బంది  సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహం కరువైన పరిస్థితులు,  కనీస అవసరాలు   మందులు ఇతర సౌకర్యాల కొరత వల్ల  ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజల్లో చిన్నచూపు.  ఇ న్నిo టికి కారణం అవుతున్నటువంటి ప్రభుత్వ పాలసీ  లో మార్పు రావాల్సిన అవసరం ఉంది .అభివృద్ధి చెందుతున్న భారత దేశంలో  విద్యా వైద్య రంగాలు  అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను ఆవిష్కరించడం  సాధ్యమవుతుంది.  మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో  ప్రభుత్వ ప్రైవేటు రంగంలో  వ్యవస్థలు కొనసాగడం సహజమే కానీ  వైద్య  ఆరోగ్య, విద్యా శాఖలు మాత్రం  పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యం లోనే కొనసాగినట్లయితే  సమాజంలో జ్ఞానాన్ని పెంపొందించడానికి  ఆరోగ్య భద్రతను ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగు  పరచడానికి అవకాశం ఉంటుందని రాజ్యాంగం నిర్మాతలు  ఆశించి  శాసించినారు కూడా. కానీ   78 సంవత్సరాల  స్వతంత్ర భారతదేశంలో  ఈ రెండు రంగాలను ముఖ్యంగా వైద్య రంగాన్ని  ప్రభుత్వం తన సామాజిక బాధ్యతగా గుర్తించడానికి ముందుకు రాకపోవడాన్ని మనం నిరంతరం గమనించవచ్చు.దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు  ప్రభుత్వాలే మద్దతిస్తూ  పెంచి పెద్ద చేస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు  అని చెప్పక తప్పదు .వైద్యాన్ని విద్యను  ఉచితంగా అందివ్వడానికి ఏ రాజకీయ పార్టీ కూడా  రాజ్యాంగం ప్రకారంగా హామీ ఇవ్వలేదు  కనీసమైన ప్రకటన కూడా చేయలేదు ఇప్పటివరకు.  అందుకే ప్రభుత్వ రంగంలో అవి నామమాత్రంగానే మిగిలిపోతూ ఉంటే  అరకొ ర బడ్జెట్ కారణంగా  కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోవడంతో ప్రజలు  ప్రైవేటు వైద్యశాలల  మీద ఆధారపడక తప్పడం లేదు.తద్వారా  వాళ్ళ ఆదాయంలో అగ్ర భాగం   వైద్య అవసరాలకే ఖర్చు చేయడం వలన కొనుగోలు శక్తి తగ్గి  పేదరికంలోకి జారుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో చిరు వ్యాపారులు, వీధి  వ్యాపారులు, వ్యవసాయ  కార్మికులు, చేతివృత్తుల వాళ్ళ  తో పాటు పట్టణ ప్రాంతాలలో  చిరు ఉద్యోగులు ఇతర కార్మికులు పేద వర్గాలు అంతా కూడా  వైద్య అవసరాలకు ప్రైవేటు ఆసుపత్రుల మీద ఆధారపడిన కారణంగా అప్పుల పాలయ్యి   ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న సందర్భాలను పాలకులు ఎప్పుడైనా  గమనించారా?
      ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటే....  
*************
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉంటే ప్రజలు  ముఖ్యంగా పేదవర్గాలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు వెళ్తారు?   అరకొర సౌకర్యాలతో కునారిల్లి పోతున్న  ప్రభుత్వ వైద్య రంగాన్ని  పాలకులు మరింత నీరుగార్చే  ప్రయత్నం చేయడం వలన  కనీస మైనటువంటి మందులు సౌకర్యాలు పరీక్షలు లేకపోవడం  రిపోర్టులను ఇవ్వడానికి కూడా పేపరు అందుబాటులో లేనటువంటి దయనీయ పరిస్థితులు ఇవాళ ప్రభుత్వ  ఆసుపత్రిలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు .ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సిబ్బంది సూపర్డెంట్ల స్థాయిలో  మరిన్ని సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు కూడా అనేక ఆసుపత్రిలో మనకు దర్శనమిస్తారు.  అలాంటివాళ్లు నిధుల కొరతను అధిగమించడానికి అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ  ఫలితం లేకపోవడంతో నిరాశకు గురై  ఏమి చేయలేని నిస్సహాయ   స్థితిలోకి నెట్టివేయబడుతున్నారు.  ఈసీజీ, ఎక్స్రేలు, స్కానింగ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, దంతాలకు సంబంధించినటువంటి స్కానింగ్  తో పాటు వివిధ అవయవాలను పరీక్షించే అనేక  పరీక్షలకు సంబంధించినటువంటి  సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడం  జిల్లా ఆసుపత్రి లోపల కూడా ఈ రకమైన కనీస సౌకర్యాలకు నోచుకోని పరిస్థితులలో  ఇష్టారాజ్యంగా వెలుస్తున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులు  నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా వర్ధిల్లుతూ ఉంటే  దానికి బాధ్యులు పాలకులు కాదా?  ప్రభుత్వాలు తమ బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయిస్తున్న నిధులను ఒక్కసారి పరీక్షించుకుంటే  వారికి అర్థమయిపోతుంది  ఇప్పటికీ అనేక విభాగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 13,000, 17000  మొక్కుబడి వేతనముతో బతుకుతున్నారంటే వాళ్ళు ఏ రకంగా సర్వీసు చేయగలరు అర్థం చేసుకోవాలి. రాత్రి పగలనకా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం పనిచేసేటువంటి వైద్య   సిబ్బందికి  వేతనాలు సరిపోయే స్థాయిలో ఇచ్చి పని తీసుకుంటే అర్థం ఉంటుంది కానీ  ఏక మొత్తం వేతనంతో  నిర్బంధంగా పనిచేయించుకోవడం అంటే  ప్రభుత్వ రంగంలో వెట్టి చాకిరిని ప్రోత్సహించడమే కదా?  ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు శాసన మండలి సభ్యులు  ఇతరులు పొందుతున్నటువంటి ప్రభుత్వ సౌకర్యాలను గనుక గమనిస్తే  ఊహకు కూడా అందనటువంటి స్థాయిలో అనుభవిస్తున్నారని మనకు తెలుస్తున్నది.  మరి క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి మాత్రం  అరకొర వేతనాలు ఇచ్చి చాకిరీ చేయించుకుంటామంటే  అది ఎలా కుదురుతుంది?   నాణ్యమైనటువంటి మందులు  లేని పరిస్థితిలో  రోగాలను నయం చేయడానికి అప్పుడప్పుడు సిబ్బంది బయటి మందుల షాపులకు  రెఫర్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది  అంటే  డబ్బులు లేకనే  ప్రభుత్వ దవాఖానకు వచ్చినప్పుడు ప్రైవేటుగా  మందులు కొనుక్కోవాలంటే కష్టమే కదా!  అలాంటి దుస్థితి రాకుండా చూడాలంటే ఆయా ఆసుపత్రి యొక్క స్థాయిని బట్టి అక్కడ ఉండాల్సినటువంటి మందులు సౌకర్యాలు సిబ్బంది, యంత్ర పరికరాలను  ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉన్నది.  భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చినంత స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. అంటే  భవన నిర్మాణాల ద్వారా  లబ్ధి పొందడానికి అని కొందరు విమర్శిస్తున్న నేపథ్యంలో  ఆ విమర్శలను తిప్పి కొట్టాలంటే భవనాల నిర్మాణంతో పాటు సౌకర్యాల కల్పనలో కూడా  ప్రభుత్వాలు ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.  అంతెందుకు విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ప్రజల కనీస అవసరాలను తీర్చగలిగితే మిగతా ఏ అవసరాలను  తీర్చడానికి హామీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. స్వతంత్రంగా సాధించుకున్నటువంటి వృత్తి ఉపాధి ద్వారా ఆదాయాలను సమకూర్చుకొని ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కానీ ప్రజల ఆత్మ గౌరవాన్ని వంచించే క్రమంలో ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా  వాగ్దానాలు హామీలతో వారిని వంచించి  బానిసలుగా చేస్తున్నటువంటి పాలసీ వలన  ప్రజలు స్వతంత్రంగా బతకలేకపోతున్నారు పాలకులను ప్రశ్నించ లేకపోవడానికి కూడా అదే కారణం. అయినా ఇప్పటికీ అక్కడక్కడ వస్తున్నటువంటి మార్పులు  చైతన్యం  రాజ్యాంగపరంగా మాకు ఉన్న హక్కులు మాకు కావాలి అని చేస్తున్న డిమాండ్  రాబోయే కాలం లోపల  ప్రభుత్వాలను ఇరుకున పెడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. పాలకులు  ఏ రకమైనటువంటి రాజ భోగాలను అనుభవిస్తున్నారో  ప్రజలకు తెలిసిన రోజున  ఈ దేశ సంపదలో మా వాటా ఏమైంది? అని ప్రజలు ప్రశ్నించిన నాడు  పాలకులు పరేషాను కాక తప్పదు.  అంటే  ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల యొక్క వేతన జీతభత్యాలు  ఇతర సౌకర్యాలు  బందోబస్తు ఖర్చులు  ఆడంబర విలాసాలను గనుక ఒక్కసారి పరిశీలిస్తే  నిజంగా ప్రజలు ఆగ్రహానికి రాక మానరు. ఆ వివరాలతో మరొక వ్యాసంలో కలుసుకుందాం  కానీ  ప్రజల డిమాండ్ ను  ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రతి స్థాయిలో  తమకు అవసరమైన చికిత్సను ఉచితంగా  నాణ్యమైన స్థాయిలో పరీక్షలతో సహా  తీర్చగలిగే వైద్యం  ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.  నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు,  బడ్జెట్లో మరిన్ని నిధులు పెంచాలని  ప్రశ్నించడానికి  ఆరాటపడుతున్నారు.  ప్రజల ఆరాటము, ఆకాంక్షలు,  ఆశయాలు ప్రభుత్వాల మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని  వమ్ము  చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలది.  అందులో అగ్ర భాగాన నిలపాల్సినటువంటి శాఖ వైద్య ఆరోగ్య శాఖ.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333