అసత్య ప్రచారాలతో వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు..
ఎస్సై గోపికృష్ణపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న శ్రీదేవి కుటుంబసభ్యులు
దృశ్యపచారాన్ని ఖండించిన ప్రజా దళిత సంఘాలు..
సూర్యపేట/పెన్‌పహాడ్, 20 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- వ్యక్తిగత విభేదాలు, కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకుని నిరాధార ఆరోపణలు చేయడం వల్ల అమాయకుల ప్రతిష్ఠ దెబ్బతింటుందని జల్మాల్‌కుంట తండాకు చెందిన శ్రీదేవి పేర్కొన్నారు. తన భర్త గత రెండు సంవత్సరాలుగా కుటుంబ బాధ్యతలను విస్మరించి, తమను మరియు తన అత్తమామలను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పెన్‌పహాడ్ ఎస్సై గోపికృష్ణపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు. శ్రీదేవి మాట్లాడుతూ, గోపికృష్ణ తమ కుటుంబానికి 2013 సంవత్సరం నుంచే పరిచయస్తుడని, కుటుంబ స్నేహితుడిగా మాత్రమే మెలిగారని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన సందర్భాల్లో సహాయం చేసినప్పటికీ, ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని పేర్కొన్నారు. అవసరమైన సమయంలో ఒక పాత మొబైల్ ఫోన్ కావాలని అడగగా, ఆయన స్పందించి ఒక పాత ఫోన్ ఇచ్చారని చెప్పారు. ఆ ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకుని తమ మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేయడం బాధాకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి అత్తమామలు కూడా స్పందించారు. గోపికృష్ణకు మంచి వ్యక్తిత్వం ఉందని, ఆయనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆయన తమ ఇంటికి వచ్చి అనుచితంగా ప్రవర్తించిన సందర్భం ఒక్కటైనా లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమ కుమారుడు సుధాకర్ కొందరు వ్యక్తుల ప్రభావానికి లోనై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే బదులు, ఇతరుల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఎస్సై గోపికృష్ణపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణల వల్ల ఒక వ్యక్తి ఉద్యోగ జీవితంతో పాటు సామాజిక గౌరవం కూడా దెబ్బతింటుందని పేర్కొంటూ, నిజానిజాలు తేల్చి గోపికృష్ణకు న్యాయం చేయాలని కోరారు. వ్యక్తిగత కక్షలు, కుటుంబ విభేదాలను పక్కనబెట్టి వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అధికారులు చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.