అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన న్యాయవాదులు

Jun 9, 2026 - 22:13
 0  1
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన న్యాయవాదులు

శాంతియుత నిరసనకు అడ్డంకులా?

పోలీసు పికెట్ ఎత్తివేయాలని ప్రభుత్వాని డిమాండ్

 జోగులాంబ గద్వాల 9 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల.: జిల్లా కోర్టు సముదాయం నిర్మాణం కోసం అనంతపురం గుట్టల వద్ద కేటాయించిన స్థలాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని సమర్పించారు. అంతకుముందు న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వెంటనే పోలీసు పికెట్‌ను ఎత్తివేయాలని ఏకకంఠంతో డిమాండ్ చేశారు. అనంతరం నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కావలి నరసింహులు తదితరులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా తమ నిరసన శిబిరాన్ని తొలగించి తమ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీక్షా శిబిరం ఏర్పాటుకు అనుమతి కోరుతూ సంబంధిత అధికారులను సంప్రదిస్తే ఒకరు మరొకరి వద్దకు పంపిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యపై శాంతియుతంగా పోరాడుతున్న న్యాయవాదులకే ఈ పరిస్థితి ఉంటే ఇక గద్వాలలో పౌర హక్కులను కోరే సామాన్యల పరిస్థితి ఇక ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. శాంతియుతంగా దీక్షలు చేపట్టదలచిన కోర్టు వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. సాధారణంగా శాంతిభద్రతలకు ముప్పు ఉన్న ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేస్తారని, అలాంటి పరిస్థితులు లేని కోర్టు వద్ద పికెట్ ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం తన ప్రతిష్టను కోల్పోతుందని వారు విమర్శించారు. గద్వాల కోర్టు చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఏర్పడలేదని, తమ గోడును ఎవరికి చెప్పాలో తెలియక చివరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఆశ్రయించి వినతిపత్రం సమర్పించామని న్యాయవాదులు తెలిపారు. జిల్లా కోర్టుకు ప్రజలకు అందుబాటులో ఉండే అనువైన స్థలాన్ని కేటాయించాలని, శాంతియుత నిరసనలకు ఆటంకాలు కల్పించకుండా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333