సూర్యాపేట మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.

Jun 2, 2026 - 20:12
Jun 2, 2026 - 20:12
 0  2
సూర్యాపేట మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
సూర్యాపేట మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.
సూర్యాపేట మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.

ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు ఆవిర్భావ దినోత్సవాలు ఆడంబరంగా చేయడం సిగ్గుచేటు.

- కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య ఇల్లందు మాజీ శాసనసభ్యులు 

సూర్యాపేట 2 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనాయని ఇల్లందు మాజీ శాసనసభ్యులు కామ్రేడ్  గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మునిసిపాలిటీలోని సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కొత్త బస్టాండ్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ సూర్యపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 10సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం గానీ, రెండున్నర సంవత్సరాల నుండి అధికారంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ గాని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనాయని ఆయన ఆవేదన చెందారు. ఎన్నో పోరాటాలకు పేరుగాంచిన కోట సూర్యపేట జిల్లాలో సూర్యాపేట పట్టణం సమస్యల వలయంలో ఇరుక్కోవడం బాధాకర విషయమని అన్నారు. ఫార్మా ఫ్యాక్టరీలు వెదజల్లుతున్న విషవాయువులు, సరియైన నిర్మాణంలో లేని డ్రైనేజీ మురుగు  నీటి సమస్యతో సూర్యాపేట చుట్టూ పది కిలోమీటర్ల మేర జల కాలుష్యం వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని, తద్వారా విషవాయువులు  పీలుస్తున్న ప్రజలు అనేక రకాల శ్వాస చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. డ్రైనేజీ మురికి నీటిని, రీసైక్లింగ్ కోసం పుల్లారెడ్డి చెరువు ప్రాజెక్టుకు 300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించబడినప్పటికీ, ఆ చెరువు నేటికి ఉపయోగంలోకి రాక, పంటలు మొత్తం విష వలయంగా మారి, సూర్యాపేట పట్టణ ప్రజలు విషం తిని బ్రతుకుతున్నారని ఆవేదన చెందారు. జలచరాలు భూచరాలు ఉభయచరాలు మొత్తం కూడా విషంతో నిండిపోయి ఆహారానికి పనికి రాకుండా పోతున్నాయని ఆయన అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి నెలకు సుమారు 35 నుండి 40 కోట్ల ఆదాయం వస్తుండగా, ఖర్చులు 25 నుండి 30 కోట్ల వరకు అవుతున్నాయని, ఈ విధంగా నెలకు 10 నుండి 15 కోట్ల ఆదాయం సూర్యాపేట మున్సిపాలిటీకి మిగులుతుండగా సూర్యపేట అభివృద్ధి ఆమెడ దూరంలో ఎందుకు ఉన్నదో అర్థం కావట్లేదని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా పాలకవర్గాలు కళ్ళు తెరిచి, ఆడంబరాలు పక్కకు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. లేనియెడల రాబోయే రోజులలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ పాదయాత్రలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్. భద్రయ్య, డాక్టర్ రంగారెడ్డి గారు పాల్గొని సంఘీభావం తెలియజేసి మాట్లాడటం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కారింగుల వెంకన్న, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, పిడిఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పార్టీ జిల్లానాయకులు వాస పల్లయ్య టియుసిఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కామ్రేడ్ గొడ్డలి నర్సయ్య, సయ్యద్ హుస్సేన్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మారసాని చంద్రకళ,ఉపాధ్యక్షులు రేణుక, సహాయ కార్యదర్శి సంతోషి మాత,కోశాధికారి జయమ్మ, అంబటి బిక్షం, సైదులు, పావని,లక్ష్మి, పార్టీ పట్టణ కార్యదర్శి ఎస్.కె గులాం హుస్సేన్, రజాక్, పజూరి రేణుక, పాల్వాయి అనసూయ, కట్ట రమేష్,కల్పన తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333