ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కృషి చేయాలి
విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం హర్షనీయం.
తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.
సూర్యాపేట 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షలాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రస్తుతం చదువుకునే రోజుల నుండి చదువుకొనే రోజులకు మారాయని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం హర్షనీయమని కొనియాడారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లకుండా తమిళనాడు, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల తరహాలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎంతోమంది ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చదువుల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేస్తూ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను కార్పొరేట్ తరహాలో ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చొరవ తీసుకోవాలన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం వచ్చేంతవరకు విద్యార్థులు, ఉద్యమకారులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు దేవత్ కిషన్ నాయక్, తెలంగాణ రియల్ ఎస్టేట్ రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రావణ్ పర్వతం వెంకటేశ్వర్లు, కంభంపాటి అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, అయితే గాని మల్లయ్య గౌడ్, సారగాండ్ల కోటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడి లిo గయ్య, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.