జర్నలిస్టులపై అక్రమ కేసును తొలగించండి
-TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
మహబూబ్ నగర్ 7 మే 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేంద్ర చారీ (hmtv), కార్యదర్శి నరేందర్ గౌడ్ (ఆంధ్రజ్యోతి), ప్రజాజ్యోతి జర్నలిస్ట్ శ్యామిల్ సుందరచారీలపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించు కోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ డిమాండ్ చేసారు. గురువారం నాడు యూనియన్ రాష్ట్ర నాయకులు కల్కూరి రాములు, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి మహబూబ్ నగర్ పర్యటించిన ఆయన, స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారనే అభియోగం మోపి, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు జర్నలిస్టులపై కేసు నమోదు చేయించడం సహించరానిదన్నారు. ఈ విషయంలో జిల్లా ఎస్పి స్పందించి కేసును తొలగించాలని, లేనిపక్షంలో డీజిపికి ఫిర్యాదు చేయడంతో పాటు ఉద్యమ కార్యాచరణను చేపడతామని విరాహత్ హెచ్చరించారు. తెలంగాణ మీడియా అకాడమీ మరియు రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అక్రెడిటేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియ యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అక్రెడిటేషన్ల కోసం సుమారు 4వేల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు దాదాపు 2,200 కార్డులను మంజూరీ చేయడం జరిగిందన్నారు. జిల్లా కమిటీల ఏర్పాటులో జరిగిన జాప్యం వల్ల, ఆయా జిల్లాల్లో కమిటీ సమావేశాలు జరగనందున కార్డుల మంజూరీలో జాప్యం జరుగుతుందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందేలా తమ యూనియన్ కృషి చేస్తుందని విరాహత్ స్పష్టం చేసారు. ఆయా జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇటీవల వినతి పత్రాన్ని అందించామని, రెండు నెలల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.