చట్టబద్ధమైన పాలనలో  కొ రబడుతున్న నిబద్ధత.

Mar 19, 2026 - 06:42
 0  0

 భారత్ లోనే కాదు ప్రపంచ దేశాల్లోనూ అదే దుస్థితి.* చట్టబద్ధ పాలనకు సుపరిపాలన  తోడైతే  జన రంజక పాలన అవుతుంది.* అందుకు  పాలకులకుoడాలి కదా చిత్తశుద్ధి.

చట్టం  ఆమోదించిన నిబంధనల మేరకు  ప్రజా క్షేత్రంలో జరిగే పాలన  నియమ నిబంధనలు కట్టుబాట్లు  చట్టసభల యొక్క ఆమోదంతో కూడి ఉన్నప్పుడు  అది చట్టబద్ధ పాలన అవుతుంది.  అయితే సుపరిపాలన అనేది ఇంతకుమించి సర్వోన్నతమైనది  అంటే చట్టబద్ధమైన పాలన సుపరిపాలనలో ఒక అంశం మాత్రమే.  చట్టబద్ధమైన పాలనకే ప్రపంచంలోని చాలా దేశాలలో అతిగతి లేకుండా  కొనసాగుతున్న సందర్భంలో  ప్రజలు మెచ్చే కోణంలో ఆశించే సుపరిపాలన  ఎండమావిలోన నీటి చందమే అవుతుంది.  అయితే ఆ రకంగా పాలకులను విడిచి పెడితే  మరింత రెచ్చిపోతారు  కనీస నియమ నిబంధనలకు కూడా అవకాశం ఇవ్వకుండా,  సుపరిపాలనకు ఆస్కారం లేకుండా,  దుష్ట పాలనకు దారులు తెరిచే అవకాశం ఉంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అందుకే కష్టమైనా,  సమీప భవిష్యత్తులో అసాధ్యమని తెలిసినా  మన డిమాండు చట్టబద్ధ పాలన,  జనరంజక పాలన,  పారదర్శక పాలన,  ప్రజల మద్దతుతో కూడుకున్న పాలన, అంతిమంగా  ప్రజలు అన్ని రకాల మెచ్చే సుపరిపాలన కావాలని డిమాండ్ చేయడమే  ప్రజల ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం .చట్టాలు  అమలయ్యే క్రమంలో వక్రదారి పడుతూ  అవి ఉన్నత వర్గాలకు చుట్టాలుగా మారిపోతున్న సందర్భంలోనే  సామాన్య అట్టడుగు వర్గాలకు న్యాయం జరగని పరిస్థితుల్లో  చట్టబద్ధ పాలన కోసం డిమాండ్ చేయడం జరుగుతుంది.

ఇక ప్రజాస్వామ్య బద్ధంగా  ప్రజల జీవితాల్లోకి చొరబడి  సంక్షేమం అభివృద్ధిని  కోరుకునే పాలన  సుపరిపాలన కాగా  ఆ పరిపాలన కోసం  భారతదేశంలో  బ్రిటిష్ పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజా రాజ్యాన్ని సాధించుకున్నాం. కానీ  80  వసంతాల స్వాతంత్ర  పాలనలో  చట్టబద్ధ పాలన  సుపరిపాలనలో  ఏదీ కూడా అక్షర రూపం దాల్చలేదు.  చట్టసభల్లో నేరస్తులే  పరిపాలన చేస్తూ ఉంటే  ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా దారితప్పి  పాలకులకు వ o త బాడుతూ ప్రజలకు ద్రోహం చేస్తూ ఉంటే  నేరం ఆరోపించబడినంత మాత్రాన  నేరస్తులని ముద్రవేస్తూ దశాబ్దాలు శిక్ష అనుభవిస్తున్న సామాన్య ప్రజలు ఒకవైపు  తలబాదుకుంటుంటే  మరొకవైపు బడా నేరగాళ్లు  ప్రజాస్వామ్యాన్ని విచ్చిన్నం చేసే ద్రోహులు కార్పొరేట్ సంస్థలు  ప్రజా సంపదను కొల్లగొడుతూ ఉంటే  బడ్జెట్లో సామాన్య ప్రజలకు కనీస మైనటువంటి ప్రాధాన్యత ఇవ్వనటువంటి  పాలనలో  చట్టబద్ధమైన పాలనకు తూట్లు పడుతున్నప్పుడు  సామాన్యునికి రక్షణ ఎలా ఉంటుంది?  ఈ పరిస్థితులు  కేవలం భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలో ఉన్న  మధ్యతరగతి దేశాల్లో  దుర్భర పరిస్థితులు కొనసాగుతూ ఉంటే  మనం సమీక్షించుకోకపోతే ఎలా? ఇతర దేశాలతో పోల్చుకోవడం ఎ o త ముఖ్యమో అంతకు మించిన స్థాయిలో  నైతికతను,  ప్రజా భాగస్వామ్యాన్ని,  పాలనలో పారదర్శకతను సాధించుకోవడం ద్వారా  8 పదుల స్వతంత్ర భారతదేశంలో  ఇప్పటికీ ఒక దారికి రాకపోతే  స్వాతంత్ర్యం మేడిపండు లాగా మిగిలిపోతే  ఇక అర్థం ఏముంటుంది.?

  ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి

భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే  జాగరూకులైన ప్రజావళి ఎంత ముఖ్యమో అంతకు మించిన స్థాయిలో ప్రజల యొక్క భాగస్వామ్యం  పరిపాలనలో అంతే ముఖ్యం అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రాజ్యాంగ లక్షణాలను ప్రస్తావించినప్పుడు హెచ్చరించడం జరిగింది. సుపరిపాలనకు అవసరమైన సమర్థవంతమైన చట్టాలను తయారు చేసుకోవడం ఎంత ముఖ్యమో  ఆ చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసుకోవడం ద్వారా ప్రజల ఆశలు ఆకాంక్షలకు  అక్షర రూపం కల్పించడం అంతే ముఖ్యం. చట్టబద్ధమైన పాలనకు పరిమితి విధించవలసిన అవసరం లేదు.  పారదర్శకత ప్రజల భాగస్వామ్యం,  ప్రజల అవసరాలను గుర్తించడం,  స్వేచ్ఛ స్వాతంత్రాలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రశ్నించే గొంతులకు అవకాశం కల్పించినప్పుడే పాలనలో స్పష్టత  గోచరిస్తుంది. రాసుకున్నది ఒకటి అమలయ్యేది మరొకటి.  ఇప్పటికీ నేరస్తులు ఎవరు? నేరం ఆరోపించబడిన వారు  నేరస్తులు అవుతారా?  నేరస్తులుగా రుజువు కానప్పుడు శిక్ష ఎందుకు అమలు చేస్తున్నారు?. శిక్ష అమలైన తర్వాత చివరికి నిర్దోషి అని ప్రకటిస్తే  వ్యక్తికి అన్యాయం జరిగినట్లు చట్టం  ఓడిపోయినట్లు కాదా?  ఇలాంటి  పాలనకు  ఎందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు?  ఈ దేశంలోని కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయశాఖలు కూడా  సుదీర్ఘంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.  

బడా నేరగాళ్లు  ప్రజలకు ద్రోహం చేసిన వాళ్లు  ప్రజా సంపదను కొల్లగొట్టిన వాళ్లు  చట్టసభలలో ఊరేగుతూ  ఎ లాంటి శిక్షలు లేకుండానే తప్పించుకుంటున్న పరిస్థితులలో  పిడికెడు మెతుకుల కోసం దొంగతనం చేసినటువంటి  పేదవాన్ని బిచ్చగాన్ని నేరస్తులుగా ముద్ర వేసి  అరెస్ట్ చేసి జైలు శిక్ష  అమలు చేసినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు  ఇంత భారీవ్యత్యాసం తగునా?  ఇది చట్టబద్ధ పాలన అవుతుందా? ఒక రకంగా చట్టబద్ధ పాలనకు తూట్లు పొడిచినట్లే కదా?  ఏ దేశంలో నైనా పాలన చట్టబద్ధంగా సాగినప్పుడు  అధికార సద్వినియోగం  సాధ్యమవుతుంది.  తద్వారా మానవ హక్కులకు కనీస మైనటువంటి విలువ ఉంటుంది.  చట్టబద్ధ పాలన గనక కొనసాగనప్పుడు  పాలకులు అధికారాన్ని విచ్చలవిడిగా దు ర్వినియోగం చేసినట్లయితే  ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగము కలిగి ఉండి కూడా  పీఠికలో ఉన్న న్యాయం బదులు అన్యాయం తాండవిస్తే  అదేం పాలన? ఈ క్రమంలోనే దక్షిణాసియాలో ఉన్నటువంటి కొన్ని దేశాల  పాలనలో చట్టబద్ధత ఏ పాటి ఉన్నదో తెలుసుకోవడానికి  వరల్డ్ జస్టిస్ ప్రాజెక్టు నివేదిక 2025 ప్రకారం  ఈ క్రింది ఆరు దేశాల  చట్టబద్ధతకు సంబంధించినటువంటి  సూచికను విడుదల చేయడం జరిగింది. 0--1 మార్కు  కేటాయించగా  ఒక్క మార్కు సాధించినటువంటి దేశాలు  చట్టబద్ధమైన పాలన పటిష్టంగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది.

నేపాల్ 0.52 
శ్రీలంక 0.5 1 
భారతదేశం 0.49 
బంగ్లాదేశ్ 0.39 
పాకిస్తాన్ 0.37 
ఆఫ్ఘనిస్తాన్ 0.31

చట్టబద్ధమైన పాలనకు గుర్తుగా ఒక మార్కును కేటాయిస్తే  ఆ పరిధికి పై ఆరు దేశాలలో ఏ దేశం కూడా రాకపోగా  అరకొర పరిస్థితులలో పద్ధతులలో  అక్కడి పాలన సాగుతున్నట్లు పై గణాంకాలను బట్టి తెలుస్తుంది.  ఇందులో భారతదేశం 0.49 అంటే  కనీసం సగంపాయింట్లు కూడా తెచ్చుకో లేదంటే  ఇక్కడ చట్టబద్ధమైన పాలన, జన రంజక పాలన, సుపరిపాలన అసలే లేదని తేలిపోతున్నది.

 సుపరిపాలన వైపు పాలకులు దృష్టి సారించాలి

పై గణాంకాలను బట్టి చూస్తే భారతదేశo  చాలా చిన్న అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చుకున్నప్పుడు  అత్యల్ప స్థాయిలో చట్టబద్ధ పాలన ఉండడాన్ని మనం గమనించవచ్చు.  ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని  రాబోయే 1000 సంవత్సరాల ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉన్నదని  పేదరికం క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని  కేంద్ర ప్రభుత్వం తరచుగా ప్రకటన చేయడం జరుగుతున్నది. అక్షరాస్యత శాతాన్ని పెంచడం, పేదరికం పూర్తిగా నిర్మూలించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం తో పాటు  సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగు పడకుండా  ప్రజలందరికీ సమానంగా పంచగలిగినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క.  సంపద ఉండడం వేరు సంపద పంపిణీ వేరు  కోట్లాదిమంది శ్రమజీవులు  ఒక్క పూటకు నోచుకోని పరిస్థితిలో  విద్య, వైద్యం ప్రైవేటు చేతుల్లోనే  నలిగిపోతుంటే అరకొర ఆదాయాన్ని ఆ రంగాలకే పేదలు ఖర్చు పెడుతుంటే ఈ దేశంలో పేదరికం కాక మరేమీ మిగులుతుంది.?  40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతిలో ఉన్న చేదు వాస్తవాన్ని  ప్రభుత్వం అంగీకరించి  సమాన పంపిణీ జరపాలి.  ఈ దేశంలో భూమి పేద వర్గాలకు పంపిణీ చేయాలి,  విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన స్థాయిలో కొనసాగాలి, అప్పుడు మాత్రమే చట్టబద్ధమైన పాలనతో పాటు  భారతదేశంలో సుపరిపాలన సాధ్యమవుతుంది పాలకులు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే తప్పకుండా ఆ వైపు  చేరుకుంటాం.  కావలసింది నిబద్ధత మాత్రమే  ప్రజలు డిమాండ్ చేయకుండా  పాలకులే  చేస్తారనుకోవడం  శ్రీ శ్రీ రాసిన పాట లాగా "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా" అన్నట్టుగా ఉంటుంది.


----వడ్డేపల్లి మల్లేశం 

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333