ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం - దిష్టిబొమ్మ దహనం.
భద్రాద్రి, కొత్తగూడెం 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్:- భద్రాచలం కూనవరం రోడ్డులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రముఖులు మాట్లాడుతూ, తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని “ఉగ్రవాది”గా అభివర్ణించడం అత్యంత బాధాకరమని అన్నారు. దేశ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అభివృద్ధి, జాతీయ భద్రత కోసం కృషి చేస్తున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ అసహనాన్ని, నిస్సహాయతను బయటపెడుతోందని అన్నారు. కాంగ్రెస్ వరుస ఓటములతో ఖర్గేకు మతి భ్రమించిందని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కుటుంబ ఆధిపత్య అవినీతి పాలన, మంత్రుల, ఎంఎల్ఏల కమీషన్ల, స్వాముల అరాచకాల వలన ఇప్పటికే కాంగ్రెస్‌పై ప్రజలు నమ్మకం పూర్తిగా కోల్పోయారని, బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పాతాళానికి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మారావు, పోడియం బాలరాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గుగులోతు బాలు నాయక్, పినపాక కన్వీనర్ పొన్నం బిక్షపతి, బూర్గంపాడు మండల ప్రెసిడెంట్ సాయి శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ చుక్కపల్లి బాలాజీ, అశ్వాపురం మండల ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు ఐలయ్య, నిడదవోలు నాగబాబు, ములిశెట్టి రాంమోహన్ రావు, ఆవుల సుబ్బారావు, ఏనుగుల వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.