సమస్యల సుడిగుండంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్.
సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి.
కొత్తగా నిర్మిస్తున్న హాస్పటల్ ని తక్షణమే పూర్తి చేసి, అన్ని రకాల డిపార్ట్మెంట్లను అందుబాటులోకి తేవాలి.
కొత్తపల్లి శివకుమార్ సిపిఐ(ఎం.ఎల్ )మాస్ లైన్ జిల్లా కార్యదర్శి.
సూర్యాపేట 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- సిపిఐ (ఎం.ఎల్ ) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ని సందర్శించి సౌకర్యాలను పరిశీలించి సూపరిండెంట్ ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం.ఎల్ )మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జనరల్ హాస్పిటల్ అనేక సమస్యలకు నిలయంగా మారిందని ఆవేదన చెందారు. మున్సిపాలిటీ మరియు హాస్పిటల్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయి దుర్గంధం వెదజల్లుతూ, రోగాలు తగ్గించుకొనుటకు హాస్పిటల్ కి వస్తున్న వారికి కొత్త రోగాలను సృష్టించే విధంగా డ్రైనేజీ వ్యవస్థ తయారయిందని ఆవేదన చెందారు.ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి,మురుగునీరు బయటకు వెళ్లక దోమలు,ఈగలు క్రిమి,కీటకాలకు నిలయంగా మారిందని ఆవేదన చెందారు. దోమల నివారణకు చేసే ఫాగింగ్ను కూడా మునిసిపాలిటీ వారు హాస్పిటల్లో చేయకపోవడంతో దోమలు,ఈగలకు నిలయమైందన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వైద్య సిబ్బంది మధ్య కూడా సమన్వయం లోపించి, రాత్రి వేళలో వీధిలైట్లు వెలగక విషపు పురుగులకు సంచారం నిలయంగా మారిందని అన్నారు. అదేవిధంగా వార్డులలో కూడా సరి అయిన లైటింగ్ లేక ప్రజలు చీకటిలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన చెందారు. కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో రోగుల సంఖ్య పెరిగిన సందర్భంలో, పడకలు పెంచడం వీలుకాక ఇరుకు గదుల్లోనే రోగులను ఉంచుతున్నారని ఆవేదన చెందారు. హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు లేట్ చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి కాంట్రాక్టర్ తక్షణమే నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన హితవు పలికారు. అదేవిధంగా హాస్పిటల్లోనే వివిధ విభాగాలలో తగిన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరినారు. కార్డియాలజీ విభాగానికి సంబంధించి పరికరాలు అందించి, ఇంతవరకు కార్డియాలజిస్టును నియమించకపోవడంతో ఆ పరికరాలు తుప్పు పట్టి పోతున్నాయి, గుండె జబ్బులతో వచ్చిన వారు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు. అదేవిధంగా యూరాలజీ డిపార్ట్మెంట్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, ఆప్తనీమాలజి, డెంటల్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున హాస్పిటల్ ను చుట్టుముట్టి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక,పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య, పిడిఎస్యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎర్ర అఖిల్ కుమార్,ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, పట్టణ నాయకులు శేషగిరి తదితరులు పాల్గొన్నారు.