ప్రభుత్వ వివక్షకు నిరసనగా... 25న జర్నలిస్టుల"ఛలో హైదరాబాద్
జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా ఈ నెల 25వ తేదీన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల"ఛలో హైదరాబాద్-
ఐ అండ్ పీఆర్ ఆఫీస్
కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లలో జర్నలిస్టులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల తీవ్రమైన వివక్ష చూపుతుందని చెప్పడానికి మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనమని అన్నారు. బడ్జెట్ లో జర్నలిస్టుల సంక్షేమం ఊసే లేకపోవడం, కనీసం జర్నలిస్టుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని,హెల్త్ కార్డులు సైతం ఇవ్వలేకపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఊసే లేదని, సుప్రీం కోర్టు తీర్పు సాకుతో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తప్పుకుంటుందని ఆరోపించారు. మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ వేయలేదని, పదవీవిరమణ పొందిన పాత్రికేయులకు అనేక రాష్ట్రాలలో పెన్షన్ ఇస్తుండగా, మన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ ఇవ్వడంలేదని అన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ ను పూర్తిగా అణిచివేస్తున్నదని, గత రెండేళ్లుగా అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఆర్ ఎన్ ఐ, పీఆర్ జిఐ రిజిస్ట్రేషన్ తో నడుస్తున్న అనేక చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయడం లేదని, కనీసం ఆ పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో జర్నలిస్టులకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, జర్నలిస్టుల సంక్షేమానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వివక్ష చూపుతూ నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు.ఈ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 25న తలపెట్టిన "ఛలో హైదరాబాద్-ఐఅండ్ పీఆర్ ఆఫీస్" ఆందోళన కార్యక్రమంలో రాష్టవ్యాపితంగా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.