కక్షలు, అమానవీయ సంస్కృతిని పెంచి పోషించే  సీరియల్ ల పైన ప్రభుత ఉక్కు పాదం మోపదేందుకు ?

Mar 9, 2026 - 05:19
 0  0

కక్షలు, అమానవీయ సంస్కృతిని పెంచి పోషించే  సీరియల్ ల పైన ప్రభుత ఉక్కు పాదం మోపదేందుకు ?

కుట్రలు ,మానవ సంబంధాల విచ్ఛిన్నం,  నిరంతరం కుటుంబాల మధ్య ఘర్షణ,  అసూయ ద్వేషాల పెంచి పోషించడమేనా   నీతి బోధ , సామాజిక బాధ్యత ?

---వడ్డేపల్లి మల్లేశం 


"ఈనాడు దున్నాల్సింది  ప్రజల ఆహార అవసరాలను తీర్చే భూమిని మాత్రమే కాదు  మొద్దు వారి పోయి సామాజిక చింతనకు దూరమై  సంఘర్షణలు  కుట్రలు కుతంత్రాలతో సామాజిక విచ్చినానికి  తలపడుతున్నటువంటి మనుషుల మెదళ్లను కూడా " అంటూ ప్రముఖ అంబేద్కరిస్ట్ కత్తి పద్మారావు ఆ న్నమాటలు  నేటి సందర్భాలకు అక్షరసత్యాలు కూడా.  ఆర్థిక వ్యవస్థ,  ఉమ్మడి కుటుంబాల నుండి  కుటుంబాలు విడిపోవడం, స్వార్థ ప్రయోజనాలు పెరిగిపోవడం,  వస్తు వినిమయ సంస్కృతి గణనీయంగా పెరిగిన కారణంగా  మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగైపోతున్న తరుణంలో  అంతో ఇంతో ఉన్నటువంటి మానవ సంబంధాలను  తెగతెంపులు చేసే కార్యక్రమానికి సీరియల్లు, సినిమాలు శ్రీకారం చుట్టడం ఆందోళన కలిగించే విషయం.  ప్రజా సంస్కృతిని విచ్చిన్నం చేయడానికి తోడ్పడుతున్నటువంటి సీరియళ్లు  సినిమాల  ఉనికి ప్రదర్శన నిర్మాణము  వంటి అంశాల పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి ప్రభుత్వాలు మిన్న కుండడం,  సినిమాలను ఆకాశానికి ఎత్తడం,  సీరియల్ లను సంవత్సరాల తరబడిగా సాగదీసి  ప్రజలలో  ఆలోచనను రానీయకుండా  యాంత్రికంగా తయారు చేస్తున్న విషయం  సామాజికవేత్తలు సీరియస్ గా గ్రహించి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.  

ఆరుగాలం శ్రమించి భూమిని కష్టపడి చెమటోడ్చి  పంటలు పండిస్తూ దేశ ప్రజలకు తిండి పెడుతున్నటువంటి రైతన్న పడుతున్న బాధలు వర్ణనాతీతం, అంతేకాదు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతూ కూడా తన కర్తవ్యాన్ని విస్మరించడం లేదంటే  రైతులకు ఉన్నటువంటి సామాజిక బాధ్యత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు .కానీ   ప్రజల పల్లెములలో తెల్లటి మల్లె పువ్వు లాంటి మెతుకులను పోసి  ఆకలి తీరుస్తున్నటువంటి రైతులు ఏ రకమైనటువంటి  స్వార్థాన్ని ఎరగకుండా నిజాయితీగా బ్రతుకుతున్న సందర్భాన్ని గమనించాలి.  అయితే  మరి మొద్దు వారిపోయినటువంటి మెదడు లను దున్న ల్సిన అవసరం ఉందని  వారు ఎందుకన్నారు ఒక్కసారి పరిశీలిస్తే....  దుక్కి దున్ని  నీరు పెట్టి పంటకు అనుకూలమైనటువంటి వాతావరణ చేస్తే ఎలాంటి భూమి అయినా  పంట దిగుబడి ఇచ్చినట్లుగా  మొద్దు వారి పోయి ఆలోచన రహితంగా  గడ్డకట్టుకుపోయిన మనుషుల మెదడు ల  కూడా దున్నాల్సినటువంటి అవసరం ఉన్నదని  అప్పుడు మాత్రమే సున్నితమైనటువంటి ఆలోచనలు సమస్యలకు పరిష్కారాలు విశ్లేషణ ధోరణులు  విరాజిల్లుతాయని వాటి వల్ల మాత్రమే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుందని  విశ్లేషకుల యొక్క భావన.  ప్రపంచమంతా  అమానవీయ సంస్కృతి విస్తరిస్తూ  మానవత్వాన్ని వెతుక్కోవలసినటువంటి దుర్భర పరిస్థితులలో  ఆమాత్రం కూడా చిరునామా లేకుండా చేసే కుట్రలు కుతంత్రాలు సామ్రాజ్యవాద సంస్కృతిలో భాగంగా టీవీలలోని చర్యలు సినిమాలలో నిత్యం  మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఇక మనలో కలిగేది ఆలోచన కాదు ఆవేశం, కుట్రలు, కుతంత్రాలు,  విసుగు స్వార్థము, అసూయాద్వేషాలు, వైరము  ఇంతే కదా!  ఇన్ని దుర్గుణాలతో మో డువారిపోయినటువంటి మనిషి యొక్క మెదళ్లను  ఆలోచన సరళిని  ప్రజా సంస్కృతి వైపు మళ్ళించాలంటే కచ్చితంగా  దుక్కి దున్ని న ట్లు దున్నాల్సిందే .


   సీరియళ్లు, సినిమాల సామాజిక బాధ్యత ఏమిటి?  అవి నిర్వహిస్తున్నాయా?  ఆటంకాలు ఏమిటి ?

కాల గమనాన్ని బట్టి మనుషుల ప్రవర్తన మారాల్సిందా మనుషుల ప్రవర్తనను బట్టి కాల గమనాన్ని నిర్ణయించడమా అనేది ఇవాళ సంఘర్షణతో కూడుకున్నటువంటి అంశంగా మిగిలిపోయింది.  విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లుగా జరిగిన విషయాలను  చిత్రీకరిస్తున్నామా? చిత్రీకరించడం వలన  జరుగుతున్నాయా? అనే సందేహం రాకమానదు . ఈ సందేహం నివృత్తి కావాలంటే  వివిధ రంగాలకు చెందినటువంటి బాధ్యులు కవులు, కళాకారులు, మేధావులు, రంగస్థలం నటులు,   సామాజికవేత్తలు కూడా  సమాజంలో అలముకున్నటువంటి కుసంస్కృతిని అసూయ ద్వేషాలను  నిట్ట నిలువునా చీల్చవలసిన అవసరం ఉంది.  దానికి ఆజ్యం  పోస్తున్నటువంటి పెట్టుబడుదారి సామ్రాజ్యవాద ప్రభుత్వాల యొక్క వింత బాధ్యతారహిత ధోరణి పైన కూడా  ఉమ్మడి పోరు చేయాల్సిందే.  అయితే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో లాభం కోసమే పని చేస్తున్నటువంటి నటులు  నిర్మాతలు దర్శకులు  హీరోలు హీరోయిన్లు సిబ్బంది తారాగణం  సామాజిక బాధ్యతతో ఇలాంటి వ్యతిరేక ధోరణుల ఖండించగలరా?  అయితే నేమి  ఏ రంగమైన ఏ మాధ్యమైనా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసమే కదా ? రేడియో టీవీ సినిమా  సెల్ఫోన్ వంటి అన్ని మాధ్యమాలు కూడా ప్రజల సంక్షేమం అభివృద్ధి నాగరికత సంస్కృతిని పెంపొందించడానికి, దానికి భిన్నంగా వ్యవహరించే ప్రవర్తించే ఏ రకమైనటువంటి శక్తులనైనా తిప్పికొట్టడానికి. ఆ తిప్పికొట్టే అధికారం బాధ్యత ప్రజలకు ఉంటుంది అయితే ప్రభుత్వాలు కొంతమందిని  పెంచి పోషిస్తూ  సమాజం ఎటు పోతేనేమీ అనే ఆలోచనతో ఉండడం వల్లనే నేడు  సినిమాలో సీరియల్లో జరిగినటువంటి సన్నివేశాలకు నిజరూపాలు సమాజంలో జరుగుతున్నాయి.

 ఇంకా ఆ దుర్గుణాలను  చెడు ప్రవర్తనను ఇలా నిర్వహించాలి ఏ రకంగా అమలు చేయాలి అని చెప్పడానికి సీరియల్లో సినిమాలలో ప్రత్యేకంగా చేసి చూపించడం, నటించడం, ప్రవర్తించడం, అసూయని వ్యక్తం చేయడం ,కుటుంబాలను విచ్చినం చేయడం వంటి అనేక కళారూపాలు  కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి ప్రజలు వాటిని ఆచరించకుండా మౌనంగా ఉంటారా?  మనిషి మొదలే స్వార్థపరుడు ఆ స్వార్థానికి అవకాశం కోసం అర్రులు  చా స్తున్న సందర్భంలో దొంగ అవకాశాలు , దోపిడీ సంస్కరణలు , కుళ్ళు రాజకీయాలు,  లంగ మాటలను  మీడియాలో టీవీ ప్రసారాలు సినిమాల ద్వారా చూస్తూ నేర్చుకుంటున్న తరుణంలో  మనిషి మృగం , ఖడ్గమృగం కాక మరేమ అవుతాడు?  దానివల్లనే నిరంతరం జరుగుతున్నటువంటి  హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు , చిన్నారుల పైన దా స్టీకాలు, నయవంచన  పేద అట్టడుగు వర్గాలపైన కావాలని  జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు  నిరంతరం దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని అదుపు చేయలేని పాలకులు మౌనంగా ఉంటూ  పైగా వాటిని  పెంచి పోషించడానికి దోహదకారులవుతున్నటువంటి క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు,  సిల్లీ డాన్సులు,  మధ్యము, మత్తు పానీయాలను  అర్ధరాత్రి దాటేవరకు కూడా అనుమతించి  ప్రభుత్వానికి ఆదాయం కోసం ఆరాటపడుతూ ప్రజల యొక్క బాగోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. దాని పర్యవసానంగా తెల్లవారేసరికి ఎన్ని హత్యలు మరె న్ని ఆత్మహత్యలు మరె oత మంది రోడ్డు ప్రమాదాలలో  విగత జీవులవుతున్నా రో    కళ్లారా   చూడవచ్చు .  

బాధ్యత మరిచిన ప్రజలతో సహా పాలకులు కూడా నేరస్తులే.  నేరం చేసే వాళ్ళు మాత్రమే కాదు నేరం చేస్తున్నప్పుడు చూస్తున్న వాళ్లు కూడా నేరస్తులే అనే కనీస న్యాయ సూత్రం ప్రకారంగా  అలాంటి అనేక అవకాశాలను కల్పిస్తూ,  యువతను చెడు వైపు ప్రోత్సహిస్తూ,  ఉపాధి అవకాశాలకు దూరంగా  ఆకర్షణ ప్రచార ప్రసార కార్యక్రమాలకు మాత్రమే పెనుగులాడుతున్నటువంటి ప్రభుత్వాల కారణంగా కూడా యువత   వృద్ధులతో సహా అన్ని వర్గాల వారు కూడా బాధ్యులవుతున్నారు. బాధితులు కూడా అవుతున్నారు ఇది  మరింత గందర గోలానికి దారితీస్తున్నది.  సామాజిక బాధ్యత ఉన్నదని భావిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపాలి . అమానవీయ సంస్కృతికి అడ్డం పడుతున్నటువంటి వ్యాపకాలను పూర్తిగా నిషేధించాలి.  దమ్ముంటే మద్యపానాన్ని నిషేధించి,  మత్తులో కూరుకుపోయి అనేక కుటుంబాలు వీధిపాలవుతున్నటువంటి సామాజిక దురాచారాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలి.  

ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలవుతుంటే దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అడ్డం వచ్చిన సమస్య ఏమిటి ? వ్యతిరేకించిన వైరీ వర్గం ఎవరు ? అనారోగ్యం బారిన పడి  యజమానిని కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతుంటే అనేకమంది ఆరోగ్యాలు ఆ భాస్ పాలై   శవాలుగా మారుతూ ఉంటే  ఎముకల గూడులా కనపడుతూ ఉంటే  అప్పుల పాలై  బికారులుగా బిచ్చగాళ్ళుగా   తిరుగుతూ ఉంటే  చూసి ఆనందించాలని కోరిక ప్రభుత్వానికి ఉందా?  ఈ కార్యరంగంలో ప్రధాన భూమిక  పోషిస్తున్నటువంటి కవులు రచయితలు కళాకారులు నటులు గాయకులు కూడా  తమ సంపద కోసం ఉపాధి కోసం డబ్బుల కోసం మాత్రమే ఆరాటపడడం తప్ప సమాజానికి ద్రోహం జరుగుతున్నది నిజం  కా దా? అని తమ వ్యక్తిత్వాన్ని తమ లక్షణాలను దుర్ఘుణాలను మార్చుకుందామని ఇప్పటికీ ఆలోచించకపోవడం ఎo తవరకు సమంజసం ? అనేక సందర్భాలలో  సినిమా ప్రదర్శనల వేల తొక్కిసలాటలో  ఎంతోమంది చనిపోయిన కూడా ఇంకా  గుణం మారలేదంటే  ఆలోచన రాలేదంటే  ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగాలని చూసేవాళ్లంతా కూడా నయవంచకులే!  మనకు మనము అందరం ఎటువైపు ఒకసారి ఆలోచించుకుందాం ! నయ వంచ కులమా? అభివృద్ధి  ప్రోత్సాహకులమా? మనమే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది .చరిత్ర మాత్రం క్షమించదు తప్పటడుగులు వేస్తే జాగ్రత్త ! .


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333