సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగ వాలినా సహించే ప్రసక్తి లేదు
- న్యాయవాదుల రక్షణ చట్టం చారిత్రాత్మకం
- ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట:తెలంగాణ రాష్ట్ర చరిత్రలో న్యాయవాదుల రక్షణ చట్టం ఒక మైలురాయి అని, దీనిని పాస్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యాపేటలో న్యాయవాదులు పార్టీలకతీతంగా ముక్తకంఠంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మురిసెట్టి నివేదిత లక్షాది లు హాజరై మాట్లాడుతూ సాధారణంగా న్యాయవాదులు ఒక వర్కింగ్ డే రోజున ఇంత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చాలా కష్టమని, కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా అమలు చేసి చట్టాన్ని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశంలోనే రాజస్థాన్, కర్ణాటక తర్వాత మూడోసారి తెలంగాణలోనే ఈ చట్టాన్ని తీసుకువచ్చారంటే, న్యాయవాదులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు.
న్యాయవ్యవస్థలో న్యాయవాదులు పిల్లర్ల వంటి వారని, పిల్లర్లు లేకపోతే ఏ బిల్డింగ్ నిలబడదన్నారు. గతంలో తన తండ్రి స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు కూడా ఎల్లప్పుడూ న్యాయవాదుల పక్షాన నిలబడి పోరాటం చేశారని, ఏ సమస్య వచ్చినా న్యాయవాదులతో భుజం భుజం కలిపి నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు. సూర్యాపేటలో ఒక పెద్ద కోర్టు భవన నిర్మాణం కోసం ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అతి త్వరలోనే ఈ భవనానికి శంకుస్థాపన చేసి, ఏడాది లేదా ఏడాదిన్నర కాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కొత్త చట్టం అమలులో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, సూర్యాపేటలో ఏ లాయర్ మీదైనా ఈగ వాలినా సహించే ప్రసక్తి లేదని, ఎస్పీ, డీఎస్పీల సహకారంతో న్యాయవాదులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు ఇటీవల పార్లమెంట్ సభ్యులు కుందూరి రఘువీర్ రెడ్డి గారితో కూడా చర్చించానని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ప్రస్తావించేందుకు సూర్యాపేట బార్ అసోసియేషన్ వారు ఒక సమగ్రమైన సమ్మరీ డ్రాఫ్ట్ సిద్ధం చేసి ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నూక సుదర్శన్ రెడ్డి,ఉమాపతి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, తళ్లమళ్ళ హస్సేన్, బొమ్మగాని శ్రీనివాస్, వి.వి. రావు, టేకుపల్లి శ్రీనివాసరావు, మధుబాబు, డప్పు మల్లయ్య, బత్తిని వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.