విత్తు ముందా చెట్టు ముందా చందం కాకుండా ప్రజాస్వామ్య విలువలను అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి.
విత్తు ముందా చెట్టు ముందా చందం కాకుండా ప్రజాస్వామ్య విలువలను అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి.
ఓటర్లను విమర్శించే ముందు తమ ఉనికికి కొలమానం ప్రజాసేవ, సామాజిక చింతన అని గుర్తిస్తే ప్రజలు అభ్యర్థులు నిందలపాలు కారు.
---- వడ్డేపల్లి మల్లేశం
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ స్థాయి ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి అవినీతి బంధుప్రీతి డబ్బు చలామణి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం ఓటర్లే తమ లబ్ధి కోసం నాయకుల పైన ఆధారపడి డిమాండ్ చేసినట్లుగా పత్రిక ప్రకటన రావడం వంటి అంశాలు మొత్తం మీద అంబేద్కర్ ఆశించినటువంటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నది అనడంలో సందేహం లేదు . అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారు తమ ప్రజాస్వామ్య బాధ్యతలను నిర్వహించడం ద్వారా ప్రజా సంపదను ప్రజలందరికీ సమానంగా పంచవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ఆ క్రమంలో వాళ్లు వేతనం తీసుకోవడంతో పాటు ప్రజాసేవే పరమావధిగా వృత్తిలోకి వస్తున్నట్లుగా ప్రకటిస్తున్నారు కూడా. గతంలో ఈ నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చిన సందర్భాలు ఉండేది. కానీ ఇటీవల రెండు మూడు దశాబ్దాలుగా గమనించినప్పుడు స్థానిక ఎన్నికలతో పాటు శాసనసభ, ఎమ్మెల్సీ వరకు కూడా ఎన్నికల సందర్భంలో ప్రలోభాలకు ఓటర్లను గురి చేయకుండా అభ్యర్థులు పోటీలో నిలబడిన దాఖలాలు కనిపించడం లేదు .
డబ్బు ఇవ్వనిదే అభ్యర్థులు ఓటు వేయరని తమ గెలుపు కోసం తాము తప్పకుండా ఇవ్వవలసి వస్తున్నదని అభ్యర్థులు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇక అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారు గెలిచిన తర్వాత కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని, ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసమే రాజకీయాలకు వస్తున్నారు తప్ప ప్రజాసేవ కోసం కాదని, అలాంటప్పుడు ఎందుకు ఓటు ఉచితంగా వేయాలి? అనే ఒ క దుర భిప్రాయాన్ని ప్రజల్లో కలిగించి నటుల ఇటీవలి రాజకీయ పరిస్థితులను అంచనా వేయవలసి ఉంది. దాన్ని అవగాహన చేసుకోవడం కూడా అవసరం. మూలం వెతికి చికిత్స చేస్తే రోగాలు నయమైనట్లుగా ఈ ఎన్నికల ప్రక్రియ ఇంత అపహాశ్యo పాలు కావడానికి కారణాలను అన్వేషించవలసినటువంటి అవసరం క్రింది స్థాయి నుండి సామాజికవేత్తలు విశ్లేషకుల వరకు కూడా ఉన్నది . "ఇక భారతదేశంలోని అనేక రకాల ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన పదవుల ఎంపిక అనేది ఎన్నికలు నిర్వహించడం కాకుండా పదవులకు కోట్ల రూపాయల ను నిర్ణయించి సవాల్ పాట పాడాలని ఆ రకంగా ఎవరై తే ఆ పాటను అందుకుంటారో వారికే ఇస్తే సరిపోతుంది కదా! ఇక ఎన్నికల ఖర్చు ఉండదు , ప్రజలను ప్రలోభ పెట్టేది ఉండదు, ఓటర్లకు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రచారాలు ఆర్భాటాలు మైకు సప్పుల అవసరం లేదు కదా! "అని ఇటీవల కొందరు పత్రికలో వ్యాఖ్యానాలు చేయడం కూడా రాజకీయ రంగంలో గుణపాఠం రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది.
ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా సమయస్ఫూర్తి, మేధస్సు, అవగాహన విద్య, సామాజిక స్పృహ ఉన్న వాళ్లను కాకుండా మొక్కుబడిగా ఎంపిక చేయడం వలన వారు ఎన్నికైన తర్వాత ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తారో, ఏ రకమైన సామాజిక చింతనతో సేవ చేస్తారో అర్థం కాని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 75 సంవత్సరాల గణతంత్ర దేశంలో ఇప్పటికి నిరక్షరు లు 30 శాతానికి పైగానే ఉన్నారంటే మనం ఏం ఉద్ధరించినట్లు? ఏం సాధించినట్లు? అర్థం కాని పరిస్థితి. ఇక మరొకవైపు చదువుకొని అక్షరాస్యత కలిగి విజ్ఞానవంతులై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన స్థాయిలో ఉండి కూడా ఎంపికైనటువంటి అభ్యర్థులు ప్రజాప్రతినిధులు ప్రజల డిమాండ్లను సమస్యలను పక్కనపెట్టి తమ అధినాయకత్వం చెప్పు చేతుల్లో పనిచేయడం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయనే వైఫల్యం కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. అందుకే ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, గమనం, పరిపాలించే తీరు, ప్రజాసంపదను కొల్లగొడుతున్న విధానం, అవినీతికి ఆజ్యం పోస్తున్న తీరు చూసినప్పుడు నేర స్వభావం కలిగిన వాళ్ళు లేదా నేరస్తులని ముద్రపడ్డ వాళ్ళు కూడా చట్టసభలలో నిండుగా ఉంటున్నారంటే ఈ చట్టసభలు లేదా కింది స్థాయి వరకు పరిపాలన సంస్థలు ఏ వర్గ ప్రయోజనం కోసం పని చేస్తాయో అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు ఎన్నికల సమయంలో అవినీతి కారణంగా గెలిచిన అభ్యర్థులు తిరిగి తమ స్వప్రయోజనానికి సంపాదనను కూడబెట్టుకోవడానికే పనిచేసే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. మరొకవైపు " గెలిచినటువంటి అభ్యర్థులలో నేరస్తులు నేర స్వభావం కలిగిన వాళ్లు పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనం కోసం పాకులాడే వాళ్లే హెచ్చు సంఖ్యలో ఉన్న కారణంగా వాళ్లు కూడా ప్రజలను జలగల్లా పీల్చి ప్రజా సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసి పెట్టుబడిదారీ ప్రైవేటు వర్గాన్ని పెంచి పోషించడానికి తప్ప సామాన్య అట్టడుగు ప్రజల కోసం పనిచేస్తారని ఆశించడం కూడా అత్యాశే అవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న సుగుణాలను వర్ణించుకోవడానికి తప్ప ఆచరణలో అలంకారంగా మిగిలి పోవడం బాధాకరం. అందుకే అంబేద్కర్ గారు ఒక సందర్భంలో ప్రజాస్వామ్యానికి ఉన్న మౌలికమైన సుగుణాలను పాలకులు విస్మరిస్తే దేశ సంపదను హరించి ద్రోహం చేస్తే ప్రజాస్వామ్యం కూడా ఓడిపోయినట్లే .అప్పుడు ప్రజలు తప్పకుండా తమ హక్కుల రక్షణ కోసం, ఉనికి కోసం, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ కోసం ఆ పాలనను తుడిచివేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు అని కూడా హెచ్చరించడం బహుశా ఇందుకేనేమో" ఆ సమయం ఆసన్నమైనదని ఆలోచిస్తే తప్పులేదు.
కొన్ని కుటుంబాలు వారసత్వంగా దశాబ్దాల తరబడిగా ప్రజా పాలనా రంగంలో పనిచేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుని శాశ్వతం చేసుకుంటే మెజారిటీ వెనుకబడిన అట్టడుగు ఆదివాసీలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఇప్పటికీ చట్టసభల గడప దాటని కులాలు కుటుంబాలు అనేకం. కారణం ఎన్నికల ప్రక్రియ మరింత ఖర్చుతో కూడుకున్నది కావడం వలన ఆ వైపు ఆ కుటుంబాలు కన్నెత్తి కూడా చూడడం లేదు. రిజర్వేషన్ పుణ్యమా అని కొన్ని పేద కుటుంబాలు ఇటీవల కాలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నప్పటికీ కోట్లాది ప్రజలకు ఇప్పటికీ చట్టసభలు, పరిపాలన , ప్రభుత్వ కార్యాలయాల మనుగడ తెలవకపోవడం విచారకరమే కదా! అందుకే ఈ సమస్యలన్నింటికీ అంబేద్కర్ గారు "ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే జాగరూకులైన ప్రజావళి చాలా అవసరం" అని ఏనాడు నొక్కి చెప్పడం జరిగింది కానీ అదే ప్రజానీకం ఇవ్వాలా పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదరికానికి గురవుతూ విధిలేని పరిస్థితిలో ఎన్నికల సమయంలో బలహీనత కారణంగా లేదా అభ్యర్థుల యొక్క ప్రలోభాలకు బానిసలుగా మారి ఉనికి కోసం ఖర్చులకోసం కనీస అవసరాల కోసం వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశపడక తప్పడం లేదు.
పాలకులు ప్రజలను ప్రభువులు గా చూడాల్సింది పోయి యాచకులుగా చూస్తున్న కారణంగా ప్రజా సంపదను ప్రజలకు పంపిణీ చేయడంలో విఫలమౌతూ పెట్టుబడిదారీ వర్గాలకు పంపిణీ చేస్తూ పేదల మరింత పేదరికంలోకి నెట్టుతున్న కారణంగా ఈ అడుక్కుతినే దుస్థితి దాపూ రిస్తున్నది .ఈ ప్రవాహములో మధ్యతరగతి పై స్థాయి వాళ్ళు కూడా కొట్టుకుపోతున్నారనడంలో సందేహం లేదు. ఎన్నికల సంఘం కూడా తన బాధ్యతను సక్రమంగా వినియోగించక , జరుగుతున్న అవినీతిని నియంత్రించే విషయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వలన కూడా ఈ అవినీతి మితిమీరీ కేవలం లక్షలు కోట్లు ఉన్న వాళ్లు మాత్రమే అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన దుస్థితి దాపురించింది. అందుకే రాజకీయాల్లోకి పరిపాలనలోకి పెట్టుబడిదారులు డబ్బున్న కోటీశ్వరులే వస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
"కనీసం రాబోయే తరాలనైనా ఓటర్లుగా నిజాయితీగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి. అది పాఠశాల స్థాయి నుండి ప్రారంభం కావాలి . ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి . రాజకీయ పార్టీలు కూడా అర్హులైనటువంటి పేదలకే ఎక్కువగా అవకాశాలు కల్పించాలి . గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి ఢిల్లీ ఇతర రాష్ట్రాల్లో గెలుపొందిన వాళ్లు సామాన్య మధ్యతరగతి వ్యక్తులేనన్న విషయం మర్చిపోలే0. అలాంటి రోజులు రావాలి పేదలు అభ్యర్థులుగా నిలబడి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రులుగా ఎన్నికయ్యే పరిస్థితులు రావాలి . అంతకుమించి దేశ సంపదను ప్రజలకు సమానంగా పంపిణీ చేయగలిగిన పరిస్థితులు ఉంటే పేదరికం నిర్మూలించవచ్చు. ప్రలోభాలకు గురికాకుండా చూడవచ్చు. రాజకీయ నాయకులు చేస్తున్న ప్రలోభాలను కట్టడి చేయవచ్చు."
ఇదంతా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లు కాకుండా కట్నం ఇచ్చిన వాడు పుచ్చుకున్నవాడు నేరస్తులే అన్నట్లు ఎన్నికల సమయంలో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఇద్దరు కూడా నేరస్తులే అనే విధంగా నూతన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. అక్రమంగా సంపాదించే వాళ్లు కనుక వాళ్ల దగ్గర తీసుకుంటే తప్పేమిటి? అనే దుర్భావన ప్రజల్లో, ఎన్నికల్లో ఖర్చయినటువంటి లక్షల రూపాయలను అధికారం వచ్చిన తర్వాత సంపాదించుకోవచ్చులే అనే ఆలోచన అభ్యర్థులలో తొలగించవలసినటువంటి అవసరం మాత్రం తప్పకుండా ఉంది. అప్పుడు ప్రజాస్వామిక విలువలు కాపాడబడతాయి ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది ."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరస0 రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )