భూమి విక్రయాలపై చర్యలు తీసుకోవాలి
తిరుమలగిరి 20 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- నాగారం మండలం ఈటూరు గ్రామ పరిధిలోని ప్రగతి నగర్ సమీపంలో ఉన్న సర్వే నంబర్లు 125 నుంచి 130 వరకు ఉన్న సుమారు 20 ఎకరాల భూమిపై వివాదం మరింత ముదురుతోంది.బాధితురాలి భర్త మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ భూమి ఇప్పటికే కోర్టు పరిధిలో ఉండగా, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తం ఎనిమిది మందికి ఈ భూమిపై హక్కులు ఉన్నాయని, అందులో తనకు 5 ఎకరాల వాటా ఉందని తెలిపారు.అయితే తన భార్య సుమిత్రమ్మకు రావాల్సిన వాటాను పంచి ఇవ్వకుండా, ఆమె అన్నదమ్ములు తమ ప్రమేయం లేకుండా భూమిని విక్రయిస్తున్నారని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ముఖ్యంగా, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వెంచర్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఎలా మంజూరు చేశారనే అంశంపై ఆయన అధికారులను ప్రశ్నిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కూడా ఆరోపించారు.మరోవైపు, కోర్టు ద్వారా తుదితీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నారు. అక్రమంగా జరుగుతున్న భూమి విక్రయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు