వరి కొయ్యలు తగులబెట్టడం పై చర్యలు తీసుకోవాలి

Jun 12, 2026 - 00:03
Jun 12, 2026 - 00:51
 0  1
వరి కొయ్యలు తగులబెట్టడం పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూర్ (ఎస్) 12 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :-  వరి కొయ్యలు తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంట పొలాల్లో వరి కొయ్యలను తగులబెట్టవద్దని పోలీసు శాఖ, వ్యవసాయ అధికారులు పలుమార్లు అవగాహనకల్పిస్తున్నప్పటికీ, కొందరు రైతులు వాటిని పట్టించుకోకుండా వరి కొయ్యలను దహనం చేస్తున్నారు. ఆత్మకూరు మండలం దుబ్బ తండాలో తాజాగా వరికొయ్యలను తగులబెట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రైతులకు గ్రామ సమావేశాలు, పొలం స్థాయి అవగాహన కార్యక్రమాల ద్వారా వరి కొయ్యలు తగులబెట్టడం వల్ల కలిగే నష్టాలపై వివరించినప్పటికీ, కొందరు అదే పనిని పునరావృతం చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ చర్యలకు పాల్పడిన వారిపై రూ.5,000 వరకు జరిమానాలు విధిస్తున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా వరి కొయ్యలను దహనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వరి కొయ్యలను తగులబెట్టడం వల్ల గాలి కాలుష్యం పెరిగి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.అంతేకాకుండా భూమిలోని సూక్ష్మజీవులు నశించి, నేల సారవంతత తగ్గిపోతుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే ఈ చర్యలను రైతులు స్వచ్ఛందంగా మానుకోవాలని, వరి అవశేషాలను సేంద్రియ ఎరువుల తయారీకి లేదా ఇతర ఉపయోగాలకు వినియోగించాలని పలువురు సూచిస్తున్నారు.పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, రైతులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333