పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం పెంచాలి
కుంగిపోయిన కల్వర్టుకు తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ అంకిత్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
మంగళవారం ఆళ్ళపల్లి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఆళ్ళపల్లి మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం వివరాలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ప్రీ-ప్రైమరీ విభాగం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందిస్తున్న బోధన విధానం, విద్యా కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందించేందుకు సిద్ధంగా ఉంచిన భోజనం, పాలు, బాలామృతం తదితర పోషకాహార పదార్థాలను పరిశీలించారు. కేంద్రంలో కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన కలెక్టర్, హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పెద్ద వెంకటాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.గొత్తికోయలు నివసించే ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో బడిఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పాఠశాల ఆవరణలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, పిల్లల సంఖ్య, వారికి అందిస్తున్న సేవలు, పోషకాహార సరఫరా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ అధిక మొత్తంలో నిల్వలు ఉండటాన్ని గమనించి, అవసరానికి మించి ఉన్న సరుకులను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు తరలించాలని సూచించారు. అలాగే కేంద్రాల్లో పిల్లల చేరికలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పరిశీలన సందర్భంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, అంగన్‌వాడీ కేంద్ర భవనానికి పెయింటింగ్ వేయించి పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా, పోషకాహార సేవలు అందేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆళ్ళపల్లి నుండి పెద్ద వెంకటాపురం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కుంగిపోయి ఉండటాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గమనించారు. వెంటనే వాహనం దిగి కల్వర్టును పరిశీలించిన కలెక్టర్, వర్షాకాలంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసరంగా మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాఫీగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆళ్లపల్లి తాసిల్దారు ఉషారాణి, ఎంఈఓ శాంతారావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.