రేవంత్ అక్రమాల చిట్టా బయట పడుతుందనే భయమా?
పీఏసీ చైర్మన్ పీఠం హరీశ్ రావుకు దక్కితే పుట్టి మునుగుతుందనే రేవంత్ టీమ్ హైరానా
పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) అసెంబ్లీ, కౌన్సిల్ కమిటీల్లోనే అత్యంత పవర్ ఫుల్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఈ పదవి ఇవ్వడం సభా సంప్రదాయం.
పీఏసీ చైర్మన్ గా ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరిని నియమించాలో ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసే జమ ఖర్చులను పీఏసీ ఆడిట్ చేస్తుంది. ఈ క్రమంలో ఒక లెక్క పత్రం లేకుండా సాగుతున్న రేవంత్ ప్రభుత్వం గుట్టు మొత్తం ఈ కమిటీ చేతిలో ఉంటుంది. ఈ కమిటీకి హరీశ్ రావు లాంటి ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటే రేవంత్ అండ్ కో సర్కారును అడ్డం పెట్టుకొని సాగిస్తున్న లెక్కలన్నీ బయట పడతాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును పీఏసీ చైర్మన్ కాకుండా పన్నాగాలు చేశారు.
బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి అప్పగించారు. తర్వాత తమ దందాలన్నీ యథేచ్ఛగా సాగి పోవాలని చూశారు రేవంత్.
పీఏసీ సభ్యుల ఎన్నిక 'రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ' రూల్ 250 ప్రకారం "Principle of Proportional representation by means of single Transferable vote ద్వారా జరగాలి.
రూల్ 250 ప్రకారం 9 మంది పీఏసీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఎన్నుకోవాలి. బీఆర్ఎస్ సభ్యులు 38 మంది కాగా.. ముగ్గురు సభ్యులు పీఏసీ కి ఎన్నికవుతారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీ అసెంబ్లీ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ సభ్యుడే.. ఆయన బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయలేదు.
సీఎం రేవంత్ ప్రోద్బలంతో గుట్టుచప్పుడు కాకుండా వేసినా.. ఆయనకు 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఎన్నుకోవాలి. సోమవారం పీఏసీతో పాటు మరో రెండు ఫైనాన్స్ కమిటీలను నామినేట్ చేసినట్టుగా అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇలా ఏకపక్షంగా బులెటిన్ ఇవ్వడం అంటే అసెంబ్లీ రూల్స్ ను తుంగలో తొక్కడం. అది కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజు చేయడం అంటే ప్రజాస్వామ్యం పై, రాజ్యాంగం పై ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏ పాటిదో తేలిపోతుంది.
పీఏసీ చైర్మన్ నియామకం విషయం లో సీఎం నిర్ణయానికి స్పీకర్ తలొగ్గారా.. అదే నిజమైతే స్పీకర్ పదవికి ఉండే స్వాతంత్రత పైనే వేలు, లక్షలాది అనుమానాలు తలెత్తుతాయి. అది చట్టసభల గౌరవ మర్యాదలను దెబ్బతీస్తుంది.
1958-59 నుంచి ప్రతిపక్ష సభ్యుడిని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీ అని "Telangana Legislative Assembly Handbook for Members" page 65 లో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన పార్టీ ఫిరాయించిన గాంధీ పై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాల్సిన స్పీకర్ అలాంటి ఎమ్మెల్యేకు బాధ్యతాయుతమైన పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమే కాదు.. అనైతికం.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంటరీ నియమాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. 2014, 2019లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా కాంగ్రెస్ పార్టీ సభ్యులకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చింది. ప్రస్తుత లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ను ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సూచన మేరకు పీఏసీ చైర్మన్ గా నియమించారు.
రాజ్యాంగం పై మోదీ ప్రభుత్వం దాడి చేస్తోందని.. దానిని కాపాడుతామని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులంతా భారత రాజ్యాంగం ప్రతిని పట్టుకొని ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రాజ్యాంగాన్ని పట్టపగలు అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగం ప్రతి పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారు?!!