తుంగభద్ర, కృష్ణ నది పక్కనే ఉన్నా 50 ఏళ్లలో కాంగ్రెస్ నీళ్లెందుకివ్వలే..?

జోగులాంబ- గద్వాల 19 నవంబర్ 2023 తెలంగాణ వార్త ప్రతినిధి:- తుంగభద్ర, కృష్ణా నదులు పక్కనే ఉన్నా 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ నీళ్లు ఎందుకివ్వలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ వస్తే ధరణిని కూడా తీసివేసి బంగాళాఖాతంలో వేస్తరట. ధరణిని తీసివేసి మళ్లీ పాత పద్ధతి తెస్తరట. ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి.. మల్లయ్యది పుల్లయ్యకు రాసి మనల్ని కోర్టుల చుట్టూ తిప్పేందే కదా? మేం రైతుబంధును హైదరాబాద్‌లో విడుదల చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉంటున్నయ్‌’ అన్నారు.

కాంగ్రెస్‌ వస్తే మళ్లీ గోల్‌మాల్‌

‘ధరణిని తీసివేస్తే రైతుబంధు డబ్బులు ఎలా వస్తయ్‌? ఏ పద్ధతిలో వస్తయ్‌ ? మళ్లీ పట్వారీలు, వీఆర్వోలు, పహానీ నకలు.. మళ్లీ ఇదే కార్యక్రమం. ఇంకో పని లేదు. కాంగ్రెస్‌ వస్తే దళారీ రాజ్యం. పైరవీకారుల రాజ్యం. నీ భూమి ఇంకొకరికి రాస్తరు. వేల రూపాలు లంచాలు అడుగతరు. మళ్లీ గోల్‌మాల్‌ అవుతుంది. జాగ్రత్తగా బీఆర్‌ఎస్‌ గెలిపిస్తే మీకు అన్ని రకాల లాభాలు జరుగుతయ్‌. మీకు తాగునీటి సదుపాయం గతంలో ఎలా ఉండే? మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాను బిగించి నీళ్లు ఇస్తున్నం. ఆ సదుపాయం అలాగే ఉండాలంటే బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉండాలి. మీరు తుంగభద్ర, కృష్ణ పక్కకు ఉంటరు. మీకు కూడా నీళ్లు ఎందుకివ్వలేదు 50 ఏళ్ల పరిపాలన. మంచినీళ్లన్న ఇచ్చారా కనీసం. బిందెలు పట్టుకొని బోరింగులు కొట్టి సచ్చిపోయినం. మంచినీళ్లు కూడా ఇవ్వలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే పరిపాలన కొనసాగించుకుంటే లాభం

‘ఇవాళ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కులం, మతం, చిన్నాపెద్ద లేకుండా అన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చి నీరు సరఫరా చేస్తున్నాం. ఇంత మంచి పరిపాలన కొనసాగించుకుంటే లాభం జరుగుతుంది. కొనసాగించుకోకపోతే నష్టపోతం. మేం పదేళ్లు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే వ్యక్తి.. పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి. మనుషుల్లో మనిషిలా కలిసి ఉండేవాడు విజయుడు గెలిచినట్లయితే ప్రజలు గెలిచినట్లవుతుంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విజయుడిని ఆశీర్వదించి దీవించి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించండి. అలంపూర్‌కు నేనే స్వయంగా వచ్చి కూర్చొని ఒకరోజు మీ మధ్యలోనే ఉండి మీ పనులన్నీ పూర్తి చేసిపెడుతాను’ అంటూ భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చైర్మన్లు జడ్పిటిసిలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.