భిన్నత్వంలో ఏకత్వంగా జీవించాలి

అంతరాలు, అసమానతలకు అతీతంగా మానవతా విలువలతో వ్యవహరించాలి.

జీవితం ఒకటే...  సవాలుగా స్వీకరించు!  నీ ఉనికిని విశ్వవ్యాప్తం చేసుకో!

వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం  అంటూ జీవన యానాన్ని  విభజించుకోవచ్చు.  కొందరు తమ కుటుంబాలను,  మరికొందరు తమ శరీరాలను,  వ్యక్తిగత అవసరాలను, ఆకాంక్షలను కూడా పక్కనపెట్టి  వ్యవస్థ కోసం జీవించేవారు  మెరుగైన వ్యవస్థను ఆకాంక్షించేవాళ్లు  నిరంతరం ఆ క్రమంలో పోరాడే వాళ్లు కూడా మనకు తారసపడతారు.  స్వాతంత్ర పోరాటం ,తెలంగాణ సాయుధ పోరాటం,  నక్సల్బరీ పోరాటం, శ్రీకాకుళం రైతాంగ పోరాటం,  మే డేకు సంబంధించినటువంటి కార్మిక వర్గ పోరాటాలు  అందులో

భాగస్వామి అయిన వారి జీవితాలు ఒక్కసారి ఆలోచిస్తే  వారిదంతా కూడా సామాజిక జీవితమే అని  నిర్వచించుకోవలసి ఉంటుంది  .వ్యక్తిగతంగా తన కుటుంబ అవసరాలను తీర్చుకోవడం , అందుకు సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషించడం,  ఇతర కుటుంబాలు సమాజంలోని భిన్న వర్గాలతో సహ సంబంధాలను కొనసాగించడం,  అవసరాలను వృత్తుల వారీగా  ఆర్థిక పరిస్థితుల ఆధారంగా పరస్పరం తీర్చుకోవడం  ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రక్రియ.
  కొంతకాలం వెనుకకు వెళ్ళినట్లయితే  ఇప్పటికంటే మరింత  ఉన్నతంగా, కలిమిడిగా , ప్రేమానురాగాలతో,  ఆత్మీయంగా పలకరించుకునే కుటుంబాలు ఆనాడు  ఎక్కువ . కుల మతాలకు అతీతంగా  తోటి మనిషిని సాటి మనిషిగా చూసే  సహృదయత్వం  ఎల్లెడలా కనిపించేది.
    కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం  కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు , ఇరుగుపొరుగు వారితో గల  బంధాలు  పూర్తిగా విషపూరితమై  నిర్వీర్యమై  కుటుంబ సభ్యులు తమలో తామే  సహృదయంగా జీవించలేని  వృద్ధులు పెద్దలను  ఆదరించలేని గడ్డు పరిస్థితులను ప్రస్తుత వ్యవస్థ ఎదుర్కొంటున్నది . ఈ క్రమంలో  ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించినట్లయితే,  ఎక్కడికక్కడ ప్రక్షాళన జరగకపోతే , మనలో మనం సంస్కరించుకోకపోతే  రాబోయే తరాలు  బ్రతకడం యాంత్రికమే కాదు  ఇబ్బంది కరం కూడా  .
     భిన్నత్వంలో ఏకత్వంగా   రాణించాలి :-
********
కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న భారతదేశంలో  వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమో అంతకు మించిన స్థాయిలో సామాజిక జీవితం కూడా అoతే. చట్టబద్ధంగా కాకపోయినా నైతికంగా మానవతా కోణంలో ఆలోచించినప్పుడు  భి న్న వర్గాలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో  అల్ప సంఖ్యాకులు, ఆదివాసీలు, పేదలు, వలస కూలీలు,  దినసరి కూలీలు, చిరు వ్యాపారులు,  బిచ్చగాళ్లు ,బానిసలు,  కట్టు బానిసలు,  దారిద్రరేఖ దిగువన ఉన్నటువంటి అశేష ప్రజానీకం  తమ తమ హక్కులను రక్షించుకోవాలన్నా  మనిషిగా బ్రతకాలన్నా  సంస్కరణ ప్రక్షాళన సామాజిక కోణం మానవతా విలువలు  అనివార్యంగా మనం భావించాలి . ఈ కోణంలో మేధావులు బుద్ధి జీవులు సామాజిక సంస్కర్తలు మానవతావాదులు  జరుపుతున్న విశేష కృషికి  తోడుగా చట్టాల పరంగా  నైతికంగా మరింత తోడ్పాటు అవసరమై ఉన్నది. అయినప్పటికీ    వ్యక్తితోనే ఆరంభమై  ఈ వ్యవస్థను మార్చుకోవడం అనివార్యం .
      అంతరాలు, అసమానతలు, వివక్షత, దోపిడీ, పీడన, వంచన వంటి అనేక సామాజిక రుగ్మతలతో ఈ సమాజం  కొనసాగుతున్నది.  దీనికి భిన్నమైన మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని ఆవిష్కరించుకోవడం కోసం,  అసమాన తలను నిర్మూలించడం కోసం,  చట్ట పరిధిలో ఎంత కృషి జరగాలో అంతకు మించిన స్థాయిలో  భిన్నత్వంలో ఏకత్వాన్ని సాగించే క్రమంలో కూడా  సమాజం ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  ముందుగా తో టి వ్యక్తిని మనిషిగా  ఆదరించి,  ప్రేమగా పలకరించి,  కష్టాలలో ఓదార్చి , కనీస నైతిక మద్దతు ఇవ్వడం  అంతరాలు అసమానతలకు అతీతంగా జరగాల్సిన అవసరం ఉన్నది . జీవితం ఒక్కటే కనుక  ప్రతి వ్యక్తి తన ఉనికి చాటుకోవడం కోసం,  తన వ్యక్తిత్వాన్ని  ఆదర్శంగా నిలుపుకోవడం కోసం , సామాజిక ధర్మాన్ని గుర్తించి  సమ సమాజం వైపుగా  సాగడానికి తన వంతు  సామాజిక స్ఫూర్తితో కృషిని కొనసాగించడం  ప్రతి వ్యక్తి తన నిత్య కృత్యంగా భావించినప్పుడు  అనేక సామాజిక రుగ్మతలు  పోరాటాలతో పాటుగా వాటంతటవె సద్దుమణుగు తాయి . కష్టాల్లో , ఆపదల్లో,  ప్రకృతి బీభత్సాల సమయంలో,  ప్రమాదాలు, మృత్యువాత,  వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎదురవుతున్న సమస్యల  సందర్భంలో కూడా  మనిషిని మనిషి పలకరించడం ద్వారా  కుల మతాలకతీతంగా జరిగే ఈ కార్యక్రమం  రాబోయే తరాలకు  ఆదర్శంగా నిలబడాలి .నేటి వృద్ధతరంతోపాటు మధ్య వయస్కులకే  పరిమితమైనటువంటి సజీవ మానవ సంబంధాల సారాంశాన్ని  నేటి యువత అంటే రేపటి పౌరులకు  వారసత్వంగా అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది . కాలానుగుణంగా ప్రస్తుత బాలలు లేదా యువతలో  మానవతా కోణం తక్కువ అని అనేక విమర్శలు చర్చలు కొనసాగుతున్న సందర్భంలో  అలాంటి వాటిని రూపుమాపవలసిన అవసరం కూడా మన అందరి పైన ఉన్నది . కుటుంబంలోని సభ్యుల యొక్క  పరిచయాలు, సంబంధాలు ,బంధుత్వాలు,  కొందరి ప్రాముఖ్యతలు,  మరికొందరి  చరిత్ర , నిర్వహించిన వినూత్న కార్యక్రమాలు, పోషించిన పాత్రలు, సాధించిన విజయాల పైన  కుటుంబాలలో చర్చ జరగాలి. నేటి తరా నికి పరిచయం చేయాలి  ఈ రకమైన కృషి అన్ని కుటుంబాలలో సమాజము నిండా జరిగినప్పుడు  తప్పకుండా  కొన్ని సామాజిక రుగ్మతలైనా వాటంత అవే  కనుమరుగవుతాయి.  విప్లవాలు, ఉద్యమాలు  ప్రజా జీవన  ప్రమాణాలను సాధించుకోవడానికి ఎంత ముఖ్యమో  అంతే సమాంతరంగా  మానవతా విలువలు కూడా పనిచేస్తాయి అని గుర్తించడం చాలా అవసరం.  టీవీ ప్రసారాలు, సినిమాలు, సీరియళ్లు,  సెల్ ఫోన్ లో  కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ,ప్రదర్శనలు  ప్రస్తుత నాగరికతను నేటి యువతను  వృద్ధులను  యావత్తు సమాజాన్ని  బ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో  ప్రజా పోరాటాలతో పాటు ప్రభుత్వాల యొక్క నియంత్రణ చర్యలతో  ఇలాంటి దృశ్చర్యలను దుష్ట ప్రదర్శనలను అణిచివేయగలగాలి.  సమానత్వాన్ని సాధించే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెడితే,  మానవ విలువలను ప్రబోధించే పాఠశాల స్థాయిలో  కృషి తీవ్రంగా జరిగితే,  వ్యక్తిలోని బలహీనతల స్థానంలో  ఆత్మస్థైర్యాన్ని నింపగలిగే అవకాశం ఉంటుంది. తద్వారా  సామాజిక రాజకీయ ఆర్థిక వ్యక్తిగత పరిస్థితులలో భిన్నత్వం ఉన్నప్పటికీ  మనుషులంతా సమానమే అనే  విశాల భావనను తీసుకురావడానికి అవకాశం సాధ్యం. "మెరుగైన సమాజానికి ఆర్థిక పరిస్థితులు  మెరుగు పడడం ఎంత ముఖ్యమో  మానవ సంబంధాలు బలపడడం కూడా అంతే ముఖ్యం . తద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని  భి న్న పరిస్థితుల మధ్యన మనుషులమని అనిపించుకునే  మానవతా కోణాన్ని సాధించడానికి అవకాశం ఎక్కువ,   అంతిమంగా సాధించవలసినది అదే,  మెరుగైన సమాజానికి  బలమైన మానవ సంబంధాలు గల  ఉన్నత స్థితియే  గిటు రాయి .

--వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్  సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ. నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)