ప్రమాణ స్వీకారం రోజే ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తా: సీఎం కేసీఆర్

స్టేషన్ ఘన్ పూర్:నవంబర్ 20
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.
ఆర్టీసీ బిడ్డలు ఉన్నారు. వాళ్లది పాపం ఎప్పుడు ఉద్యోగం పోతదో తెల్వదు. ఒక అభద్రతా భావం. ఆర్టీసీ బిల్లు పాస్ చేసినం. అది గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల అది కొంత ఆలస్యమైంది. ఎలక్షన్ తెల్లారే ఆర్టీసీ బిడ్డలను రెగ్యులరైజ్ చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు.
ఆటో రిక్షా కార్మికులకు ఫిట్‌నెస్ ట్యాక్స్ రద్దు
మన వద్ద లక్షల మంది ఆటో రిక్షా బిడ్డలు ఉన్నారు. ఇండియా మొత్తంలో ఆటో రిక్షాలకు ట్యాక్స్ ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో లేదు. వారు పేదవాళ్లు బతుకుతున్నారని ట్యాక్స్ మినహాయింపు ఇచ్చాం.
వాళ్లకు ఇంకో సమస్య ఉంది. ఏందంటే ఫిట్‌నెస్ కోసం పోతే ఏడాదికి రూ. 1200 కట్టాల్సి వస్తుంది. అది కూడా ఎలక్షన్ తెల్లారి రద్దు చేస్తామని చెబుతున్నా. ఆటో రిక్షా కార్మికులకు కూడా ఫిట్‌నెస్ ట్యాక్స్, పర్మిట్ ట్యాక్స్ రద్దు రద్దు చేస్తామని కేసీఆర్ అన్నారు.
ప్రభుత్వానికి రూ. 100 కోట్ల నష్టం వస్తది అయినా పర్వాలేదు. వాళ్లు పేదవాళ్లు ఐదారు లక్షల మంది ఆటో నడిపి బతికేవారు ఉన్నారు. వాళ్ల సంక్షేమం కోసం అది కూడా చేస్తామని కరీంనగర్‌లో ప్రకటన చేశాను. ఆ విధంగా ఆటో కార్మికులను ఆదుకుంటాం. అలా ప్రతి వర్గాన్ని ఆదుకుంటూ ముందుకు పోతున్నాం కేసీఆర్ తెలిపారు.