ప్రభుత్వం మారాలని ఎందుకు కోరుకుంటున్నారు?

ప్రభుత్వం మారాలని ఎందుకు కోరుకుంటున్నారు?

ఒకే పార్టీ సుదీర్ఘకాలం పనిచేయడం కూడా ఆరోగ్యకరము కాదు అనే భావన  కారణమేమో!

ప్రజలే నిజమైన విశ్లేషకులు  వారి తీర్పును శిరసా వహించడం  రాజకీయ పార్టీల కర్తవ్యం.

అవినీతిపై చర్చ జరుగుతోంది . అది కూడా బలమైన కారణ0  కావచ్చు!

తెలంగాణ రాష్ట్రంలో  ప్రస్తుత బిఆర్ఎస్ ప్రభుత్వం  గద్దే దిగాలని,  అధికార మార్పిడి జరగాలని, అవినీతి పైన తగు విచారణ జరపాలని, ప్రజాధనం   దుర్వినియోగమైన విషయంపై  సర్వత్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో  రాజకీయ సామాజిక విశ్లేషకులు మేధావుల కంటే మిన్నగా  సామాన్య ప్రజలే తమ స్పందనను  సూటిగా తెలియచేయడం ప్రజాస్వామ్య బలోపేతానికి నిదర్శనంగా భావించాలి.  ఇతర రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలతో పాటు  ప్రజలు  రాబోయే ప్రభుత్వం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు అనడంలో సందేహం లేదు.  ప్రజలు కూడా  మీడియా  పరిశీలన, క్షేత్ర పర్యటనలో పలానా పార్టీకి తమ ఓటు అని స్పష్టం చేయకపోయినప్పటికీ  ప్రస్తుత ప్రభుత్వం వల్ల తమకు లాభం జరగలేదని  10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ప్రయోజనం శూన్యమని కొందరంటే , కొన్ని రకాల సౌకర్యాలు కల్పించిన మాట వాస్తవం కానీ  అర్హులైన వాళ్లకి కొందరికి పెన్షన్ రాలేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు  దళిత బంధు బీసీ బందు  ఇతర పథకాలన్నీ కూడా అధికార పార్టీ  సభ్యులకే అందినాయని  ఆరోపిస్తున్న వాళ్లు మరికొందరు ఉన్నారు . ఇక  కట్టిన ప్రాజెక్టులు,   ఇండ్లు , వాటర్ ట్యాంకులు,  నీటిపారుదల కాలువలు , దేవాలయాలు,  చివరికి సచివాలయం కూడా  నాణ్యత లేకుండా అతికొద్ది కాలంలో నిర్మించినట్లు  ఇందులో అవినీతి పెద్ద మొత్తంలో జరిగినట్లు  ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టు లోనే 70 వేల కోట్లు చేతులు మారినట్లు  కాంగ్రెస్ తో సహా బిజెపి ఇతర రాజకీయ పార్టీలు  విమర్శిస్తూ ఉంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడం ఆ ఆరోపణకు మరింత బలాన్ని చేకూర్చినట్లు అవుతున్నదని కొంతమంది ప్రజలు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఈ సందర్భంగా సిద్ధాంతం, ఆచరణ, ప్రయోజనాల రీత్యా ఆలోచించినప్పుడు  ప్రస్తుత ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి గల కారణాలను  ప్రజల కోణంలో  ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా విశ్లేషించుకోవడం  అటు ప్రభుత్వానికి, ఇటు విపక్షాలకు, ప్రజలకు అందరికీ కూడా మంచిదేమో!

1) ఆకాంక్షలు అమలు కాకపోవడం

తెలంగాణ ఉద్యమ కాలంలో  లక్ష్యంగా పెట్టుకున్న  ప్రజల ఆకాంక్షలు అమలు కాలేదు అనే ఆరోపణ స్పష్టంగా వినబడుతున్నది . ఇప్పటికీ ఆనాటి ఉద్యమకారులు కేసుల చుట్టూ తిరుగుతూ అష్ట కష్టాలు పడుతూనే ఉన్నారు  .మలిదశ ఉద్యమంలో సుమారు 1400 మంది అసువులు బాసినట్లయితే  వారిని గుర్తించకపోవడం,  ఆ కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వకపోవడం, గౌరవించకపోవడం  పెద్ద లోపంగా ఉద్యమకారులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నీళ్లు నిధులు నియామకాలు  అని స్పష్టంగా ప్రకటించుకున్నప్పటికీ  కేవలం మద్యపానం ద్వారానే ఆనాడు పదివేల కోట్ల ఆదాయం వస్తే ప్రస్తుతం 45 వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చినట్లు  తాగుబోతుల రాజ్యంగా  లోకానికి పరిచయం చేసినట్లు  బలమైన ఆరోపణలు ఉన్నాయి.  ఉద్యోగాల భర్తీ విషయంలో అరకొరగా  అమలు కావడం  నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి బోర్డులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరంతరం  లీకేజీలతో  నత్త నడక నడుస్తుంటే సుమారు 35 లక్షల నిరుద్యోగులు  వీధిన పడ్డారని ఆరోపణ బలంగా వినబడుతున్నది దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు.  ఇక నీళ్ల కోసం ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ  కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు  పిల్లర్లు కుంగిపోతుంటే  మిగతా అన్ని రకాల ప్రాజెక్టులు కూడా ఇంతే అనే అప నమ్మకం బలంగా ఏర్పడింది.  రైతులకు వనగోరే లాభం కంటే  పెట్టుబడి రెట్టింపు ఉన్నప్పుడు  ఆ ప్రాజెక్టు ఎవరి ప్రయోజనం కోసమో ఇప్పటికీ అర్థం కాకపోవడం,  అవినీతి పైన విమర్శలు వస్తుంటే ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం,  నాసిరకం నిర్మాణం పైన ప్రభుత్వ స్పందన లేకపోవడం కూడా  ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పని చేసినట్లు అనే ముద్ర ప్రజల్లో బలంగా పడింది  .

2) ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం  :-

దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని ఎవరు అడగకుండానే ఇచ్చిన హామీ నీరుగారిపోయింది . దళితులకు మూడెకరాల భూమి  ప్రకటన అటుకెక్కినది.  అఖిలపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తామని ఇచ్చిన హామీ  తుంగలో తొక్క  బడి నది.  నిరుద్యోగ యువతకు  భృతి ఇస్తామని  అమలు చేయలేదు.  ప్రకృతి  గుట్టల విధ్వంసాన్ని  అడ్డుకుంటామని  మాట ఇచ్చిన ప్రభుత్వంలోని  సభ్యులే  గుట్టల విధ్వంసానికి పాల్పడుతుంటే  ప్రభుత్వం మౌనం దా ల్చినది . డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం  అమలుకు నోచుకోకపోగా  ఇండ్లు ఉద్యోగాలు ఉన్నవారికి  కేటాయించబడి  ప్రభుత్వ వైఫల్యం  సూటిగా దర్శనమిస్తున్నది.  అనేకచోట్ల  కనీసం నీడ కూడా నోచుకోని తమకు ఎలాంటి అవకాశాలు లేవని  ఉన్నవాళ్లకే అవకాశాలు కల్పిస్తున్నారని ఎక్కడికక్కడ నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు,  పోరాటానికి సిద్ధపడుతున్నారు.

 3) ప్రపంచం నివ్వెర    పోయే పరిపాలన ఇదేనా?:-
తెలంగాణ ఉద్యమ కాలంలో అధికారంలోకి వస్తే ప్రపంచం నివ్వే ర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం  రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా చిత్రీకరించి  మందు ఏరులై పారుతుంటే  ప్రజల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు లెక్కచేయకుండా  ఆదాయం కోసమే పనిచేయడం ..... ఇదేనా   నివ్వెర పోయే పరిపాలన ? .నిరుద్యోగ నిర్మూలన జరగలేదు,  మిగులు భూముల పంపిణీకి  ఆలోచన లేదు,  పేదరిక నిర్మూలనలో ఎలాంటి చర్యలు లేవు. దినసరి కూలీలు వలస జీవులు  పేద వర్గాల జీవితాలలో వెలుగులు లేవు.  ఉమ్మడి రాష్ట్రం కంటే విద్యకు బడ్జెట్లో  అత్యంత అల్ప స్థాయిలో నిధుల కేటాయింపు  ఆనాడు 17% ఉంటే ప్రస్తుతం 7 శాతం.  ఇక ప్రతి అభివృద్ధి పథకం కూడా అధికార పార్టీ కార్యకర్తలకు అమలు చేసినారనే ఆరోపణలు వెల్లువెత్తుతుంటే  ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు . కౌలు రైతులను అసలు రైతులు గానే చూడని ప్రభుత్వం  గుట్టలు అడవులు  సాగు చేయని  భీ డు భూములకు కూడా రైతుబంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారని  చర్చలు, గుసగుసలు, చివరికి ఎదురు దాడులు కూడా జరుగుతుంటే  ప్రజల శక్తిని   ఆపడం ఎవరి తరం.

4) కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు  ప్రజల పాలిట శాపాలు :

మేధావులుహక్కుల కార్యకర్తలు విద్యావంతులతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగును గమనిస్తున్నది.  ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నది చైతన్యాన్ని సమీకరించుకున్నది  అది నిజంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి చాలా అవసరం . ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న  బారాస అధికారంలోకి వచ్చిన తర్వాత  నిరసన తెలిపే హక్కును హరించి వేసినది . ఉద్యమాలు ధర్నాలు పికటింగులకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ అరెస్టులతో  ప్రజా స్వేచ్ఛను అడ్డుకుంటున్నది.  నిరసన తెలిపే  ప్రదేశంగా ముద్రపడిన ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజల ఆగ్రహానికి గురై  చివరికి పోరాటంతో పాటు న్యాయస్థానం ద్వారా మాత్రమే సాధించుకోగలిగినామంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకున్నదో అర్థం చేసుకోవచ్చు . ఇక ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేసే క్రమంలో ఇతర రాజకీయ పార్టీల నుండి శాసనసభ్యులను  ప్రోత్సహించి చేర్చుకొని  చట్టసభల మౌలిక లక్ష్యాన్ని  దెబ్బతీసినది.  చట్టసభల  పని దినాలు  ఉమ్మడి రాష్ట్రం కంటే ఘోరంగా తగ్గిపోయినవి.  అంతో ఇంతో పోరాట పటిమతో  ప్రజల పక్షాన పని చేసే వామపక్షాలను   లొంగదీసుకోవడంతోపాటు  ప్రజలను బానిసలుగా యాచకులుగా మార్చినట్లు  పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.  విద్యా వైద్యం ప్రైవేటీకరించబడి  ప్రభుత్వ రంగాన్ని  ఖూనీ చేసిన విధానం స్పష్టం . ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతించి  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యపరిచిన విషయం  కాదనలేము కదా!  ఇక వైద్యరంగం పూర్తిగా  ప్రైవేటుకు దారా దత్తం కాగా  ఎలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రారంభించబడలేదు. కాయిలాడిన పరిశ్రమలను తెరిపించలేదు  కేవలం ఐటి రంగాన్ని మాత్రమే  అభివృద్ధి చేసి  ప్రభుత్వ రంగాన్ని విస్మరించి  కేంద్ర ప్రభుత్వ పాలసీని విమర్శించడంలో అర్థం ఏమున్నది ?
     రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఆశించినది ఒకటి  ఊహించిన దానికి భిన్నంగా జరుగుతుంటే  కేవలం వివిధ పథకాల పేరుతో ఉచితాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి  మౌలిక సౌకర్యాలను కల్పించకుండా  ప్రలోభ పెట్టే విధానం  మద్యం డబ్బు పంపిణీ  గత పదిహేనే ళ్లుగా తారాస్థాయికి చేరుకుంటే  కులాల వారి సమీకరణలు , ప్రభుత్వ భూముల అమ్మకాలు,  అనుచరులకు అప్పనంగా దారా దత్తం చేయడం , శాసనసభ్యులు  ఏదో ఒక రకంగా భూ ఆక్రమణలు అక్రమార్జనలో మునిగి తేలడం,  ప్రజాధనాన్ని పాలకవర్గాలు దోచుకున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం కావడాన్ని గమనిస్తే  బహుశా ప్రజలు ఇదే ప్రభుత్వాన్ని తిరిగి కొనసాగించడానికి సిద్ధంగా లేకపోవచ్చునని  నివేదికలు  సర్వేలు వ్యక్తం చేస్తున్నాయి.  డబ్బు పంపిణీ చేసే పథకాలు  మాత్రమే పరిపాలన కాదు.  అదేదో తమ జేబు నుండి ఇచ్చినట్లుగా  తమ పేరుతో ప్రచారం చేసుకుంటున్న కొన్ని పథకాలను కూడా  అమలు చేయడంతో పాటు  ఎక్కువగా ఎన్నికలు ఉప ఎన్నికల్లో  మంత్రివర్గం  అధిక సమయాన్ని కేటాయించినట్లు  పరిపాలన కంటే పార్టీ ప్రచార కార్యక్రమాలకే  సమయాన్ని వినియోగించి  తమ వేతనాలను భారీగా పెంచుకున్నట్లు బల మైన విమర్శలు ఉండనే ఉన్నాయి. . ఈ అంశాలన్నీ కేవలం విద్యావంతులకే కాదు సామాన్య జనానికి కూడా  చేరినవి కనుకనే  ఆలోచిస్తున్నారు,  ప్రత్యామ్నాయ ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు, అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నారు  అని  మేధావులు విశ్లేషణ చేస్తున్నారు  రాజకీయ పార్టీలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి . "నిజంగా కూడా ఐదేళ్లకు పైగా ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టకూడదు  అనేది తమిళనాడు ఇతర కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను చూసినప్పుడు మనకు అర్థమయ్యే సాధారణ విషయం.  ప్రజలను ప్రభువులు గా చూడాలంటే పాలకులు ఒక్క టర్మ్ మాత్రమే కొనసాగాలి . అధికారం  శాశ్వతం అయితే ప్రజలు యాచకులుగా మిగిలిపోవడం ఖాయం.  అందుకే కాబోలు ప్రజలు చైతన్యమై  మార్పు కోసం ప్రయత్నిస్తున్నారని  ముగింపుకు రాక తప్పడం లేదు.

--  వడ్డేపల్లి మల్లేశం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)